శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఏపీ విద్యా సంక్షేమ మౌలికవనరుల అభివృద్ధి కార్పొరేషన్(ఏపీఈడబ్ల్యూఐడీసీ) ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న పనులకు బిల్లులు మంజూరుకాక కాంట్రాక్టర్లు అవస్థలు పడుతున్నారు. నిర్మాణం పూర్తిచేసుకుని ఎనిమిది నెలలు కావస్తున్నా బిల్లుల మంజూరుకు అవరోధం ఏర్పడుతోంది. ఈ సంస్థ ద్వారా ఆర్‌ఎంఎస్‌ఏ(రాష్ట్ర మాధ్యమిక శిక్షా అభియాన్), సంక్షేమ వసతి గృహాల నిర్మాణం, మరమ్మతులు చేపడుతున్నారు. వీటికి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో భవనాలు లేక విద్యార్థులు, నిర్మాణం పూర్తయినా డబ్బులు అందక కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధంగా జిల్లా మొత్తమ్మీద సుమారు రూ. 14కోట్లు వరకు బకాయిలున్నాయి.
వాస్తవానికి ఈ సంస్థ ద్వారా జరిగే నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం 75శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25శాతం బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవన్న సాకుతో తమ వాటా చెల్లించక మొత్తం బిల్లులే నిలిచిపోయాయి. పైగా కేంద్రం విడుదల చేసిన నిధులన్నీ సర్కారు దారి మళ్లించేస్తోందనీ, వేరే అవసరాలకు వినియోగిస్తోందనీ కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌ఎంఎస్‌ఏ(రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్) పేరిట ఉన్నత పాఠశాలలకు రూ. 29 నుంచి రూ. 35 లక్షల అంచనా విలువతో 80వరకు భవనాలు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఇవి వివిధ దశల్లో ఉన్నాయి.
బిల్లులు మాత్రం ఆ మేరకు మంజూరు కాలేదు. ఇంకొన్ని భవనాలు గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలలో పూర్తి చేశారు. వాటికీ ఒక్కోదానికి రూ. 12 లక్షల నుంచి రూ. 18 లక్షల వరకు బకాయిలున్నాయి. ఈ ఆర్‌ఎంఎస్‌ఏ భవనాలకు సంబంధించి మొత్తం రూ. 12 కోట్ల వరకు బకాయిలున్నాయి. ఎనిమిది నెలలుగా బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఎదురు చూస్తున్నారు. సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి జిల్లాలో 12 పనులు మంజూరయ్యాయి. వీటిలో రెండు నూతన భవనాలు నిర్మించాల్సి ఉండగా, మిగిలిన 10 గురుకులాల్లో భవనాల మరమ్మతులు చేయాల్సి ఉంది. ఈ పనులు కూడా పూర్తయి సుమారుగా ఆరునెలలు కావొస్తోంది. వీటికీ రూ. రెండుకోట్ల బకాయి చెల్లించాల్సి ఉంది. బకాయిల విషయమై ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈఈ జగ్గారావువద్ద ప్రస్తావించగా బిల్లుల కోసం పలుమార్లు ప్రభుత్వాన్ని కోరామని, వారు మంజూరు చేయాల్సి ఉందని తెలిపారు.
పనులు జరిగినా... బిల్లులేవీ?
Published Thu, Jun 11 2015 11:57 PM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM
Advertisement
Advertisement