
టీజీవో అసోసియేషన్ కేలండర్‌ను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి
ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం సరిపోవడం లేదు.. ఉద్యోగులతో సీఎం రేవంత్‌రెడ్డి
ఆర్థిక ఇబ్బందుల వల్లే కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోతున్నాం
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వారిని రెగ్యులరైజ్ చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి
పట్టుబడితే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదన్న సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు ఉద్యోగుల సహకారం కావాలని.. సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు చేర్చేది ఉద్యోగులేనని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రాష్ట్రంలో సామాజిక మార్పు తీసుకొచ్చామని.. ఆర్థికపరమైన మార్పులు తీసుకురావాలంటే ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ, కేలండర్లను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘రాష్ట్ర ఆదాయాన్ని పారదర్శకంగా ఖర్చు చేసేందుకు మీరు ఎలాంటి సలహాలిచ్చినా తీసుకుంటాం. ఈ ప్రభుత్వం మనది. ఆదాయాన్ని పెంచాలన్నా, పెంచిన ఆదాయం పంచాలన్నా ఉద్యోగుల చేతుల్లోనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) కష్టకాలంలో బాధ్యతలు చేపట్టింది. తెలంగాణ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం మాది. ఉద్యోగులకు ప్రతీ నెల మొదటి తారీఖున జీతాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రత్యేక రాష్ట్రంలో ఉ ద్యోగులు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటో అందరికీ తెలుసు. మిమ్మల్ని కష్టపెట్టి, మీకు నష్టం కలిగే పనులను మా ప్ర భుత్వం చేయదు. అక్కడక్కడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వానికి తగిన ఆదాయం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోతున్నాం.
ఆదాయం ఇలా.. ఖర్చులు అలా..
ప్రతీ నెల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.18,500 కోట్లు. ఇది సరిపోవడం లేదు. అన్నీ సక్రమంగా నిర్వహించాలంటే రూ.30 వేల కోట్లు కావాలి. వచ్చే ఆదాయంలో కూడా ప్రతినెలా రూ.6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అవసరాలకు చెల్లిస్తున్నాం. మరో రూ.6,500 కోట్లు అప్పులు చెల్లించాలి. మిగిలిన రూ.5,500 కోట్లలోనే సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి. కనీస అవసరాల వారీగా చూసినా.. ప్రతీ నెలా రూ.22,500 కోట్లు కావాలి. వస్తున్న ఆదాయంతో పోలిస్తే ఇది రూ.4,000 కోట్లు తక్కువ. గత పదేళ్లలో పరిపాలన వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మేం అధికారంలోకి రాగానే పాలన వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నం చేశాం. ప్రభుత్వ ఆదాయం ప్రతీ నెలా మరో రూ.4,000 కోట్లు పెంచుకోవాలి. సంక్షేమ పథకాలు నిజమైన లబ్దిదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలి.
ప్రతిపక్షాల ఉచ్చులో పడితే నష్టపోయేది మీరే
ప్రతిపక్షాల ఉచ్చులో పడితే చివరకు నష్టపోయేది ఉద్యోగులే. రాజకీయాల కోసం కొందరు నిరసనలు, ధర్నాలకు ప్రేరేపిస్తున్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని మాకు ఉన్నా చేయలేని పరిస్థితి. సర్వశిక్షా అభియాన్ కేంద్ర ప్రభుత్వ స్కీం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవకాశం లేకపోయినా రెగ్యులరైజ్ చేయాలని పట్టుబడితే సమస్య పెరుగుతుందే తప్ప పరిష్కారం కాదు. మీ సమస్యలేమిటో చెప్పండి.. పరిష్కారానికి కార్యాచరణ చేపడతాం. ఈ ప్రభుత్వం మీ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరిస్తుంది. సమస్యల పరిష్కారానికి మీరు ధర్నాలే చేయాల్సిన అవసరం లేదు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి’’అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment