సంక్షోభ హాస్టళ్లు!
సీట్ల భర్తీ కోసం అధికారుల పాట్లు
జిల్లాలో మూడుచోట్ల హాస్టళ్ల మూసివేత
అయోమయంలోతల్లిదండ్రులు
జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు సంక్షోభంలో చిక్కుకున్నాయి. హాస్టళ్లలో వసతులు.. చదువులు అంతంతమాత్రంగా ఉండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు విముఖత చూపుతున్నారు. ఫలితంగా సంక్షేమ హాస్టళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. విద్యార్థులు లేక ఇప్పటికే మూడు హాస్టళ్లు మూతపడగా, మరిన్ని హాస్టళ్లు అదే దారిలో నడుస్తుండడం అధికారులకు గుబులు పుట్టిస్తోంది.
చిత్తూరు (గిరింపేట) : సాంఘిక సంక్షేమ వసతి గృహాల పరిస్థితి దయనీయంగా మారింది. సీటిస్తాం.. మీ పిల్లల్ని హాస్టల్‌కు పంపండి అంటూ ఆయా హాస్టళ్ల వార్డెన్లు ఇల్లిల్లూ తిరిగినా స్పందన లేదు. ఎస్సీ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య వేలల్లో తగ్గిపోయింది. వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఇవి మూతపడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 123 ఉన్నాయి. వీటిల్లో 12వేల సీట్లు భర్తీ చేయాలి. అయితే ఇప్పటివరకు దాదాపు పది వేలలోపే భర్తీ అయ్యాయి. రెండు వేల సీట్లు వరకు భర్తీ కావాల్సి ఉంది. బీసీ వేల్ఫేర్ హాస్టళ్లు 65 ఉండగా ఇందులో 8,500 సీట్లు భర్తీ చేయాలి. కానీ ఇప్పటివరకు ఏడువేల లోపే భర్తీ అయ్యాయి. ఇంకా 1,500 సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. ఎస్టీ హాస్టళ్లు 12కు గాను 1,200 సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఏ డు వందల లోపే సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన 500 సీట్లు భర్తీ చేసేందుకు అధికారుల పాట్లు అన్నీఇన్నీకావు. ఇది లావుండగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో బీసీ వేల్ఫేర్ హాస్టళ్లు కార్వేటినగరంలో ఒకటి, శ్రీకాళహస్తిలో ఒకటి మూసేందుకు అధికారులు సంబంధిత అధికారులకు నివేదిక పంపారు. ఇక్కడున్న విద్యార్థులను సమీపంలోని గురుకుల పాఠశాలల్లో చేర్పించనున్నట్లు వారు వెల్లడించారు.
విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది
పుత్తూరు సహాయక సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని బాలికల హాస్టల్‌లో గత సంవత్సరం 128 మంది విద్యార్థులుండేవారు. ప్రస్తుతం ఎంత ఉన్నారో కూడా చెప్పలేని పరిస్థితి. కార్వేటినగరంలోని బాలుర హాస్టల్ రెండులో గత సంవత్సరంలో 47 మంది విద్యార్థులుండగా ప్రస్తుతం దాదాపు ఖాళీ అయిపోయింది.సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం బాలుర హాస్టల్‌లో గత ఏడాది 82 మంది ఉండగా ప్రస్తుతం 40కి తగ్గిపోయింది. చిత్తూరు సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని అరుల్‌పురం బాలుర హాస్టల్, చిత్తూరు బాలికల హాస్టల్-2, పెద్దతిప్పసముద్రం మండలంలోని కందుకూరు బాలుర హాస్టల్ ఇప్పటికే మూతపడ్డాయి. ఆయా హాస్టళ్లలో నామమాత్రంగా ఉన్న విద్యార్థులను సమీపంలోని గురుకుల పాఠశాలలకు చేర్చాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కానీ వీరిని ఇంకా ఎక్కడా చేర్చకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
మరో రెండేళ్లలో 30 మంది విద్యార్థులున్న హాస్టళ్లలన్నింటినీ గురుకుల పాఠశాలల హాస్టళ్లలోకిమార్పు చేసేందుకు కసరత్తు సాగుతోంది.
అన్నీ ఉన్నా.. హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య పెం చుకునేందుకు అధికారులు ఈ ఏడాది విద్యార్థులకు అవసరమైన స్టడీమెటీరియల్, యూనిఫాం, దుప్పట్లు సిద్ధం గా ఉంచారు. అయినా విద్యార్థుల తల్లిదండ్రుల్లో స్పందన రావడం లేదు. ఈ ఏడాది కనీస సంఖ్యలో కూడా ప్రవేశా లు లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మండలాల్లో వెలుస్తున్న ప్రైవేటు పాఠశాలలకు తోడు, కస్తూర్బా పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వైపే మక్కువ చూపుతున్నారని వారు అంటున్నారు.