
గ్రామాలు, మండలాలు జిల్లాల వారీగా చర్చిద్దామా?.... సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్
ప్రభుత్వంపై ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా కేంద్ర ప్రభుత్వం ఏమి చేసిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేసిందో చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో? ఎవరు అన్యాయం చేశారో బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. 2025–26 కేంద్ర బడ్జెట్‌లో పన్నులు, పథకాల రూపంలో తెలంగాణకు రూ.1.08 లక్షల కోట్లు కేటాయించినట్టు చెప్పారు.
కేంద్రబడ్జెట్‌లో రాష్ట్రానికి చేసిన కేటాయింపులపై సంజయ్ గురువారం ఓ హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువకాలం ఉండబోదని చెబుతున్నారు కదా దానికి ఆధారాలున్నాయా అన్న ప్రశ్నకు సంజయ్ సమాధానమిస్తూ.. ‘కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు. టాప్–5 మంత్రులు తప్ప రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. 6 గ్యారంటీలు అమలు చేయడం లేదు కాబట్టి తాము ప్రజల్లో తిరగలేకపోతున్నామంటూ రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మేము మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అయిదేళ్లు ఉండాలని కోరుకుంటున్నాం’అని చెప్పారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తామని కేసీఆర్ చెబుతున్నారు కదా దానిపై ఏమంటారన్న ప్రశ్నకు... ‘బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థులే కరువయ్యారు... ఇక ఆ పార్టీ యాడుంది? బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ చీకటి మిత్రులు. బీఆర్‌ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌తో రాజీ కుదుర్చుకున్నది నిజం కాదా? మాపై కేసులు పెట్టొద్దు... కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి బీజేపీని అడ్డుకుందామని కేసీఆర్ ప్రతిపాదించారు.
కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండేందుకే అభ్యర్థులను నిలబెట్టకుండా కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారు’అని సంజయ్ బదులిచ్చారు. భూపాలపల్లి రాజలింగమూర్తి హత్యపై విచారణ జరిపి నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
కులగణన తప్పులతడక
‘కులగణన తప్పులతడక... జనాభా లెక్కలే తప్పు. రాష్ట్రంలో 3.95 కోట్ల ఆధార్ కార్డులుంటే... జనాభా 3.7 కోట్లు ఎట్లా ఉంటుంది? నిజానికి 4.30 కోట్ల జనాభా ఉంటే 60 లక్షల ప్రజలు ఏమైపోయారు?’అని సంజయ్ చెప్పారు. ‘బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్ధం. బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది’అని మండిపడ్డారు.
దేశ బడ్జెట్‌లో ఒక రాష్ట్రం పేరును ప్రస్తావించనంత మాత్రాన ఆ రాష్ట్రానికి నిధులివ్వలేదనడం సరికాదన్నారు. కృష్ణా జలాల వాటా లో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్, బీఆర్ ఎస్‌లేనని, ఈ విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన మొదటి ద్రోహి కేసీఆర్ అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment