
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లోని పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక మెనూను ప్రభుత్వం అమలు చేస్తోంది. పదోతరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో అభ్యాసనకు ఎక్కువ సమయం కేటాయించేలా సంక్షేమ శాఖలు ప్రణాళికలు రూపొందించాయి. దీనిలో భాగంగా రాత్రి 11 గంటల వరకు స్టడీ అవర్స్ కొనసాగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ అదనంగా స్నాక్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం వసతి గృహాల్లోని విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనాన్ని ఇస్తున్నారు. మధ్యాహ్నం పూట మాత్రం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఇస్తున్నారు. విద్యార్థులకు రాత్రి భోజనం సాయంత్రం 7 గంటలకు ఇస్తుండటంతో 9 గంటల ప్రాంతంలో నిద్రకు ఉపక్రమిస్తారు.
టెన్త్ విద్యార్థులకు అదనం..
పదో తరగతి విద్యార్థులకు మాత్రం అదనంగా రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మరోసారి ఇవ్వనున్నారు. పరీక్షలకు సన్నద్ధమయ్యే టెన్త్ విద్యార్థులకు సమోసా, దిల్‌పసంద్, టీ, పండ్లు తదితరాలు రోజుకో రకం చొప్పున ఇవ్వనుంది. ఇలా పరీక్షలు ముగిసే వరకు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక బడ్జెట్‌ను ఎస్సీ అభివృద్ధి శాఖ విడుదల చేసింది. ఒక్కో విద్యార్థిపై రోజుకు రూ. 15 చొప్పున వంద రోజుల పాటు ఖర్చు చేయనుంది. ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో 715 సంక్షేమ హాస్టళ్లున్నాయి. వీటిలో పదో తరగతి చదువుతున్న వారు 22 వేలకుపైగా ఉన్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖలో రెండ్రోజుల నుంచి కొత్త మెనూను అమలు చేస్తున్నారు. ఈ ప్రయత్నానికి మంచి స్పందన వస్తోంది. విద్యార్థులు కూడా ఉత్సాహంతో స్టడీ అవర్స్‌లో కొనసాగుతున్నారని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’తో అన్నారు.
త్వరలో ఎస్టీ, బీసీ హాస్టళ్లలోనూ..
ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని హాస్టళ్లలో పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న ప్రత్యేక మెనూను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, గిరిజన అభివృద్ధి శాఖలో కూడా అమలు చేసేందుకు ఆయా శాఖ చర్యలు తీసుకుంటున్నాయి. అత్యుత్తమ ఫలితాల కోసం వినూత్న కార్యక్రమాలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment