మున్సిపల్ కార్మికుల సమ్మెబాట
నేటి నుంచి విధులకు గైర్హాజరు
సాక్షి, హైదరాబాద్: ‘కనీస’ వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం మునిసిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు నెల రోజులుగా చేస్తున్న ఆందోళన తీవ్రతరమైంది. కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో సోమవారం ఉదయం 6 గంటల నుంచి తాము సమ్మెకు దిగుతున్నామని తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ ఉద్యోగ, కార్మిక ఐక్య సంఘాలు ప్రకటించాయి.
జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని 67 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సిం గ్ ప్రాతిపదికన పనిచేస్తున్న 40 వేల మంది కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. దీంతో రాష్ట్ర వ్యా ప్తంగా నగర, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు స్తంభించిపోనున్నాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేయకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ ఇబ్బందికరంగా మారనుంది.
సమ్మె సైరన్ మోగింది: కార్మిక సంఘాల జేఏసీ
తమ డిమాండ్లపై ప్రభుత్వ స్పందన కరువవ్వడంతో తాము సమ్మెలోకి వెళ్తున్నామని, ఇందుకు సైరన్ మోగిందని.. దీన్ని ఆపడం ముఖ్యమత్రి కేసీఆర్ తరం కాదని కార్మిక సంఘాల జేఏసీ నేతలు స్పష్టీకరించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం పెంచాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగ, కార్మిక ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు జీహెచ్‌ఎంసీలో పనిచేసే వివిధ విభాగాల కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో సీఐటీయూ నేత పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. యాదాద్రికి రెండు వందల కోట్లు, వేములవాడకు ఏడాదికి రూ.వంద కోట్లను ప్రకటిస్తున్న సీఎంకు తమ గోడు పట్టదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వివిధ ట్రేడ్‌యూనియన్ల నేతలు ప్రసంగించారు.
ఫలించని గత చర్చలు..
మున్సిపల్ కార్మికుల సమస్యలపై జూన్ 20న కార్మికశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి చర్చలు జరిపారు. ఈ మేరకు కార్మికుల డిమాండు మేరకు పెంపు ప్రతిపాదనలు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు సీఎంవో పరిశీలనలో ఉండడంతో సమ్మెను వాయిదా వేసుకోవాలని అధికారులు కోరారు. దీంతో సమ్మె గత నెల 22 నుంచి జూలై 6కు వాయిదా పడింది. ఇప్పటికీ ఆ ప్రతిపాదనలకు కదలిక లేకపోవడంతో కార్మికులు సమ్మెకు దిగుతున్నారు.
అందరితో పాటే పెంచుతాం
ఆర్థిక శాఖ స్పష్టీకరణ
మునిసిపల్ కార్మికుల వేతన పెంపు ప్రతిపాదనలను ఆర్థిక శాఖ వెనక్కి పంపించింది. ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందనీ, అందరితో పాటే మునిసిపల్ కార్మికుల వేతనాలను సైతం పెంచుతామని స్పష్టీకరించింది. దీంతో వేతన పెంపు ప్రతిపాదనలను సీఎం కార్యాలయం పరిశీలనకు పంపినట్లు పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి.