పెళ్ల్లయిన యువతులకు అధికారులు అందజేసిన అభినందన పత్రం
లక్కవరపుకోట : సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెడుతుందే తప్ప ఆచరణలో మాత్రం విఫలమవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం గడిచిన నాలుగేళ్లలో 114 పథకాలను ప్రవేశపెట్టింది. అయితే ఇందులో చాలా పథకాల పేర్లు అటు అధికారులకు గాని ఇటు పాలకులకు గాని తెలియవంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇప్పటివరకు ప్రవేశ పెట్టిన పథకాల్లో కనీసం 20 శాతం కూడా అమలు కాలేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. పథకాలపై ప్రజలను చైతన్యపరచాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో సంక్షేమ పథకాలు అర్హులకు అందని ద్రాక్షగా మిగులుతోంది. ఈ సరసన ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన ‘చంద్రన్న పెళ్లికానుక’ చేరింది.
చంద్రబాబునాయుడు ఇప్పటివరకు తన బూటకపు హామీలతో కర్షక, కార్మిక, ఉద్యోగస్తులు, నిరుద్యోగులను మోసం చేశారు. ఇప్పుడు నవ వధువులను సైతం మోసం చేసేందుకు సిద్ధపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. దారిద్య్రరేఖకు దిగువున ఉన్న యువతుల కుటుంబాల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం చంద్రన్న పెళ్లికానుక అనే పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకం నిర్వహణకు బడ్జెట్‌లో వంద కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ పథకాన్ని ఏప్రిల్ 20వ తేదీ నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. ఎంతో ప్రచార ఆర్భాటలతో తీసుకొచ్చిన ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. దీనికి తోడు ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు విధించడంతో లబ్ధిదారులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వెనకడుగువేస్తున్నారు.
1193 దరఖాస్తులు
పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో గల 34 మండలాల నుంచి 1193 మంది వధువులు దరఖాస్తు చేసుకున్నారు. గరివిడి మండలం నుంచి అత్యధికంగా 56 మంది దరఖాస్తు చేసుకోగా.. అత్యల్పంగా గుమ్మలక్ష్మీపురం నుంచి కేవలం ముగ్గురు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
ప్రోత్సాహకంలో 20 శాతం సొమ్మును ముందుగా వధువు బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని.. మిగిలిన మొత్తాని పెళ్లి అయిన తర్వాత అన్ని ధ్రువపత్రాలు సమర్పిస్తే బ్యాంక్ ఖాతకు జమ చేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే ఇంతవరకు లబ్ధిదారులెవ్వరికీ ఒక్క పైసా కూడా మంజూరు కాలేదు. దీంతో పథకం అమలు తీరుపై నూతన వధూవరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హంగు ఆర్భాటాలే...
ఎంతో అట్టహాసంగా ప్రవేశపెట్టిన ఈ పథకం ముఖ్య లక్ష్యం.. వెనుకబడిన తరగతులకు చెందిన కుటుంబాల్లో బాల్యవివాహాలను నిరోధిచడం. ఆయా కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లుల్లు భారం కాకూడదనే ఉద్దేశంతో పాటు పెళ్లైన వారు తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే లక్ష్యంతో ఈ పథకం అమలు చేశారు. ఇందులో భాగంగా కులాంతర వివాహం చేసుకునే ఎస్సీ, ఎస్టీలకు రూ. 75వేలు.. తమ కులంలోనే వివాహ చేసుకునే ఎస్సీలకు రూ. 40వేలు, ఎస్టీలకు రూ. 50 వేలు అందిస్తామని పథకంలో పేర్కొన్నారు.
అలాగే కులాంతర వివాహాలు చేసుకునే బీసీలకు రూ. 50 వేలు..తమ కులస్తులనే వివాహం చేసుకుంటే రూ. 35 వేలు అందజేస్తారు. దుల్హన్ పథకం కింద మైనారిటీలకు రూ. 50 వేలు, దివ్యాంగులకు రూ. లక్ష, ఓసీలకు రూ. 20 వేలు చొప్పున అందజేస్తారు.
అవగాహన కరువు
చంద్రన్న పెళ్లికానుక పథకంపై గ్రామీణులకు అవగాహన కరువైంది. అబ్బాయికి 21 సంవత్సరాలు.. అమ్మాయికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే వరుడికి తొలివివాహం, వధువుకి రెండో వివాహం (వితంతువు) అయినా ఈ పథకానికి అర్హులే. ముఖ్యంగా రెండో సంబంధం మహిళకు తొలి సంబంధం వరుడు లభించాలని నిబంధన విధించారు.
ఇది సాధ్యమా అన్న ప్రశ్న తలెత్తుతోంది. వివాహం చేసుకునే ఇరుకుటుంబాలు తెలుపు రేషన్‌కార్డు కలిగి ఉండి, ప్రజాసాధికార సర్వేలో నమోదై ఉండాలి. అలాగే ఇరువురూ ఒకే రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. వివాహానికి 15 రోజుల ముందు మీసేవా కేంద్రాల్లో గాని మండల సమైక్య ద్వారా గాని 1100 కాల్ సెంటర్‌లో గాని పేర్లు నమోదు చేసుకోవాలి.
పైసా రాలేదు..
నాకు మే రెండో తేదీన వివాహం జరిగింది. ఇప్పటివరకు ఒక్క పైసా కూడా మంజూరు కాలేదు. అధికారులు ఒక అభినందన పత్రం మాత్రమే ఇచ్చారు. అధికారులను అడిగితే ఇదుగో వస్తాయి.. అదుగో వస్తాయని చెబుతున్నారు. – నెక్కల దీపిక, మార్లాపల్లి గ్రామం,లక్కవరపుకోట మండలం
ఆన్‌లైన్ చేసాం
మాకు వచ్చిన దరఖాస్తులన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరిచాం. త్వరలోనే లబ్ధిదారుల ఖాతాలకు సొమ్ము జమవుతుంది. అలాగే ఈ పథకంపై గ్రామాల్లో చంద్రన్న పెళ్లికానుక మిత్రల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. – రొంగళి శ్రీనివాసరావు, వెలుగు ఏపీఎం, లక్కవరపుకోట మండలం.
Comments
Please login to add a commentAdd a comment