హాస్టళ్ల మూసివేతకు నిరసనగా జీపు జాతా
Published Tue, Aug 2 2016 9:01 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల మూసివేతను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సంక్షేమ హాస్టళ్ళ పోరుబాట పేరుతో నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ, ఏపీ గిరిజన విద్యార్థి జేఏసీ తలపెట్టిన జీపు జాతాను మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ప్రారంభించారు. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలకు బయల్దేరిన జీపు జాతాను నగరంపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాలలో సోమవారం ప్రారంభించారు. నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.అయ్యస్వామి మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో పాఠశాలలు, హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉప సంహరించుకోవాలన్నారు. ఏపీ గిరిజన విద్యార్ధి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కె. పాండునాయక్ గిరిజన విద్యార్థుల సమస్యలపై మంత్రి రావెల కిషోర్‌బాబుకు చిన్నచూపు తగదన్నారు. గురుకులాల పేరుతో హాస్టళ్లను మూసివేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్, నాయకులు రాజేష్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement