మున్సిపల్ కార్మికులకు ‘డబ్బు’ల్ ధమాకా! | municipal workers double digit increased | Sakshi
Sakshi News home page

మున్సిపల్ కార్మికులకు ‘డబ్బు’ల్ ధమాకా!

Published Mon, Jun 29 2015 1:10 AM | Last Updated on Tue, Oct 16 2018 7:27 PM

మున్సిపల్ కార్మికులకు ‘డబ్బు’ల్ ధమాకా! - Sakshi

మున్సిపల్ కార్మికులకు ‘డబ్బు’ల్ ధమాకా!

వేతనాల రెట్టింపునకు ప్రభుత్వానికి పురపాలక శాఖ ప్రతిపాదన
మున్సిపాలిటీ స్థాయితో సంబంధం లేకుండా ఒకే తరహా వేతనాలకు సిఫార్సు
పబ్లిక్ హెల్త్ వర్కర్ల వేతనం రూ. 8,300 నుంచి రూ. 14,170కు ...
నాన్‌పబ్లిక్ హెల్త్‌వర్కర్ల వేతనం రూ. 8,300 నుంచి రూ. 17,380కు  పెంచాలని సూచన
ఆర్థికశాఖ ఆమోదిస్తే 13,955 మంది కాంట్రాక్టు వర్కర్లకు లబ్ధి

సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు శుభవార్త.

ఇకపై మున్సిపాలిటీల స్థాయితో సంబంధం లేకుండా ఒకే తరహా వేతనాల కోసం పురపాలకశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. పారిశుద్ధ్య కార్మికుల కనీస వేతనాన్ని రూ.14,170 (స్థూల వేతనం రూ.19,586)కు, పారిశుద్ధ్యేతర కార్మికులకు రూ.17,380 (స్థూల వేతనం రూ.24,023)కు పెంచాలని కోరింది. ఈ ప్రతిపాదనలను ఆర్థికశాఖ యథాతథంగా ఆమోదిస్తే వేతనాలు దాదాపు రెట్టింపు కానున్నాయి.

ప్రస్తుతం కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ల్లోని కార్మికులకు కనీస వేతనం రూ.8,300 (స్థూల వేతనం రూ.11,473) చెల్లిస్తుండగా, నగర పంచాయతీల్లోని కార్మికులకు రూ.7,300 (స్థూల వేతనం రూ.10,091) చెల్లిస్తున్నారు. 9వ పీఆర్‌సీ 4వ తరగతి ఉద్యోగుల కోసం సిఫారసు చేసిన కనీస వేతనాన్ని ప్రస్తుతం మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వోద్యోగులకు ప్రకటించిన 10వ పీఆర్‌సీ 43 శాతం ఫిట్‌మెంట్‌ను తమకు సైతం వర్తింపజేయాలని మున్సిపల్ ఉద్యోగ, కార్మిక ఐక్య సంఘాలు డిమాండ్ చేశాయి. లేకుంటే నిరసనలు, సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. దీంతో వారి డిమాండ్‌కు అనుగుణంగానే పురపాలకశాఖ వేతన పెంపు ప్రతిపాదనలను సిద్ధం చేసి ఆర్థికశాఖ ఆమోదం కోసం పంపింది.

జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని 67 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 13,955 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తుండగా అందులో 9,953 మంది పారిశుద్ధ్య (పబ్లిక్ హెల్త్) కార్మికులు, 4,002 మంది పారిశుద్ధ్యేతర (నాన్ పబ్లిక్ హెల్త్) కార్మికులు ఉన్నారు. ప్రస్తుతం పురపాలికలు చెల్లిస్తున్న వేతనాలకు ఏటా రూ.186.70 కోట్లు ఖర్చవుతుండగా వేతనాలు పెంచితే ఆర్థిక భారం రూ.346.51 కోట్లకు పెరగనుంది. పురపాలికలపై రూ.159.81 కోట్ల అదనపు భారం పడనుంది. కాగా, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల క్రమబద్ధీకరణ డిమాండ్ సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు.
 
సఫాయివాలాల వేతనాలూ సఫాయి
పలు మునిసిపాలిటీల్లో కాంట్రాక్టు కార్మికుల వేతనాల చెల్లింపుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు పురపాలకశాఖ పరిశీలనలో తేలింది. ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ వాటాలను కార్మికుల వేతనాల నుంచి కోత పెట్టినప్పటికీ సంబంధిత కార్మికుల ఖాతాల్లో జమ చేయలేదని నిర్ధారించింది. మున్సిపల్ కమిషనర్లు, లేబర్ కాంట్రాక్టర్లు రూ. 9.04 కోట్ల ఈఎస్‌ఐ, పీఎఫ్ నిధులను స్వాహా చేసినట్లు ప్రాథమిక పరిశీలనలో తేల్చింది. ఈ నిధులను తక్షణమే కార్మికుల ఖాతాల్లో జమ చేయకుంటే కఠిన చర్యలు తప్పవని పురపాలకశాఖ ఇటీవల మున్సిపల్ కమిషనర్లను హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement