వసతి గృహాలకు చంద్రన్న సరుకులు
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని కేజీబీవీ విద్యాలయాల్లో విద్యార్థినులు కొద్ది నెలల కిందట అస్వస్థతకు గురైన సంగతి తెల్సిందే. నాసిరకం సరుకులు సరఫరా చేయడం.. వాటిని వండి వడ్డించడం వల్లే ఇలా జరిగిందంటూ జిల్లాలోని సంక్షేమ శాఖలన్నింటినీ సమావేశపరచి రాష్ట్ర మంత్రి మృణాళిని, కలెక్టర్ వివేక్‌యాదవ్‌లు పలువురికి మెమోలు జారీ చేశారు. శాంపిళ్లు తీయించి మరీ హెచ్చరించారు. ఇది కేవలం కాంట్రాక్టర్ తప్పిదం కనుక. మరి చంద్రన్న సంక్రాంతి సరుకుల్లో నాణ్యత లేదని సాక్షాత్తూ ఆ శాఖ మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. డిసెంబర్‌లో వివిధ కాంట్రాక్టుదారుల నుంచి పంపించిన సరుకులు అప్పటికే నాణ్యత బాగాలేదన్నారు.
ఇప్పుడు అవే సరుకులను సంక్షేమ వసతి గృహాలకు పంపించేందుకు జిల్లా అధికారులు రంగం సిద్ధం చేశారు. డిసెంబర్, జనవరి నెలల్లో పంపిణీ చేసిన సరుకుల్లో చాలా వరకు మిగిలిపోయాయి. బాగాలేవని కొందరు, కార్డుదారుల కన్నా అధికంగా పంపిణీ చేయడంతో మరికొందరు డీలర్ల వద్ద సరుకులు ఉండిపోయాయి. ఇప్పుడీ సరుకులను సంక్షేమ వసతి గృహాలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 50 వేల ప్యాకెట్లను ఇలా ఆయా వసతి గృహాలకు పంపిణీ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించడంతో ఉన్నతాధికారుల ఆయా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మిగిలిపోయిన బెల్లం, నెయ్యి, గోధుమ పిండి సరుకులను జిల్లాలోని 42 ఎస్సీ సంక్షేమ వసతి గృహాలకు పంపిణీ చేయనున్నారు.
ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ, ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయాలకు సంబంధిత సమాచారం వచ్చింది. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏఏ సరుకులు ఎంత మొత్తంలో పంపిణీ చేయాలనే ఆలోచనలో అధికారులున్నారు. గతంలో సంక్షేమ వసతి గృహాలకు నాసిరకం సరుకులను పంపిణీ చేసిన రెండు సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టిన యంత్రాంగం మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తే ఫరవాలేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నాసిరకం సరుకులు సరఫరా చేసి చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దని కోరుతున్నారు.