గరివిడి మండలం గెడ్డపువలసకు చెందిన ఈమె పేరు యడ్ల జయమ్మ. కోనూరు గ్రామానికి చెందిన సీహెచ్.గణపతితో ఈ ఏడాది మే నెల ఒకటో తేదీన ఈమెకు వివాహమైంది. వీరు చంద్రన్న కానుకకోసం దరఖాస్తు చేస్తే ఇప్పటివరకూ ఆ మొత్తం అందలేదు. రోజూ కార్యాలయాల చుట్టూ తిరుగున్నప్పటికీ ఫలితం లేకపోతోంది. స్థానిక నాయకులు ఎవరైనా అడ్డుపడుతున్నారేమోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారులు ఏ విషయం తెలియజేయడం లేదని చెబుతున్నారు.
బాడంగి మండలం చినభీమవరానికి చెందిన ఈమె పేరు గొట్టాపు శ్రీదేవి. ఈమెకు సాలూరు పట్టణం గుమడాం వీధికి చెందిన సబ్బాన శ్రీనివాసరావుతో ఈ ఏడాది మేనెల 3వ తేదీన పెళ్లయింది. సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన వీరు బీసీకి వర్గీయులు. ఈమెకు రూ. 35వేలు చంద్రన్న పెళ్లికానుకకు అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆ మొత్తం మంజూరు కాలేదు. అసలు అందుతుందో లేదో తెలియడం లేదని వారు వాపోతున్నారు.
విజయనగరం అర్బన్:పేద కుటుంబాలకు చెందినవారు పెళ్లి చేసుకుంటే వారికి కులాల ప్రాతిపదికన ప్రభుత్వం తరఫున పెళ్లి కానుక అందజేస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రకటించారు. తీరా పథకాన్ని అర్హులందరికీ అందించడంలో సవాలక్ష ఆంక్షలు పెడుతోంది. దీనివల్ల పేర్లు నమోదు చేసుకుని చేతికి వచ్చేవర కూ అసలు వస్తుందా రాదాఅన్న సందేహం లబ్ధిదారుల్లో కలుగుతోంది. ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంలోశ్రద్ధ చూపకపోవడంతో ఎవరికీ అందడం లేదు.
వేలల్లో నమోదు... వందల్లో లబ్ధి!
జిల్లాలో ఏప్రిల్ 20 నుంచి అమలవుతున్న ఈ పథకంలో జిల్లావ్యాప్తంగా ఇంతవరకు 2,589 జంటలు నమోదు చేసుకున్నాయి. వీరిలో 1,227 మంది వరకు మాత్రమే అర్హులైనట్లు నివేదికలు చెపుతున్నాయి. అయితే పెళ్లిళ్లు పూర్తి చేసుకొని మూడు నుంచి నాలుగు నెలలు కావస్తున్నా నగదు విడుదల కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతవరకు కేవలం 977 జంట లకు మాత్రమే రూ.3.83 కోట్లు విడుదల చేసిన ట్లు నివేదికలు చెపుతున్నాయి. నిబంధన ప్రకా రం పెళ్లికి ముందే నగదు విడుదల చేయాలి. పెళ్లి చేసుకొని మూడు నుంచి నాలుగునెలల ఆలస్యం గా నగదు విడుదలవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా మాఘమాసంలో ఎక్కువగా పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఇలా ఫిబ్రవరి, మార్చినెలల్లో దాదాపు 2,500 పెళ్లిళ్లు జిల్లాలో జరిగినట్టు ఒక అంచనా. కానీ పథకం ఏప్రిల్ 20 నుంచి అమలులోకి రావడంతో వారందరూ అవకాశం కోల్పోయినట్టయింది. కేవలం లబ్ధిదారులను కొంతమందికైనా తగ్గించాలన్న వ్యూహంతోనే ఆలస్యంగా పథకాన్ని ప్రారంభించారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
అందుబాటులోలేని ‘కాల్ సెంటర్లు’
ఏప్రిల్ నెల 20న ప్రారంభించిన ‘చంద్రన్న పెళ్లి కానుక’ పథకం అమలు తీరుపై ఆది నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. పెళ్లి సీజన్ అయిపోయిన తరువాత అమలు చేయడం ఒక కారణమైతే అసలు పథకంలో నమోదు ప్రక్రియపై క్షేత్రస్థాయిలో పేదలకు అవగాహన కలిగించే వ్యవస్థ నిర్వీర్యంగా ఉండడం మరో కారణం. గ్రామాణాభివృద్ధి శాఖ, వెలుగు విభాగం ఆధ్వర్యంలో సాగుతున్న ఈ పథకం తొలుత మీ–సేవా కేంద్రం ద్వారా నమోదు ప్రక్రియను చేపట్టడం వల్ల సాంకేతికంగా పలు సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది. తాజాగా ఆ విధానాన్ని రద్దు చేసి మండల కేంద్రాల్లోని మండల సమాఖ్య కార్యాలయాల్లో ‘చంద్రన్న పెళ్లి కానుక’ నమోదు కేంద్రాలు, కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే అక్కడ నమోదు చేయడానికి ప్రత్యేకించిన సిబ్బంది లేకపోవడం వల్ల గ్రామాల నుంచి వచ్చిన అభ్యర్థులు పేర్ల నమోదు కోసం రోజంతా నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు. జిల్లా కేంద్రంలో మహిళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ప్రదర్శన బోర్డు ప్రచారం కోసమే అన్నట్టు సమావేశ మందిర గదికి పెట్టారు.
పెళ్లికానుక ప్రోత్సాహం ఇలా...
చంద్రన్న పెళ్లికానుక కింద ఇస్తున్న ప్రోత్సాహకాలు కులాలవారీగా నిర్ణయించారు. ఎస్టీలు, మైనార్టీలకు రూ.50 వేలు, ఎస్సీలకు రూ.40 వేలు, బీసీలకు రూ.35 వేలు అందిస్తామని ప్రకటించారు. ఈ సాయం కోరేవారు పెళ్లికి 15 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వధూవరులు తప్పనిసరిగా ప్రజాసాధికార సర్వేలో నమోదై ఉండాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పౌరసరఫరాల శాఖ దుకాణాల ద్వారా పల్స్, ఈ–కేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment