తాండూర్‌లోని సాంఘిక సంక్షేమ వసతి గృహం
తాండూర్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహం సమస్యలకు నిలయంగా మారింది. మౌళిక వసతులు కానరావడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చుట్టూ వెక్కిరిస్తున్న సమస్యలతో సహవాసం చేస్తున్నారు.
ఈ వసతి గృహంలో మొత్తం 85 మంది నిరుపేద విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. సుదుర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సమీప పాఠశాలల్లో చేరి చదువు కొనసాగిస్తున్నారు. మెరుగైన సౌకర్యాలతో ప్రశాంతమైన వాతావరణంలో విద్యనభ్యసించాల్సిన విద్యార్థులు వసతి గృహంలో ఏర్పడిన సమస్యలతో సతమతమవుతున్నారు.
మౌలిక సదుపాయాలు మృగ్యం..
వసతి గృహ ప్రాంగణంలో సుమారు రూ.7 లక్షలతో నీటి ట్యాంకు నిర్మించి ఐదేళ్లు గడుస్తుంది. అయినా నేటికీ దాన్ని వినియోగంలోకి తీసుకురాలేదు. పాత నీటి ట్యాంకు శిథిలావస్థకు చేరుకుని నీరు నిలువ ఉండటం లేదు. ఎప్పటికప్పుడు మోటార్ వేసుకుని ఇద్దరు, ముగ్గురు విద్యార్థులే ఒకసారి స్నానం చేసే పరిస్థితి నెలకొంది. నీటి సరఫరా లేకపోవడం వల్ల మరుగుదొడ్లు ఉపయోగపడడం లేదు. దీంతో ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులు రెల్వే ట్రాక్ పక్కన బహిర్భూమికి వెళుతున్నారు. దీనికి తోడు వసతిగృహానికి ప్రహరీ లేదు. దీంతో పందులు స్వైర విహారం చేస్తూ విద్యార్థులకు ఇబ్బందులను కలిగిస్తున్నాయి.
చలికి గజగజ..
హాస్టల్ గదుల్లో తలుపులు, కిటికీలు విరిగిపోయాయి. దీంతో విద్యార్థులు చలికి గజగజ వణుకుతూ రాత్రిళ్లు నిద్రించాల్సిన దుర్భర పరిస్థితులు ఉన్నాయి. లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ (ఆర్వో ) ప్లాంటు నేటికీ నిరుపయోగంగానే ఉంది. ఇలా అనేక సమస్యలు విద్యార్థులను వెంటాడుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన సమయంలో విద్యార్థులు సమస్యలు ఏకరువు పెట్టారు. సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఉన్నతాధికారులను ఆదేశించినా మార్పేమి లేకుండా పోయింది.
ఐదేళ్లుగా ఇన్‌చార్జిలే...
సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఐదేళ్లుగా ఇన్‌చార్జి వార్డెన్‌లే కొనసాగుతున్నారు. 2012 వరకు రెగ్యూలర్ వార్డెన్ నియమించిన అధికారులు ఆ తరువాత ఇన్‌చార్జిలతో సరిపెడుతున్నారు. ప్రస్తు తం ఉన్న వార్డెన్‌కు ఓ చోట రెగ్యులర్‌గా డ్యూటీ నిర్వహిస్తుండగా, మరో మూడిం టికి ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. దీంతో హాస్టల్, విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించలేకపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులతో పాటు పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment