వేలిముద్ర పడదే..!  | Telangana Welfare Hostel Students Facing Problems In Aadhaar Based Biometric | Sakshi
Sakshi News home page

వేలిముద్ర పడదే..! 

Published Sun, Oct 6 2019 2:52 AM | Last Updated on Sun, Oct 6 2019 2:52 AM

Telangana Welfare Hostel Students Facing Problems In Aadhaar Based Biometric - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులు, సిబ్బంది హాజరులో పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకొచి్చన బయోమెట్రిక్‌ హాజరు నమోదు విధానం క్షేత్రస్థాయిలో వసతిగృహ సంక్షేమాధికారులకు తలనొప్పిగా మారింది. ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ పద్ధతిని వినియోగిస్తున్న నేపథ్యంలో హాజరుస్వీకరణ గందరగోళంగా మారింది. ముఖ్యంగా విద్యార్థుల వేలిముద్రలు నమోదు కావడం లేదు. దీంతో హాస్టల్‌లో ఉంటున్నప్పటికీ గైర్హాజరైనట్లే నమోదవుతోంది. ఈ పరిస్థితి హాస్టల్‌ డైట్‌ బిల్లుల రూపకల్పనలతో వసతిగృహ సంక్షేమాధికారులకు చిక్కులు తెచి్చపెడుతున్నాయి.

ప్రతి విద్యా సంస్థలో బయోమెట్రిక్‌ హాజరువిధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వవిభాగాలు, క్రమంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నాయి. సంక్షేమశాఖల పరిధిలోని వసతిగృహాల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన సంక్షేమశాఖతో పాటు బీసీ సంక్షేమశాఖ వసతిగృహాల్లో ఇప్పటికే బయోమెట్రిక్‌ హాజరువిధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తుండగా, ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని హాస్టళ్లలో ప్రస్తుతం ప్రయోగ పద్ధతిని కొనసాగిస్తున్నారు. 

అప్‌డేట్‌ కాకపోవడంతో... 
ఆధార్‌ వివరాలను ప్రతి కార్డుదారు ఐదేళ్లకోసారి అప్‌డేట్‌ చేసుకోవాలి. ముఖ్యంగా వేలిముద్రల్లో వచ్చే మార్పులను అప్‌డేట్‌ చేసుకోవడం తప్పనిసరి. పిల్లల్లో వేలిముద్రలు మారడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. కానీ చాలావరకు కార్డు తీసుకున్న సమయంలో తప్ప వివరాలను అప్‌డేట్‌ చేసుకోవడం లేదు. ప్రస్తుతం సంక్షేమ హాస్టళ్లలో ఆధార్‌ ఎనేబుల్డ్‌ బయోమెట్రిక్‌ విధానానికి విద్యార్థుల వేలిముద్రలు సరిపోలకపోవడానికి ఇదే కారణం. ఆయా విద్యార్థులు తమ వేలిముద్రలు అప్‌డేట్‌ చేసుకుంటే తప్ప బయోమెట్రిక్‌ హాజరు నమోదుకు అవకాశం లేదు. 

హాస్టళ్లలో విద్యార్థులు వసతి పొందుతున్నప్పటికీ వారి హాజరు నమోదు కాకపోవడంతో వసతిగృహ సంక్షేమాధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టిన క్రమంలో విద్యార్థుల హాజరు ఆధారంగా డైట్‌ బిల్లులను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో సగానికిపైగా విద్యార్థుల వేలిముద్రలు నమోదు కాకపోవడంతో వారు వసతిపొందుతున్నా, రికార్డుల ప్రకారం గైర్హాజరు చూపడంతో వారికి సంబంధించిన బిల్లులు విడుదల కావు. ప్రభుత్వం మాన్యువల్‌ పద్ధతి బిల్లులను అనుమతించకపోవడంతో వసతిగృహ సంక్షేమాధికారులు తలపట్టుకుంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement