విజయనగరం గంటస్తంభం: ఈ ఏడాది జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన పంట వరి పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో కుటుంబాలను నెట్టుకురావడమే కష్టంగా భావిస్తున్న తరుణంలో పండుగలు జరుపుకోవడం తలకు మించిన భారమే. ఇలాంటి దీనస్థితిలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం పండగ పూట కంటితుడుపుగా గతంలో ఇచ్చిన సరుకులే చంద్రన్న కానుకగా ఇవ్వాలని నిర్ణయించింది. వాస్తవానికి నాలుగేళ్లగా ఇస్తున్న సరుకులపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉండగా.. ఇప్పుడూ అవే సరుకులు ఇవ్వడంతో మరింత అసంతృప్తికి గురికావడం ఖాయమని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ సరుకులు
ప్రభుత్వం ప్రతి ఏటా రంజాన్ సమయంలో ముస్లింలు, క్రిస్మస్ సమయంలో క్రిష్టియన్లకు, సంక్రాంతి పండుగ సమయంలో హిందువులకు చంద్రన్న కానుక పేరుతో సరుకులు సరాఫరా చేస్తున్న విషయం విధితమే. ఈ ఏడాది కూడా అదేవిధంగా పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. క్రిస్మస్, సంక్రాంతి పండగలు వరుసుగా ఉండడంతో సరుకులు సరఫరాకు చర్యలు తీసుకుంది. ఈ ఏడాది కాసింత ముందుగా జిల్లాకు సరుకులు చేరుతున్నాయి. అయితే సంక్రాంతి, క్రిస్మస్‌లకు ఒక్కో కార్డుదారునికి అర కిలో పామాయిల్, అర కిలో కందిపప్పు, అరకిలో శనగపప్పు, అర కిలో బెల్లం, కిలో గోధుమపండి, 100 గ్రాముల నెయ్యి సరఫరా చేయాలని నిర్ణయించింది. గత నాలుగేళ్లగా ఇవే సరుకులు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.
ఉపశమనం నామమాత్రమే..
ప్రభుత్వం ప్రస్తుతం సరఫరా చేయాలని నిర్ణయించిన సరుకులు ధరలు రిటైల్ మార్కెట్‌లో చూస్తే ఏమేరకు ప్రయోజనం కలుగుతుందో అర్థం చేసుకోవచ్చు.ఆరు రకాల సరుకులు కిరాణా దుకాణానికి వెళ్లి చిల్లరగా కొనుగోలు చేస్తే రూ.230లకు వచ్చేస్తాయి. ప్రభుత్వం టోకుగా కొనుగోలు చేయడం వల్ల రూ.200 లోపే వస్తాయి. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో కార్డులున్న 7.04 లక్షల కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి సంక్రాంతి కానుక, క్రిస్మస్ పేరుతో కలిగే ప్రయోజనం నామమాత్రమే అని చెప్పుకోవాలి.
ప్రచారం కోసమే..
ప్రభుత్వం సరఫరా చేసే ఈ సరుకులతో ప్రజలకు ఒరిగేదీ ఏమీ లేదు. ఆరు సరుకులతోనే పండగ అయిపోదు. ఆ విషయం ప్రభుత్వానికి తెలుసు. కానీ ప్రచారం కోసమే ఇదంతా చేస్తుందన్న విషయం లబ్ధిదారులు ఎప్పుడో గుర్తించారు. అందుకే నాలుగేళ్లుగా ఇస్తున్నా, ప్రభుత్వం ఎంతో చేస్తున్నామని సభలు, సమావేశాల్లో గొప్పలు చెప్పుకుంటున్నా ప్రజలు మాత్రం సంతృప్తి వ్యక్తం చేయడం లేదు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. గత ప్రభుత్వం హాయాంలో నెయ్యి మినహా మిగతా సరుకులన్నీ నెలనెలా సరఫరా చేసేవారు. వీటితోపాటు అదనంగా కొన్ని సరుకులు ఇచ్చేవారు. దీంతో కోటా దుకాణానికి వెళితే సంచి నిండా ఇంటికి ఉపయోగపడే సరుకులు వచ్చేవి. వీటన్నింటికీ కోత వేసిన ప్రభుత్వం ప్రస్తుతం బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేస్తోంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఏడాదికోసారి ఇచ్చి చేతులు దులుపుకోవడంపై లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు.
ఫొటోలు దూరం
ఈసారి సరుకుల సరఫరాలో కొంతవరకు ప్రచారం తగ్గించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి జిల్లాకు 25 శాతం సరుకులు చేరాయి. ఇందులో దాదాపు అన్ని రకాల సరుకులు ఉన్నాయి. ప్యాకెట్ల రూపంలో సరుకులున్నా వాటిపై గతంలో మాదిరిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పౌరసరఫరాలశాఖ మంత్రి ఫొటోలు లేవు. సరుకులు తీసుకెళ్లే గోనె సంచులపై మాత్రం వారి ఫొటోలు ముద్రించారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉండడంతో ప్యాకెట్లపై ఫొటోలు ముద్రించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయం పౌరసరఫరాలసంస్థ డీఎం డి. షర్మిల వద్ద ప్రస్తావించగా.. ఆరు రకాల సరుకులు మాత్రమే వచ్చాయన్నారు. డిసెంబర్‌లో సగం కార్డుదారులకు సరిపోయే సరుకు డిపోల్లో అందుబాటులో ఉంచాలన్నది ఉన్నతాధికారుల ఉద్దేశమన్నారు. మిగతా సగం లబ్ధిదారులకు జనవరిలో ఇస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment