ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు ఎం.పైడయ్య. నివాసముండేది మున్సి పాలిటీలోని 8వ వార్డు అమ్మిగారి కోనేటిగట్టు. చంద్రన్న రేషన్ సరుకుల కోసం అతని కార్డు ఉన్న 307వ నంబర్ రేషన్ షాపునకు వెళ్లగా అక్కడున్న డీలర్ రూ.10లు ఇచ్చి సరుకులు తీసుకెళ్లాలని ఓ కార్డు కూడా చేతిలో పెట్టాడు. దీంతో వృద్ధుడు రూ.10 ఇచ్చి కార్డు చూపించుకుంటూ సరుకులు తీసుకెళ్లాడు. ఇక్కడ వినియోగదారుడు నిజమైనా.. డీలర్ బినామీ కావడం విశేషం.
విజయనగరం, బొబ్బిలి: రాష్ట్రంలో చంద్రన్న సరుకులు ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో కమీషన్లు చాలక రేషన్ డీలర్లు చిలక్కొట్టుళ్లకు పాల్పడుతున్నారు. చంద్రన్న సరుకులు ఇచ్చేందుకు రూ.10 నుంచి రూ.20 వసూలు చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు, వాటి ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడంతో పాటు రేషన్ డీలర్ల డిమాండ్లను పక్కన పెట్టేయడంతో ప్రజాపంపిణీ వ్యవస్థ ఇష్టారాజ్యంగా తయారైంది. జిల్లాలో 15 ఎంఎల్‌ఎస్ పాయింట్ల ద్వారా రెండో అంచెగా రేషన్ షాపులకు సరుకులను తరలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1456 రేషన్ దుకాణాల్లో అధిక సంఖ్యలో బినామీ డీలర్లు వ్యవహరిస్తున్నారు. వీరు గతంలోలా ఈ వెయింగ్‌లో బియ్యం, సరుకులు ఇవ్వడం లేదు. వాస్తవానికి ఎంఎల్‌ఎస్ పాయింట్లలో ఉన్న ఈ వెయింగ్ మెషీన్లనే వినియోగించడం లేదు.
దీంతో వీరు కూడా డబ్బాలతోనూ, లేదా రాళ్లను ఈ వెయింగ్ మెషీన్‌లు పెట్టి చీటీలు ఇస్తున్నారు. ఈ స్లిప్‌లు పట్టుకుని డబ్బులు తీసుకువెళితే బియ్యం ఇస్తారు. ఇలా చేయడం వలన ఇక్కడ ఎంఎల్‌ఎస్ పాయింట్లతో పాటు డీలర్ల వద్దా తూకం తరుగు మిగులుతోందని వినియోగదారులు వాపోతున్నారు.
నిలిచిపోయిన డిజిటల్ చెల్లింపులు ..
జిల్లాలో గతంలో చేపట్టిన డిజిటల్ చెల్లింపుల విధానం నిలిచిపోయింది. దీంతో అందరు డీలర్లూ డబ్బులు తెస్తేనే సరుకులు ఇస్తున్నారు. ఏటీఎం కార్డు పట్టుకుని రేషన్ షాపునకు వెళితే అక్కడున్న డీలర్ ఆశ్చర్యంగా వినియోగదారుల వైపు చూస్తున్నారు. గతంలో ఈ విధానం అమలుకోసం డీలర్ల చేత కరెంట్ అకౌంట్లను ఓపెన్ చేయించారు. ఈ అకౌంట్లు ఇప్పుడు పడకేసినట్టున్నాయి. అంతే కాదు ప్రతీ నెలా ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు నడిపేవారికి బహుమతులు అందించే వారు సెల్‌లను డీఎస్‌ఓ, జేసీల చేతుల మీదుగా అందజేసి ప్రోత్సహించేవారు. ఇప్పుడా విధానం మానేసి దాదాపు రెండేళ్లు పైనే అయిందని పౌరసరఫరాల అధికారే ఒకరు వ్యాఖ్యానించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment