సమ్‌క్రాంతి
సంక్రాంతి పండగ వచ్చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ‘‘చంద్రన్న కానుక’ పేరిట గిఫ్ట్ ప్యాక్‌లు ఇస్తారు..పండగ బాగా జరుపుకోవచ్చని భావించిన లబ్ధిదారులకు అశనిపాతమే అయింది.
విజయనగరం కంటోన్మెంట్: చంద్రన్న సంక్రాంతి కానుక కార్యక్రమం జిల్లాలో సక్రమంగా అమలు కావడం లేదు. గత కొన్ని రోజులుగా పండగ కానుకపై పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో జిల్లా ప్రజలు ఆశగా ఎదురు చూసినప్పటికీ పంపిణీ ఆ స్థాయిలో లేకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. పలు గ్రామాల్లో అరకొర సరుకుల పంపిణీతో డీలర్లు వినియోగదారులకు పంపిణీ చేయలేకపోయారు. సరుకుల కొరతతో లబ్ధిదారుల కుసమాధానం చెప్పలేక అధికారులు కూడా మొహం చాటేశారు. జిల్లాలో 6.4 లక్షల తెల్ల కార్డులకు చంద్రన్న సంక్రాంతి కానుకలను ఆదివా రం నుంచి పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఆదివారం సాయంత్రంవరకూ ఏ ఒక్క సరుకూ పూర్తిగా రాలే దు, కందిపప్పు, నెయ్యి, అరకొరగా రాగా మిగతా సరుకులన్నీ 60నుంచి 70శాతం మాత్రమే వచ్చాయి.
బెల్లం పంచేసుకోండి..
సాలూరు నియోజకవర్గంలోని మక్కువలో బెల్లం అరకిలో ఇవ్వడానికి బదులుగా బెల్లం దిమ్మలు ఇచ్చి పంచుకోమనడంతో డీలర్లు ఆ తతంగమంతా మేం పడలేమంటూ తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో ఈ ప్రాంతంలో సరుకుల పంపిణీని వాయి దా వేశారు. అదేవిధంగా పాచిపెంటలో కందిపప్పు కొరత ఉండడంతో పంపిణీ చేపట్టలేదు.
తూకంలో కోతలు
కురుపాంనియోజకవర్గంలో కందిపప్పు, బెల్లం సరుకులు అరకిలో బదులు ప్రతి ప్యాకింగ్‌లోనూ 150 నుంచి 200 గ్రాములు తక్కువగా వచ్చాయి. మహిళా గ్రూపులకు ఈ సరుకుల ప్యాకింగ్ ఇవ్వడంతో చాలీచాలని సరుకులను ఈ విధంగా వారు సరిపెట్టి గ్రామాలకు పంపిణీ చేశారు.
మంత్రి నియోజకవర్గంలోనూ అంతే..
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో ఆమె చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు ఇంకా సరుకులు చేరుకోలేదు. ఈ నియోజకవర్గంలో కందిపప్పు, గోధుమపిండి ఇంకా రాకపోవడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. కేవలం చీపురుపల్లి పట్టణంలోని నాలుగు డిపోల్లో మాత్రమే పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించిన అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ ఎలా ఉందన్న విషయమై దృష్టి సారించలేదు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఎందుకీ ప్రకటనలంటూ విమర్శిస్తున్నారు.
పార్వతీపురం నియోజవకర్గంలో సరుకులు దాదాపు వచ్చినా గ్రామస్థాయికి ఇంకా చేరుకోలేదు. చాలాగ్రామాల్లో ఉచితంగా ఇస్తారన్న విషయం కూడా తెలియదు. నెల్లిమర్ల నియోజకవర్గంలో కందిపప్పు, నెయ్యి కొరత ఉండగా శనగలు, బెల్లం తూకం తక్కువగా ఉందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. విజయనగరం నియోజకవర్గంలో కందిపప్పు, నెయ్యి ఇంకా దిగుమతి కాలేదు. దీంతో కొన్ని చోట్ల వచ్చిన సరుకులు మాత్రమే ఇవ్వగా..మిగతా చోట్ల అన్ని సరుకులూ వచ్చాక ఇస్తామని డీలర్లు రేషన్ షాపులో స్టాకు ఉంచి కూర్చున్నారు. ఒక్క ఎస్.కోట నియోజకవర్గంలో మాత్రమే అన్ని రకాల సరుకులూ రావడంతో పూర్తిస్థాయిలో పంపిణీ చేపట్టారు, బొబ్బిలి నియోజకవర్గంలో చాలా గ్రామాలకు ఇప్పటికీ సరుకులు చేరుకోలేదు.
మాకేమీ తెలీదు
బాడంగి మండలం లక్ష్మీపురం, పెదపల్లి, డొంకినవలస గ్రామాల్లో చంద్రన్న సంక్రాంతి కానుక ఉచిత సరుకులు ఇస్తారన్న విషయం కూడా తెలియదని పలువురు చెప్పడం విశేషం. సాలూరు పట్టణంలోని పలు వార్డుల్లో శనగలు, కందిపప్పు తూకంలో తక్కువ వస్తోందన్న విమర్శలు వినిపించాయి. గజపతినగరం నియోజకవర్గంలో ఇప్పటికీ గ్రామస్థాయికి సరుకులు చేరుకోలేదు. గిరిజన గ్రామాలకు చెందిన ప్రజలు ఈ సరుకులు ఎప్పుడు ఇస్తారోనని ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. వాస్తవానికి ఆదివారం నుంచి పంపిణీ చేయాల్సిన ఈ సరుకులు ఆదివారం సాయంత్రానికి కూడా చేరుకోకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.