ఏలూరు: నాణ్యతలేని విద్యను, ఆహారాన్ని అందిస్తున్న ప్రభుత్వంపై ఆగ్రహం చెందిన విద్యార్థులు ఏపీలోని పలు జిల్లాలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పశ్చిమగోదారి జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సుమారు వెయ్యిమంది విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడికి తరలివచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూసివేసిన సంక్షేమ హాస్టళ్లను వెంటనే తెరవాలని, నాణ్యమైన విద్యతో పాటు, ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు.
పాఠశాలల్లో, హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోకి చొచ్చుకు పోవడానికి ప్రయత్నించి ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే కర్నూల్ జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నినదించారు. ఏపీలోని పలు కలెక్టరేట్ల వద్ద విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు.