
వసతికి మంగళం!
సంక్షేమ హాస్టళ్ల మూసి వేత వైపే ప్రభుత్వం మొగ్గు
దశల వారీగా విద్యార్థులను గురుకులాల్లో చేర్పిస్తున్న వైనం
గత ఏడాది 12 ఎస్సీ హాస్టళ్ల మూసివేత
ఈ ఏడాది 47 హాస్టళ్ల మూసివేతకు రంగం సిద్ధం
నేడు జిల్లా కమిటీ సమావేశంలో నిర్ణయం
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను మూతవేసే దిశగా రంగం సిద్ధం అవుతోంది. ఆ గృహాల్లో విద్యార్థులు తక్కువ ఉన్నారనే నెపంతో పాటు మెరుగైన విద్యను అందిస్తామనే సాకుతో పాలకులు వసతికి మంగళం పాడనున్నారు. ఇదే కారణంతో గత ఏడాది 12 ఎస్సీ హాస్టళ్లను మూసేశారు. ఈ విద్యా సంవత్సరంలో మరో 32 ఎస్సీ, 15 బీసీ హాస్టళ్లు మూత పడనున్నాయి.
కడప రూరల్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను బలోపేతం చేయాల్సిన పాలకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మెరుగైన వసతులు కల్పించి మరింత మంది విద్యార్థులు చేరేలా చర్యలు తీసుకోవాల్సింది పోయి, విద్యార్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో ‘సంక్షేమం’పై వేటు వేస్తున్నారు. ప్రతి ఏడాది 25 శాతం చొప్పున హాస్టళ్ల సంఖ్యను తగ్గించాలని పాలకులు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 131, గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షణలో 10, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 60 మొత్తం 201 హాస్టళ్లు ఉన్నాయి. 131 ఎస్సీ హాస్టళ్లలో 10,629 మంది బాల, బాలికలు వసతి పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లలో 50 మంది కంటే తక్కువగా విద్యార్థులు ఉన్నారనే కారణంతో ఈ ఏడాది 32 హాస్టళ్లు మూత పడనున్నాయి.
ఇదే కారణంతో గడిచిన విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 12 ఎస్సీ హాస్టళ్లు మూత పడ్డాయి. బీసీ హాస్టళ్లు 60 ఉండగా వాటిల్లో మొత్తం ఏడు వేల మందికి పైగా బాల, బాలికలు ఉంటున్నారు. ఇందులో 22 హస్టళ్లు ప్రైవేట్ భవనాల్లో నడుస్తుండగా ఇపుడు 15 హాస్టళ్ల తలుపులను పాలకులు శాశ్వతంగా మూతవేయనున్నారు. ఎస్టీ హాస్టళ్లు 10 ఉన్నాయి. వీటిల్లో 1014 మంది బాల, బాలికలు ఉన్నారు. పోరుమామిళ్ల, రాయచోటి,టి సుండుపల్లె (బాలుర), పులివెందుల (బాలికల) హాస్టళ్లలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నారు. మిగతా ఎస్టీ హాస్టళ్ల విషయమై నిర్ణయం తెలియాల్సి ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది హాస్టళ్లు మూత పడనున్నాయి. ఈ లెక్కన రానున్న మూడేళ్లలో దశల వారీగా హాస్టళ్లు దాదాపుగా మూత పడనున్నట్లు తెలుస్తోంది.
గురుకులాల్లో గురి కుదిరేనా...?
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టాక నిరుపేదల విద్యా సంక్షేమ రంగం కుదేలవుతోంది. గడిచిన ఏడాది 50 మంది కంటే తక్కువ ఉన్న విద్యార్ధులు, ప్రైవేట్ భవనాల్లో హస్టళ్లు ఉన్నాయనే కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా హాస్టళ్లను మూసేశారు. మూసివేతను వ్యతిరేకించిన విద్యార్థులు, విద్యార్థి సంఘాల ఆందోళనలను ప్రభుత్వం ఏమాత్రం చెవికెక్కించుకోలేదు. నాకుండేది మూడే కాళ్లు అన్న చందంగా తాను అనుకున్న పనిని చేసుకుపోయింది. ఇప్పుడు కూడా అదే సూత్రాన్ని అమలు చేయడానికే నిర్ణయించుకుంది. ఆ మేరకు ప్రభుత్వం ఇటీవల ఆ శాఖలకు సర్కులర్ జారీ చేసింది. ఆ ప్రకారం ఆదేశాలను అమలు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. అందుకు సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో మంగళవారం కమిటీ సభ్యులు విధి విధానాలపై సమావేశం కానున్నారు. కాగా మూసివేసే హాస్టళ్లలోని విద్యార్థులను ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చేరుస్తారు. అందుకుగాను గురుకులాల్లో అన్ని వసతులు కల్పించి, మెరుగైన విద్యను అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే గురుకులాల్లో పలు సమస్యలు తిష్ట వేసి ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి అదనంగా చేరే విద్యార్థులకు ఎలాంటి వసతులు సమకూరుస్తార నే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ పరిణామం కొత్త విద్యార్థులకు చిక్కులు తెచ్చిపెట్టనుంది. గురుకులాల్లో ప్రవేశాలు కఠిన తరంగా ఉంటాయి. అదే హాస్టళ్లలోకి అయితే ప్రవేశం సులువుగా ఉంటుంది.
వ్యతిరేకిస్తాం
హాస్టళ్లను మూసి వేయాలనుకునే రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తాం. గతంలో కూడా తీవ్రంగా ఉద్యమాలు చేశాం. హాస్టళ్లను మూసి వేసే బదులుగా వాటిని అభివృద్ధి చేయాలి. ప్రైవేటు భవనాల స్థానాల్లో పక్కా భవనాలను నిర్మించి నిరుపేదల విద్యాభివృద్ధికి కృషి చేయాలి. సంక్షేమ హాస్టళ్లను ఎత్తి వేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తామంటే కుదరదు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాం.
- గంగా సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏఐఎస్‌ఎఫ్
ఉద్యమం తప్పదు
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారు. సంక్షేమ హాస్టళ్లను క్రమేణా మూసి వేయాలనుకోవడం తగదు. ఈ విధానంపై ఉద్యమాలు చేస్తాం.
- ఆర్‌ఎన్ రాజు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, దళిత విద్యార్థి సమాఖ్య
మెరుగైన విద్య కోసం
హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు మెరుగై న విద్యను అందివ్వడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భా గంగానే కొన్ని హాస్టళ్లలోని విద్యార్థులను గురుకులాల్లో చేర్పిస్తున్నాం. ప్రభు త్వ ఆదేశాల ప్రకారం నడుచుకోక తప్పదు.
- సరస్వతి, డెప్యూటీ డెరైక్టర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ