- 15 నెలలుగా పెండింగ్
- అప్పులపాలవుతున్న కుటుంబాలు
నూజివీడు, న్యూస్‌లైన్ : సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ వర్కర్లకు 15నెలలుగా జీతాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణకోసం అప్పులపాలవుతున్నా ప్రభుత్వం దయచూపడం లేదని ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాంఘి కసంక్షేమ శాఖ జిల్లాలో నిర్వహించే హాస్టళ్లలో దాదాపు 230మంది ఔట్‌సోర్సింగ్ వర్కర్లు పనిచేస్తున్నారు. నూజివీడు ఏఎస్‌డబ్ల్యూవో కార్యాలయం పరిధిలోని నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి మండలాల్లో ఉన్న హాస్టళ్లలో 30మంది వర్కర్లు కుక్‌లు, సర్వెంట్లు, వాచ్‌మన్‌లుగా పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.6,700 వేతనం ఇవ్వాల్సి ఉంది. అరుుతే 15నెలలుగా వీరికి వేతనం ఇవ్వడం లేదు. మేమెలా బతకాలని వీరు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వేతనాలు విడుదల చేసి ఆదుకోవాలని వర్కర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
నెలానెలా వేతనం ఇవ్వాలి
నేను 2008 నుంచి హాస్టల్‌లో పనిచేస్తున్నా. గత 15నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి అధికవడ్డీకి అప్పులు చేయాల్సి వస్తోంది. ఇకనుంచైనా నెలనెలా జీతాలు ఇవ్వాలి
- చిట్టూరి జమలమ్మ, నూజివీడు
బంగారం కుదువపెట్టా
నెలానెలా జీతాలు రాక కుటుంబ పోషణ భారంగా మారుతోంది. వేతనాలు రాకుండా ఇన్ని నెలలు జీవనం సాగించాలంటే ఇబ్బందులు పడుతున్నాం. ఇంటి అద్దె చెల్లించడానికి బంగారం కుదవపెట్టా.
- జుజ్జునూరి రామయ్య, నూజివీడు
అప్పులు చేస్తున్నాం
దసరా, దీపావళి పండుగలను అప్పులు చేసి జరుపుకోవాల్సి వస్తోంది. 2009నుంచి పనిచేస్తున్నా. నెలకు మాకు ఎంత జీతం ఇస్తున్నారో కూడా తెలియడం లేదు. జీతాలు వెంటనే విడుదల చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.
- చోడవరపు రాణి, నూజివీడు