
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లపై సర్కార్ శీతకన్ను కొనసాగుతోంది. గత మూడు నెలల నుంచి హాస్టళ్ల మెస్ బిల్లులు ఇంకా విడుదల చేయకపోవడమే దీనికి నిదర్శనం. హాస్టల్ మెస్ బిల్లులు మాత్రమే కాకుండా ఎన్‌టీఆర్ విదేశీ విద్యా దీవెన ఫీజురీయింబర్స్‌మెంట్, సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థుల మెస్ చార్జీలు కూడా విడుదల కాలేదు. దీంతో సంక్షేమ హాస్టళ్ల వార్డెన్‌లు, విదేశాల్లో చదువుకుంటున్నవారు, సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, కాపు కార్పొరేషన్ నుంచి సుమారు రూ.500 కోట్ల వరకు బిల్లులు విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. సంక్షేమ హాస్టళ్లలో ప్రస్తుతం 3,39,664 మంది విద్యార్థినీవిద్యార్థులు (కాలేజీ, ప్రీమెట్రిక్) చదువుకుంటున్నారు.
సాంఘిక సంక్షేమ శాఖలో 1,065, గిరిజన సంక్షేమ శాఖలో 639, బీసీ సంక్షేమ శాఖలో 1,137 చొప్పున మొత్తం 2,841 హాస్టళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా గురుకుల విద్యాలయాలు కూడా ఉన్నాయి. హాస్టళ్లకు జనరల్ బడ్జెట్ నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. బిల్లులు పెట్టినా కాంప్రహెన్షివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీఎఫ్‌ఎంఎస్)లో పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్థిక శాఖకు ప్రభుత్వ పెద్దల ఆదేశాలు పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలకు ముందుగా నిధులు ఇవ్వాలని ఆదేశించడంతో సాధారణ బిల్లులకు నిధులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో అప్పులు ఇచ్చినవారు హాస్టల్ వార్డెన్‌లపై ఒత్తిడి మొదలు పెట్టారు. ఒక్కో హాస్టల్ వార్డెన్ కనీసం రూ.ఐదు లక్షల వరకు అప్పులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న హాస్టల్ వార్డెన్‌ల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ప్రతి సంక్షేమ శాఖలోనూ హాస్టళ్ల మెస్ బిల్లుల బకాయిలు సుమారు రూ.100 కోట్లకు పైనే పేరుకున్నాయి.
విదేశీ విద్యాదీవెన.. ఇబ్బందులెన్నో..
ఎన్టీఆర్ విదేశీ విద్యాదీవెన కింద విదేశాల్లో విద్యనభ్యసిస్తున్నవారికి మూడు నెలలైనా ఫీజురీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదు. ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచి కొత్తగా దరఖాస్తులు చేసుకున్నవారికి, రెండో విడత రీయింబర్స్‌మెంట్ ఇవ్వాల్సినవారికి ఆపేశారు. దీంతో విదేశాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చూసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. కొందరు పెట్రోల్ బంకుల్లో గంటల ప్రకారం పనిచేసి వచ్చిన డబ్బులతో కాలం గడుపుతున్నారు. ఆస్ట్రేలియా వెళ్లినవారిలో సుమారు 90 శాతం మందికి రెండో విడత ఇవ్వాల్సిన ఫీజురీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదు. నాలుగు నెలల క్రితం ఎంపిక చేసినవారికి జిల్లాల డీడీలు నిధులు విడుదల చేయలేదు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే ట్రెజరీల్లో డబ్బులు లేవని, అవి రాగానే విడుదల చేస్తామని, బిల్లులు పెట్టామని డిప్యూటీ డైరెక్టర్‌లు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు, కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్‌లలో ఈ దుస్థితి ఉంది.
సివిల్స్ అభ్యర్థుల గగ్గోలు
ఇక సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు ఇవ్వాల్సిన డైట్ చార్జీలను కూడా సకాలంలో ఇవ్వలేదు. ఒకటీ, అరా ఇన్‌స్టిట్యూషన్‌లలో కొంత మొత్తం ఇచ్చినా మిగిలిన సంస్థలకు ఇవ్వలేదు. కోచింగ్ తీసుకుంటున్న నగరాన్ని బట్టి ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు అభ్యర్థుల భోజన, వసతి ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. అయితే, ఇవ్వకపోవడంతో ఢిల్లీ, బెంగళూరు, చెన్నైల్లో కోచింగ్ తీసుకుంటున్నవారు నానా అవస్థలు పడుతున్నారు. రూము అద్దెలు, మెస్ చార్జీలు సకాలంలో చెల్లించకపోవడంతో యజమానులు ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వకపోవడంతో బయట అధిక వడ్డీలకు అప్పులు చేసి తామే అద్దెలు, మెస్ బిల్లులు కట్టుకుంటున్నామని చెబుతున్నారు. అధికారులను ఈ విషయమై ప్రశ్నిస్తే.. పరిశీలించాల్సి ఉందని మాటదాటేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment