Outsourcing workers
-
హౌసింగ్ ఉద్యోగులు ఔట్
అంతన్నారు.. ఇంతన్నారు.. హామీల వర్షం కురిపించారు.. ఉద్యోగాలు వస్తాయంటూ ఊరించారు.. నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారు.. కొత్త జాబులు రాకపోగా ఉన్నవి పీకి పారేస్తున్నారు.. కొత్త కొత్త నిబంధనలు.. అర్హతల మెలికలతో ఉద్యోగాలను తొలగించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం పూనుకుంది. దీనిలో భాగంగా గృహనిర్మాణ శాఖలో ఔట్ సోర్సింగ్ విధానంలో పదేళ్లుగా పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లను తొలగిస్తూ రెండు నెలల క్రితం ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలో 60 మంది ఉద్యోగాలను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏలూరు (మెట్రో) : బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసి గద్దెనెక్కిన తర్వాత ఆ మాటే మరిచిపోయారు తెలుగుదేశం పార్టీ నాయకులు. కొత్త జాబులు రాకపోగా ఉన్నవి ఊడిపోయే పరిస్థితి వచ్చింది. ఔట్సోర్సి ంగ్ ఉద్యోగాలను ఉఫ్ అంటూ పీకేస్తూ చిరుద్యోగుల ఉపాధికి గండి కొడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 2008లో గృహనిర్మాణ శాఖలో విధులు నిర్వహించేందుకు ఔట్సోర్సింగ్ పద్ధతిలో 173 మంది వర్క్ ఇన్స్పెక్టర్లను నియమించారు. అప్పటి నుంచి గృహ నిర్మాణ పథకాల వద్ద వీరు విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో గృహ నిర్మాణాలు చేసిన మేరకు ఆయా ప్రభుత్వాలు వేతనాలు చెల్లిస్తుండేవి. అయితే వర్క్ ఇన్స్పెక్టర్లు పనికి తగిన వేతనం లభించడం లేదని ఆందోళన చెందడంతో నెలకు రూ.15 వేలు వేతనాన్ని చెల్లించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వర్క్ ఇన్స్పెక్టర్లు ఆనందం వ్యక్తం చేశారు. అయితే వీరి ఆనందం కొద్దిరోజుల్లోనే ఆవిరి అయిపోయింది. నెలసరి వేతనాన్ని నిర్ణయించడంతో పాటు కొత్త నిబంధనలు తీసుకురావడంతో చాలా మంది ఉద్యోగాలను కోల్పోయారు. పదేళ్లకు గుర్తొచ్చిన నిబంధనలు ప్రభుత్వం గృహనిర్మాణ శాఖలో విధులు నిర్వహించేందుకు 2008లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఐ టీఐ చేసిన అభ్యర్థులను వర్క్ ఇన్స్పెక్టర్లుగా నియమించింది. అప్పట్లో ఐటీఐలో అన్ని ట్రేడుల వారిని అర్హులుగా గుర్తించి ఉద్యోగాలు ఇచ్చారు. అయితే ఐటీఐలో ట్రేడులను పక్కన పెట్టి ఐటీఐ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కట్టబెట్టింది. అయితే చంద్రబాబు సర్కారు ఉద్యోగులను తగ్గించే ఆలోచనతో పదేళ్ల తర్వాత కొత్త నిబంధనలను తెరపైకి తీసుకువచ్చింది. ఐటీఐలో సివిల్ డిప్లమో, డ్రాఫ్ట్‌మెన్ సివిల్ వంటి ట్రేడులు ఉన్న వర్కు ఇన్స్పెక్టర్లను మాత్రమే కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇతర ట్రేడుల్లో ఉద్యోగాలు పొందిన వర్క్ ఇన్స్పెక్టర్లు ఉద్యోగాలను కోల్పోయారు. ఇలా జిల్లాలో 60 మంది ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారు. వీధిన పడ్డ 60 కుటుంబాలు : 2008 నుంచి గృహ నిర్మాణ శాఖనే నమ్ముకుని విధులు నిర్వహించే వర్కు ఇన్స్పెక్టర్లు తమ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని భావించారు. చంద్రబాబు సర్కారు వీరి ఉద్యోగాలు తొలగించడంతో 60 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.కాళ్లరిగేలా తిరుగుతున్నా.. కొత్త నిబంధనలతో ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డామని రెండు నెలలుగా జిల్లాలోని వర్క్ ఇన్స్పెక్టర్లు మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రాలు అందిస్తున్నారు. ఉన్నతస్థాయి అధికారులను కలిసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయినా ఏ ఒక్క నాయకుడూ, అధికారీ వీరికి న్యాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. న్యాయం చేయండి మహాప్రభో పదేళ్ల నుంచి గృహనిర్మాణ శాఖనే నమ్ముకుని జీవనాలు సాగిస్తున్నాం. హౌసింగ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ విడుదల చేసిన జీఓతో ఉద్యోగాలను తొలగించారు. ఒక్క సంతకంతో ఉద్యోగాలు తీసేయడంతో ఏం చేయాలో తెలియడం లేదు. మాకు న్యాయం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం. – దిద్దే జగన్, బాధితుడు పర్మినెంట్ చేస్తారనుకుంటే.. వర్క్ ఇన్స్పెక్టర్లను పర్మినెంట్ చేస్తారని ఎప్పటి నుంచో భావిస్తున్నాం. పర్మినెంట్ చేయకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగించేశారు. ఎటువంటి ప్రత్యామ్నాయం చూపించకుండా ఉద్యోగాలు తొలగించడంతో కుటుం బాలతో సహా రోడ్డున పడ్డాం. మా గోడు పట్టించుకునే వారే లేరు. – కొడవటి శ్రీనివాస్, బాధితుడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అధికంగా ఉన్న ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన వారిని నియమించి, అర్హతలు లేని ఉద్యోగులను తొలగించాం. ఐటీఐలో సివిల్‌కు ప్రాధాన్యత ఇచ్చి అర్హులైన అభ్యర్థులను కొనసాగిస్తున్నాం. – ఈ.శ్రీనివాస్, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ -
అత్యవసర సేవలు బంద్
- ఉధృతమవుతున్న సమ్మె - పరిస్థితి ఆందోళనకరం - పారిశుధ్యం, తాగునీటి సరఫరా బంద్ - ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని గ్రేటర్ - జనజీవనం అస్తవ్యస్తం వరంగల్ అర్బన్ : మహా నగరంలో అత్యవసర సేవలు నిలిచిపోయాయి. చెత్త సేకరణ, మురుగు కాల్వల్లో పూడికతీత నిలిపివేసిన అవుట్ సోర్సింగ్ కార్మికులు శనివారం నుంచి తాగునీటి శుద్ధి, సరఫరా, వీధిలైట్ల మరమ్మతుల కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెబాట పట్టారు. ఐదు రోజులుగా విధులను నిర్వహిస్తునే పరోక్షంగా సమ్మెకు మద్దతు పలికినా తాగునీటి వీధిలైట్ల కార్మికులు పోరాట బాట పట్టడంతో పరిస్థితి సమాస్యాత్మకంగా తయారైంది. ఇప్పటికే ఇళ్ల ఎదుట, వీధుల్లో, డ్రెరునేజీల్లో,ఖాళీ స్థలాల్లో చెత్త గుట్టలుగా పేరుకపోయింది. మురుగునీరు స్తంభించిపోయి అక్కడక్కడ పొంగిప్రవహిస్తోంది. అపరిశుభ్రత వాతావరణంలో అనారోగ్య ముప్పు వాటిల్లుతుంది. న్యాయమైన డిమాండ్లను పరిష్కారించాలని ఆరు రోజులుగా చేపట్టిన సమ్మె ఉధృతమైంది. గ్రేటర్ అవుట్ సోర్సింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్రతరమైంది. ఇంటింటా చెత్త సేకరించే, వాహనాల్లోకి చెత్త ఎత్తే కార్మికులు,వాహనాల డ్రైవర్లు సమ్మెలో పాల్గొనడంతో ఎక్కడి చెత్త అక్కడే గుట్టలు గుట్టలుగా నగర వీధుల్లో, రహదారులు దుర్గందంగా మారాయి. ఆరు రోజుల వ్యవధిలో 1,600 మెట్రిక్ టన్నుల చెత్త సిటీలోనే స్తంభించిపోయింది చెత్త కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. మురుగు కాల్వల్లో పూడికతీత లేక మల, మూత్రాలతో కంపుకొడుతున్నాయి. అత్యవసర సేవలకు సంబంధించిన తాగునీటి శుద్ధి, నల్లాల విడుదలకు సంబంధించిన సూమారు 130 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు సమ్మెబాట పట్టారు. వడ్డేపల్లి, కేయూసీ,దేశాయిపేట ఫిల్టర్ బెడ్లలో పనిచేస్తున్న 100 మంది కార్మికులు,కాలనీలకు పైపులైన్లకు నీటి సరఫరా చేసే 30 మంది కార్మికులు సేవలను నిలిపివేశారు. అరకొరగా ఏర్పాట్లు.. తాగునీటి శుద్ధి కోసం పర్మినెంట్ కార్మికులతో పనిచేయిస్తామని బల్దియా డీఈ కొండల్ రావు తెలిపారు. షిఫ్టుకు ఇద్దరు కాకుండా ఒక్కొరు చొప్పన రెండు షిప్టులు పనిచేయిస్తూ తాగునీటి శుద్దీ చేస్తాం.ై పెపులైన్ల నుంచి వాల్వాలను విడుదల చేసే విషయంపై ప్రత్యామ్నయం కార్మికులను ఏర్పాటు చేస్తున్నాం. ఇబ్బందులు కలగకుండా చెత్తను తరలిస్తున్నామని బల్దియా ఎస్డబ్ల్యూఎంం ఇంజినీరు లక్ష్మారెడ్డి తెలిపారు. 15 అద్దె వాహనాల ద్వారా సర్కిల్‌కు ఒకటి చెప్ప వాహనాన్ని కేటాయించి చెత్తను తరలిస్తున్నట్లు వివరించారు. పర్మినెంట్ కార్మికుల ద్వారా రంజాన్ పర్వదినానికి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య పనులు చేయిస్తున్నామని పేర్కొన్నారు. ఫిల్టర్ బెడ్ కార్మికులు ఆందోళన.. డిమాండ్లను పరిష్కారించాలని ఫిల్టర్ బెడ్ కార్మికులు శనివారం విధులను బహిష్కరించి దేశాయిపేట, వడ్డేపల్లి, కేయూ ఫిల్టర్ బెడ్లలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యలను పరిష్కారించాలని నినాదాలు చేశారు. మూడు ఫిల్టర్ బెడ్ల కార్మికులు బల్దియా ప్రధాన కార్యాలయం అవరణంలో ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫిల్టర్ బెడ్ వర్కర్స్అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్, నాయకుడు శంకర్, కార్మికులు పాల్గొన్నారు. -
సమ్మె శంఖారావం
విధులు బహిష్కరించిన ఔట్ సోర్సింగ్ సిబ్బంది నగరపాలక సంస్థ వద్ద హోరెత్తిన నిరసన వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ సంఘీభావం విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో ఔట్ సోర్సింగ్ కార్మికులు సమ్మె శంఖారావం పూరించారు. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా శుక్రవారం విధులు బహిష్కరించారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద బైఠాయించారు. వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల, కార్పొరేటర్లు వారికి సంఘీభావం ప్రకటించారు. సీపీఎం, సీపీఐ, పలు యూనియన్ల నాయకులు కార్మికులకు బాసటగా నిలిచారు. సర్కార్‌కు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లను ఆమోదించే వరకు పోరు కొనసాగుతుందని హెచ్చరించారు. వేతనాల పెంపు, ఇతర సమస్యలపై లేఖ రాసినప్పటికీ సీఎం నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లోనే కార్మికులు సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ కార్మికులతో తమాషాలు చేస్తే సహించేది లేదన్నారు. డిమాండ్లు ఆమోదించకపోతే చంద్రబాబు రాష్ట్రంలో తిరగలేరన్నారు. సీపీఎం రాజధాని ప్రాంత ఉద్యమ కమిటీ కన్వీనర్ సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ మూడు ప్రాంతాల్లో సీఎం క్యాంపు కార్యాలయాల ఏర్పాటుకు, ఎమ్మెల్యేల జీతాలు పెంపుదలకు లేని ఆర్థిక ఇబ్బందులు కార్మికుల విషయంలోనే వస్తాయా అని ప్రశ్నించారు. మునిసిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆసుల రంగనాయకులు మాట్లాడుతూ కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం తగదన్నారు. సింగపూర్, జపాన్ తిరగడంపై సీఎం చూపుతున్న శ్రద్ధ కార్మికులు, ప్రజల సమస్యలపై కనబరచకపోవడం దురదృష్టకరమన్నారు. కదం తొక్కిన కార్మికులు సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులు కార్పొరేషన్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కనీస వేతనం రూ.14,322 చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని, వారసత్వ హక్కు కల్పించాలని, అర్హులైన వారికి జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు దోనేపూడి శంకర్, కాశీనాథ్, ఉమామహేశ్వరరావు, ఎం.డేవిడ్, జేమ్స్ పెద్దసంఖ్యలో మహిళా కార్మికులు పాల్గొన్నారు. -
మున్సిపల్ కార్మికుల సమ్మెబాట
నేటి నుంచి విధులకు గైర్హాజరు సాక్షి, హైదరాబాద్: ‘కనీస’ వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం మునిసిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు నెల రోజులుగా చేస్తున్న ఆందోళన తీవ్రతరమైంది. కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో సోమవారం ఉదయం 6 గంటల నుంచి తాము సమ్మెకు దిగుతున్నామని తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ ఉద్యోగ, కార్మిక ఐక్య సంఘాలు ప్రకటించాయి. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని 67 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సిం గ్ ప్రాతిపదికన పనిచేస్తున్న 40 వేల మంది కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. దీంతో రాష్ట్ర వ్యా ప్తంగా నగర, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు స్తంభించిపోనున్నాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేయకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ ఇబ్బందికరంగా మారనుంది. సమ్మె సైరన్ మోగింది: కార్మిక సంఘాల జేఏసీ తమ డిమాండ్లపై ప్రభుత్వ స్పందన కరువవ్వడంతో తాము సమ్మెలోకి వెళ్తున్నామని, ఇందుకు సైరన్ మోగిందని.. దీన్ని ఆపడం ముఖ్యమత్రి కేసీఆర్ తరం కాదని కార్మిక సంఘాల జేఏసీ నేతలు స్పష్టీకరించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం పెంచాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగ, కార్మిక ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు జీహెచ్ఎంసీలో పనిచేసే వివిధ విభాగాల కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఐటీయూ నేత పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. యాదాద్రికి రెండు వందల కోట్లు, వేములవాడకు ఏడాదికి రూ.వంద కోట్లను ప్రకటిస్తున్న సీఎంకు తమ గోడు పట్టదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వివిధ ట్రేడ్‌యూనియన్ల నేతలు ప్రసంగించారు. ఫలించని గత చర్చలు.. మున్సిపల్ కార్మికుల సమస్యలపై జూన్ 20న కార్మికశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి చర్చలు జరిపారు. ఈ మేరకు కార్మికుల డిమాండు మేరకు పెంపు ప్రతిపాదనలు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు సీఎంవో పరిశీలనలో ఉండడంతో సమ్మెను వాయిదా వేసుకోవాలని అధికారులు కోరారు. దీంతో సమ్మె గత నెల 22 నుంచి జూలై 6కు వాయిదా పడింది. ఇప్పటికీ ఆ ప్రతిపాదనలకు కదలిక లేకపోవడంతో కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. అందరితో పాటే పెంచుతాం ఆర్థిక శాఖ స్పష్టీకరణ మునిసిపల్ కార్మికుల వేతన పెంపు ప్రతిపాదనలను ఆర్థిక శాఖ వెనక్కి పంపించింది. ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందనీ, అందరితో పాటే మునిసిపల్ కార్మికుల వేతనాలను సైతం పెంచుతామని స్పష్టీకరించింది. దీంతో వేతన పెంపు ప్రతిపాదనలను సీఎం కార్యాలయం పరిశీలనకు పంపినట్లు పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి. -
మున్సిపల్ కార్మికులకు ‘డబ్బు’ల్ ధమాకా!
వేతనాల రెట్టింపునకు ప్రభుత్వానికి పురపాలక శాఖ ప్రతిపాదన ♦ మున్సిపాలిటీ స్థాయితో సంబంధం లేకుండా ఒకే తరహా వేతనాలకు సిఫార్సు ♦ పబ్లిక్ హెల్త్ వర్కర్ల వేతనం రూ. 8,300 నుంచి రూ. 14,170కు ... ♦ నాన్‌పబ్లిక్ హెల్త్‌వర్కర్ల వేతనం రూ. 8,300 నుంచి రూ. 17,380కు పెంచాలని సూచన ♦ ఆర్థికశాఖ ఆమోదిస్తే 13,955 మంది కాంట్రాక్టు వర్కర్లకు లబ్ధి సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు శుభవార్త. ఇకపై మున్సిపాలిటీల స్థాయితో సంబంధం లేకుండా ఒకే తరహా వేతనాల కోసం పురపాలకశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. పారిశుద్ధ్య కార్మికుల కనీస వేతనాన్ని రూ.14,170 (స్థూల వేతనం రూ.19,586)కు, పారిశుద్ధ్యేతర కార్మికులకు రూ.17,380 (స్థూల వేతనం రూ.24,023)కు పెంచాలని కోరింది. ఈ ప్రతిపాదనలను ఆర్థికశాఖ యథాతథంగా ఆమోదిస్తే వేతనాలు దాదాపు రెట్టింపు కానున్నాయి. ప్రస్తుతం కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ల్లోని కార్మికులకు కనీస వేతనం రూ.8,300 (స్థూల వేతనం రూ.11,473) చెల్లిస్తుండగా, నగర పంచాయతీల్లోని కార్మికులకు రూ.7,300 (స్థూల వేతనం రూ.10,091) చెల్లిస్తున్నారు. 9వ పీఆర్సీ 4వ తరగతి ఉద్యోగుల కోసం సిఫారసు చేసిన కనీస వేతనాన్ని ప్రస్తుతం మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వోద్యోగులకు ప్రకటించిన 10వ పీఆర్సీ 43 శాతం ఫిట్‌మెంట్‌ను తమకు సైతం వర్తింపజేయాలని మున్సిపల్ ఉద్యోగ, కార్మిక ఐక్య సంఘాలు డిమాండ్ చేశాయి. లేకుంటే నిరసనలు, సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. దీంతో వారి డిమాండ్‌కు అనుగుణంగానే పురపాలకశాఖ వేతన పెంపు ప్రతిపాదనలను సిద్ధం చేసి ఆర్థికశాఖ ఆమోదం కోసం పంపింది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 67 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 13,955 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తుండగా అందులో 9,953 మంది పారిశుద్ధ్య (పబ్లిక్ హెల్త్) కార్మికులు, 4,002 మంది పారిశుద్ధ్యేతర (నాన్ పబ్లిక్ హెల్త్) కార్మికులు ఉన్నారు. ప్రస్తుతం పురపాలికలు చెల్లిస్తున్న వేతనాలకు ఏటా రూ.186.70 కోట్లు ఖర్చవుతుండగా వేతనాలు పెంచితే ఆర్థిక భారం రూ.346.51 కోట్లకు పెరగనుంది. పురపాలికలపై రూ.159.81 కోట్ల అదనపు భారం పడనుంది. కాగా, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల క్రమబద్ధీకరణ డిమాండ్ సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు. సఫాయివాలాల వేతనాలూ సఫాయి పలు మునిసిపాలిటీల్లో కాంట్రాక్టు కార్మికుల వేతనాల చెల్లింపుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు పురపాలకశాఖ పరిశీలనలో తేలింది. ఈఎస్ఐ, ఈపీఎఫ్ వాటాలను కార్మికుల వేతనాల నుంచి కోత పెట్టినప్పటికీ సంబంధిత కార్మికుల ఖాతాల్లో జమ చేయలేదని నిర్ధారించింది. మున్సిపల్ కమిషనర్లు, లేబర్ కాంట్రాక్టర్లు రూ. 9.04 కోట్ల ఈఎస్ఐ, పీఎఫ్ నిధులను స్వాహా చేసినట్లు ప్రాథమిక పరిశీలనలో తేల్చింది. ఈ నిధులను తక్షణమే కార్మికుల ఖాతాల్లో జమ చేయకుంటే కఠిన చర్యలు తప్పవని పురపాలకశాఖ ఇటీవల మున్సిపల్ కమిషనర్లను హెచ్చరించింది. -
టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధమే...
- కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాల్సిందే.. - సీఐటీయూ రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యదర్శి సాయిబాబా వరంగల్ అర్బన్/ములుగు : రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, లేనిపక్షంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఐటీయూ అధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం వరంగల్‌కు చేరింది. నగరంతోపాటు ములు గు, భూపాలపల్లిలో ఆయన కార్మికులనుద్ధేశించి మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సర్కా రు చెప్పిన అచ్చా దిన్ కార్మికులకు రాలేదని, సీఎం కేసీఆర్ ప్రకటించిన బంగారు తెలంగాణ కూడా కార్మికులకు వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనంగా ఒక్కొక్కరికి రూ.15 వేలు అందజేయాలని, 8 గంటల పనివిధానాన్ని, ఈపీఎఫ్, ఈఎస్ఐ, తదితర సౌకర్యాలు వర్తింపజేయూలని డిమాండ్ చేశారు. ఎంజీఆర్, ఓసీటీసీ, లిబ్రా వంటి 50 పరిశ్రమలు మూతపడడం కారణంగా రాష్ట్రంలో 30వేలకు పైగా కార్మికుల కుటుం బాలు రోడ్డున పడ్డాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలే ఇందుకు ప్రధాన కారణమని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 938 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రస్తుతం కార్మికుల ఆత్మహత్యలు పెరిగేలా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్ట్ కార్మికులు రోడ్డున పడి సమ్మెలు చేస్తుంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని, కార్మికులపై ప్రేమ ఉంటే యాజమాన్యంతో మాట్లాడి సత్వరమే పునరుద్ధరణ చేయించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని వెంకటాపురం, గోవిందరావుపేట మండలాల్లో పుష్కల మైన బొగ్గు ప్రాంతాలు ఉన్నాయని, ఇక్కడ నూతన సింగరేణీని ఏర్పాటు చేస్తే 60వేల మందికి... విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మరో 50వేల మం దికి ఉపాధి కలుగుతుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పుష్కలమైన వనరులుండగా... రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం కొడుకు కేటీఆర్‌ను విదేశాలకు పంపి ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజాలను ఆశ్రయిస్తున్నారని దుయ్యబట్టారు. జూలై 10న హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు నిర్వహించనున్న దిగ్బంధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సీపీఎం జిల్లా కార్యదర్శి సారంపెల్లి వాసుదేవరెడ్డి, జయలక్ష్మి, రాములు, చుక్కయ్య, రొయ్యల రాజు, యాదానాయక్, బొట్ల చక్రపాణి, ఎండీ.అమ్జద్‌పాషా, రత్నం రాజేందర్, ప్రవీ ణ్, పి.మధు, పద్మారాణి, మోక్షారాణి పాల్గొన్నారు. -
రెక్కలు ముక్కలు.. ఎన్నాళ్లీ తిప్పలు!
రోడ్డంతా చెత్త నిండినా.. వాళ్లే గుర్తొస్తారు. వీధి దీపాలు వెలుగకున్నా.. వాళ్లే సరిచేస్తారు. కానీ వారింట్లో అన్నీ సమస్యలే. బండ చాకిరి చేసినా.. అరకొర వేతనాలే. అందులోనూ కోతలు! తమ జీవితాల్లో వెలుగులు నింపాలంటూ.. సమస్యలు పరిష్కరించాలంటూ రేపటి నుంచి కార్మికలోకం సమ్మెబాట పడుతోంది. - కార్మికులకు కనీస వేతనాలు కరువు - దుర్భర పరిస్థితుల్లో కుటుంబాలు - రేపటి నుంచి సమ్మెబాట వరంగల్ అర్బన్ : జిల్లాలో 3,175 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు అరకొర వేతనాలతో బతుకులీడుస్తున్నారు. పద్నాలుగేళ్లకు పైగా వీరు బల్దియూల్లో పనిచేస్తున్నారు. కాలం, సమయంతో సం బంధం లేకుండా నిరంతరం శ్రమిస్తున్నా.. దానికి తగిన వేత నం అందడం లేదు. బల్దియాల్లో పనిచేస్తున్న కార్మికుడి వేతనం రూ.8,300. ఫీఎఫ్, ఈఎస్సై తదితర సొమ్ము రూ.1,100 వరకు కోత పడుతోంది. సెలవులు, బయోమెట్రిక్ మొరాయింపుతో వేతనాల్లో కోత వేస్తారు. వరంగల్ బల్దియా పరిధి విలీన గ్రామాల కార్మికులకు ఇటీవల వేతనాలు పెంచారు. కానీ వీరికి ఈఎస్సై,ఫీఎఫ్ లాంటి సౌకర్యాలు లేవు. విద్యుత్ స్తంభాలు ఎక్కి, వీధి లైట్లు పెట్టే కార్మికులకు, ఫిల్టర్ బెడ్లలో పనిచేసే కార్మికుల నెల వేతనం రూ. 6,700. కానీ వీరిలో చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారు. మరికొందరు పనిభారం ఎక్కువై మద్యానికి బానిసవుతున్నారు. సరైన వైద్యసేవలు అందక విలువైన జీవితాలను కోల్పోతున్నారు. పాలకులు కమిషనర్లు, అధికారులు.. పనిముట్లు సమాకుర్చి, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఆందోళనకు దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది
హైదరాబాద్: తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ సికింద్రాబాద్‌లోని నార్త్‌జోన్ జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట కార్మికులు, సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. -
‘ఈపీఎఫ్’ ఝలక్
వరంగల్ నగరపాలక సంస్థకు రూ.2.80 కోట్ల జరిమానా బల్దియా బద్దకంతో ప్రావిడెండ్ ఫండ్ చెల్లించని వైనం గతంలో ఈఎస్ఐ షాక్‌తో మారని అధికార యంత్రాంగం కమిషనర్ చొరవతో వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని వేడుకోలు వరంగల్ అర్బన్ : వరంగల్ మహానగర పాలక సంస్థకు ఈపీఎఫ్ శాఖ ఝలక్ ఇచ్చింది. అవుట్ సోర్సింగ్ కార్మికుల సొమ్మును సకాలంలో జమ చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పపట్టింది. రూ.2.80 కోట్ల జరిమానా చెల్లించాని హుకూం జారీ చేసింది. చెల్లించక పోతే ఆర్ఆర్ చట్టం కింద బల్దియా బ్యాంక్ ఖాతాల సొమ్మును రికవరీ చేసుకుంటామని హెచ్చరిక జారీ చేసింది. దీంతో మహా నగరపాలక సంస్థ అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. కాగా, గతేడాది కూడా బల్దియూ అధికారుల నిర్లక్ష్యంతో రూ.71 లక్షలు జరిమానా పడింది. ఈ సొమ్ము నేరుగా బల్దియా ఎస్బీహెచ్ బ్యాంక్ నుంచి నేరుగా ఈఎస్ఐ శాఖ ఖాతాల్లోకి మళ్లింది. అరుునా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడలేదు. తీరుమారని బల్దియూ 2010 సంవత్సరంలో రాష్ర్ట ప్రభుత్వం నగర పాలక సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ మహా నగరపాలక సంస్థ పరిధిలో ప్రజారోగ్యంలో కాంట్రాక్టు పద్ధతిపై 1,431 మంది పారిశుదధ్య కార్మికులు, 66 మంది జవాన్లు, 277 మంది ట్రై సైకిల్ కార్మికులు, అర్బన్ మలేరియా విభాగంలో 60 మంది కార్మికులు, 30 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 15 మంది సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారు. దీంతో అదే ఏడాది ఆగస్టు నుంచి నగర పాలక సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది వేతనాల్లో ఫీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము మినహా ఇస్తున్నప్పటికీ కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయడం లేదు. పలుమార్లు ఈఎస్ఐ, ఈఫీఎస్ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నోటీసులు, మోమోలు అందచేశారు. అయినా బల్దియా అధికారులు, సిబ్బంది పెడచెవిన పెట్టారు. దీంతో ఈపీఎఫ్ శాఖ అధికారులు బల్దియాపై కొరఢా ఝులిపించారు. సకాలంలో ఈపీఎఫ్ సొమ్ము జమ చేయని కారణంగా జరిమానగా రూ.2.80 కోట్లు చెల్లించాలని కొద్ది నెలల కిందట నోటీసులు జారీ చేశారు. తాజాగా మారోమారు ఈపీఎఫ్ శాఖ నుంచి బల్దియాకు నోటీసులు అందాయి. ఇటీవల బల్దియా కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సర్పరాజ్ అహ్మద్ దిద్దుబాటు చర్యలకు రంగంలోకి దిగారు. ఈపీఎఫ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మొయిన్ బ్రాంచ్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ అధికారులతో సమావేశమైమయ్యారు. జరిమానా సొమ్ము చెల్లించాల్సిందేనని ఈపీఎఫ్ శాఖల అధికారులు సూచించారు. జరిమానా సొమ్ము వాయిదా పద్ధతిలో చెల్లిస్తామని తెలిపారు. ఇప్పటికైనా బల్దియా అధికారులు, సిబ్బంది తీరులో మార్పు రావాల్సి ఉందని కమిషనర్ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. -
రూ.100 కోట్ల నిధి బూటకం
చంద్రబాబు ప్రకటనపై రవీంద్రనాథ్ ధ్వజం ఒంగోలు టౌన్: ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలపై ఆందోళనలు ఉధృతం అవుతున్న నేపథ్యంలో వాటిని చల్లార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.100 కోట్లతో నిధి అంటూ బూటకపు ప్రకటనలు చేస్తున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి రావులపల్లి రవీంద్రనాథ్ ధ్వజమెత్తారు. పేరుకు రూ.100 కోట్లతో నిధి అంటున్నారు తప్పితే దానికి సంబంధించిన విధి విధానాలు ప్రకటించలేదని విమర్శించారు. గురువారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల కాలంలో ఏ ప్రభుత్వానికీ లేని విధంగా ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రభుత్వ స్కీమ్‌ల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారు ఇప్పటికీ కనీస వేతనానికి నోచుకోవడం లేదన్నారు. వారందరికీ కనీస వేతనం రూ.15 వేల చొప్పున చెల్లించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రాధాన్యతా క్రమంలో వారిని రెగ్యులర్ చేయాలన్నారు. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ పెట్టుబడులను నిలిపివేయాలన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్డీ సర్దార్, ప్రధాన కార్యదర్శి పీవీఆర్ చౌదరి, నాయకులు ఎస్కే మస్తాన్, కే నాగేశ్వరరావు, బీ రామయ్య పాల్గొన్నారు. -
సమ్మెబాట
గుంటూరు సిటీ : అందరికీ వెలుగులు పంచే వారి జీవితాల్లో మాత్రం చీకట్లు తొలగిపోవడం లేదు. రోజంతా కష్టపడినా బతుకులు మారడం లేదు. సెలవులు లేకుండా పనిచేస్తున్నా ఉద్యోగ భరోసా లేదు. అందుకే వారంతా సమ్మెకు సమాయత్తమవుతున్నారు. మంగళవారం తిరుపతిలో జరగనున్న రాష్ట్రసదస్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. విద్యుత్‌శాఖలో టెక్నికల్, నాన్ టెక్నికల్ కలిపి మొత్తం 70 రకాల విభాగాలు ఉన్నారుు. నవ్యాంధ్రప్రదేశ్‌లో అన్ని విభాగాల్లో కలిపి రమారమి 18 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే రెండు వేల మంది వరకు కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఒక పండగనీ, పబ్బమనీ అధికారికంగా ఒక్క సెలవు కూడా మంజూరు కాదు. పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా దక్కేది అంతంత మాత్రం వేతనమే. పెపైచ్చు తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ఉద్యోగం. అయినా, ఏనాటికైనా పర్మనెంట్ కాకపోతుందా అన్న ఆశతో ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు గత హయాంలో ఈ ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిన నియూమకాలు చేపట్టి వారి హక్కులను హరించారు. గతంలో ప్రభుత్వ, కార్మిక యజమానుల ప్రతినిధులతో కాంట్రాక్ట్ లేబర్ అడ్వయిజరీ పేరిట ఒక బోర్డు ఉంది. కాంట్రాక్ట్ కార్మికుల చట్టం అమలు కాకపోతే కార్మికులు అప్పట్లో దానికి ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే ఇప్పుడా అవకాశం లేకుండా చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి దీనిపై దీనిపై ప్రత్యేకంగా జీవో నంబర్ 649 జారీ చేసి మళ్లీ కాంట్రాక్టు కార్మికుల్లో కొత్త ఆశలు చిగురింపజేశారు. ఆయన హఠాన్మరణంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది. ఎన్నికల్లో కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తానని చంద్రబాబు హామీఇచ్చినా అది నేరవేరలేదు. దీంతో వారు సమ్మె బాట పట్టేందుకు సమాయత్తమవుతున్నారు. సమ్మె తప్పదు.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని కోరుతూ ఇప్పటికే పలు రూపాల్లో దశలవారీ ఆందోళనలు నిర్వహించాం. పాలకులకు మహాజరులు సమర్పించుకున్నాం. ప్రజాప్రతినిధులను వేడుకున్నాం. అయినా గడచిన 18 సంవత్సరాలుగా ఈ సమస్య సజీవంగానే ఉంది. విసిగెత్తిపోయూం. ఇక ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని భావించాం. అందులో భాగంగానే ప్రభుత్వానికి ఇప్పటికే సమ్మె నోటీసు కూడా ఇచ్చాం. డిసెంబర్ 15లోగా దీనిపై సముచిత నిర్ణయం తీసుకోవాలని కోరాం. డిసెంబర్ 2న తిరుపతిలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నాం. 15లోగా ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె తప్పదు. - సీహెచ్.నాగబ్రహ్మాచారి, యునెటైడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. -
ఔట్ సోర్సింగ్ వ ర్కర్లకు వేతనం బంద్
15 నెలలుగా పెండింగ్ అప్పులపాలవుతున్న కుటుంబాలు నూజివీడు, న్యూస్‌లైన్ : సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ వర్కర్లకు 15నెలలుగా జీతాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణకోసం అప్పులపాలవుతున్నా ప్రభుత్వం దయచూపడం లేదని ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంఘి కసంక్షేమ శాఖ జిల్లాలో నిర్వహించే హాస్టళ్లలో దాదాపు 230మంది ఔట్సోర్సింగ్ వర్కర్లు పనిచేస్తున్నారు. నూజివీడు ఏఎస్‌డబ్ల్యూవో కార్యాలయం పరిధిలోని నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి మండలాల్లో ఉన్న హాస్టళ్లలో 30మంది వర్కర్లు కుక్‌లు, సర్వెంట్లు, వాచ్మన్లుగా పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.6,700 వేతనం ఇవ్వాల్సి ఉంది. అరుుతే 15నెలలుగా వీరికి వేతనం ఇవ్వడం లేదు. మేమెలా బతకాలని వీరు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వేతనాలు విడుదల చేసి ఆదుకోవాలని వర్కర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. నెలానెలా వేతనం ఇవ్వాలి నేను 2008 నుంచి హాస్టల్లో పనిచేస్తున్నా. గత 15నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి అధికవడ్డీకి అప్పులు చేయాల్సి వస్తోంది. ఇకనుంచైనా నెలనెలా జీతాలు ఇవ్వాలి - చిట్టూరి జమలమ్మ, నూజివీడు బంగారం కుదువపెట్టా నెలానెలా జీతాలు రాక కుటుంబ పోషణ భారంగా మారుతోంది. వేతనాలు రాకుండా ఇన్ని నెలలు జీవనం సాగించాలంటే ఇబ్బందులు పడుతున్నాం. ఇంటి అద్దె చెల్లించడానికి బంగారం కుదవపెట్టా. - జుజ్జునూరి రామయ్య, నూజివీడు అప్పులు చేస్తున్నాం దసరా, దీపావళి పండుగలను అప్పులు చేసి జరుపుకోవాల్సి వస్తోంది. 2009నుంచి పనిచేస్తున్నా. నెలకు మాకు ఎంత జీతం ఇస్తున్నారో కూడా తెలియడం లేదు. జీతాలు వెంటనే విడుదల చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. - చోడవరపు రాణి, నూజివీడు -
కలెక్టర్‌కు కార్మికుల సమ్మె నోటీసు
నల్లగొండ టుటౌన్ : మున్సిపాలిటీలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఔట్ సోర్సింగ్ కార్మికులు బుధవారం కలెక్టర్ టి.చిరంజీవులు సమ్మె నోటీసు అందజేశారు. తమ డిమాండ్లను ఈ నెల 24లోగా పరిష్కరించాలని కోరారు. డిమాండ్ల పరిష్కారం కోసం చర్యలు తీసుకోకుంటే 25 నుంచి సమ్మెకు దిగుతామని వివరించారు. ఈఎస్ఐ, పీఎఫ్ డబ్బులను కార్మికుల వ్యక్తిగత ఖాతాలో జమ చేసి బ్యాంకుల ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. అలాగే మూడేళ్ల సర్వీస్ పూర్తయిన కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, నైపుణ్యం బట్టి పదోన్నతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేడి రాజు, ఎస్.వెంకటేశ్, బొర్ర సుధాకర్, పెరిక కరణ్‌జయరాజ్, పెరిక రాజు, పి.వెంకటేశ్, పి.సైదులు, కె.పరశురాం పాల్గొన్నారు.