హౌసింగ్‌ ఉద్యోగులు ఔట్‌ | TDP Govt Remove outsourcing Inspectors workers | Sakshi
Sakshi News home page

హౌసింగ్‌ ఉద్యోగులు ఔట్‌

Published Sun, Jun 24 2018 8:10 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM

TDP Govt Remove outsourcing Inspectors workers - Sakshi

అంతన్నారు.. ఇంతన్నారు.. హామీల వర్షం కురిపించారు.. 
ఉద్యోగాలు వస్తాయంటూ ఊరించారు.. నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారు.. కొత్త జాబులు రాకపోగా ఉన్నవి పీకి పారేస్తున్నారు.. కొత్త కొత్త నిబంధనలు.. అర్హతల మెలికలతో ఉద్యోగాలను తొలగించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం పూనుకుంది. దీనిలో భాగంగా గృహనిర్మాణ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పదేళ్లుగా పనిచేస్తున్న వర్క్‌ ఇన్‌స్పెక్టర్లను తొలగిస్తూ రెండు నెలల క్రితం ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలో 60 మంది ఉద్యోగాలను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 

ఏలూరు (మెట్రో) : బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసి గద్దెనెక్కిన తర్వాత ఆ మాటే మరిచిపోయారు తెలుగుదేశం పార్టీ నాయకులు. కొత్త జాబులు రాకపోగా ఉన్నవి ఊడిపోయే పరిస్థితి వచ్చింది. ఔట్‌సోర్సి ంగ్‌ ఉద్యోగాలను ఉఫ్‌ అంటూ పీకేస్తూ చిరుద్యోగుల ఉపాధికి గండి కొడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 2008లో గృహనిర్మాణ శాఖలో విధులు నిర్వహించేందుకు ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో 173 మంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్లను నియమించారు. అప్పటి నుంచి గృహ నిర్మాణ పథకాల వద్ద వీరు విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో గృహ నిర్మాణాలు చేసిన మేరకు ఆయా ప్రభుత్వాలు వేతనాలు చెల్లిస్తుండేవి. అయితే వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు పనికి తగిన వేతనం లభించడం లేదని ఆందోళన చెందడంతో నెలకు రూ.15 వేలు వేతనాన్ని చెల్లించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు ఆనందం వ్యక్తం చేశారు. అయితే వీరి ఆనందం కొద్దిరోజుల్లోనే ఆవిరి అయిపోయింది. నెలసరి వేతనాన్ని నిర్ణయించడంతో పాటు కొత్త నిబంధనలు తీసుకురావడంతో చాలా మంది ఉద్యోగాలను కోల్పోయారు. 

పదేళ్లకు గుర్తొచ్చిన నిబంధనలు
ప్రభుత్వం గృహనిర్మాణ శాఖలో విధులు నిర్వహించేందుకు 2008లో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన  ఐ టీఐ చేసిన అభ్యర్థులను వర్క్‌ ఇన్‌స్పెక్టర్లుగా నియమించింది. అప్పట్లో ఐటీఐలో అన్ని ట్రేడుల వారిని అర్హులుగా గుర్తించి ఉద్యోగాలు ఇచ్చారు. అయితే ఐటీఐలో ట్రేడులను పక్కన పెట్టి ఐటీఐ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు కట్టబెట్టింది. అయితే చంద్రబాబు సర్కారు ఉద్యోగులను తగ్గించే ఆలోచనతో పదేళ్ల తర్వాత కొత్త నిబంధనలను తెరపైకి తీసుకువచ్చింది. ఐటీఐలో సివిల్‌ డిప్లమో, డ్రాఫ్ట్‌మెన్‌ సివిల్‌ వంటి ట్రేడులు ఉన్న వర్కు ఇన్‌స్పెక్టర్లను మాత్రమే కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇతర ట్రేడుల్లో ఉద్యోగాలు పొందిన వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు ఉద్యోగాలను కోల్పోయారు. ఇలా జిల్లాలో 60 మంది ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారు. 

వీధిన పడ్డ 60 కుటుంబాలు : 2008 నుంచి గృహ నిర్మాణ శాఖనే నమ్ముకుని విధులు నిర్వహించే వర్కు ఇన్‌స్పెక్టర్లు తమ ఉద్యోగాలు పర్మినెంట్‌ అవుతాయని భావించారు. చంద్రబాబు సర్కారు వీరి ఉద్యోగాలు తొలగించడంతో 60 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.కాళ్లరిగేలా తిరుగుతున్నా.. కొత్త నిబంధనలతో ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డామని రెండు నెలలుగా జిల్లాలోని వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రాలు అందిస్తున్నారు. ఉన్నతస్థాయి అధికారులను కలిసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయినా ఏ ఒక్క నాయకుడూ, అధికారీ వీరికి న్యాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. 

న్యాయం చేయండి మహాప్రభో
పదేళ్ల నుంచి గృహనిర్మాణ శాఖనే నమ్ముకుని జీవనాలు సాగిస్తున్నాం. హౌసింగ్‌ బోర్డు మేనేజింగ్‌ డైరెక్టర్‌ విడుదల చేసిన జీఓతో ఉద్యోగాలను తొలగించారు. ఒక్క సంతకంతో ఉద్యోగాలు తీసేయడంతో ఏం చేయాలో తెలియడం లేదు. మాకు న్యాయం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం.  
 – దిద్దే జగన్, బాధితుడు

పర్మినెంట్‌ చేస్తారనుకుంటే..
వర్క్‌ ఇన్‌స్పెక్టర్లను పర్మినెంట్‌ చేస్తారని ఎప్పటి నుంచో భావిస్తున్నాం. పర్మినెంట్‌ చేయకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగించేశారు. ఎటువంటి ప్రత్యామ్నాయం చూపించకుండా ఉద్యోగాలు తొలగించడంతో కుటుం బాలతో సహా రోడ్డున పడ్డాం. మా గోడు పట్టించుకునే వారే లేరు.              
 – కొడవటి శ్రీనివాస్, బాధితుడు

ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది
అధికంగా ఉన్న ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన వారిని నియమించి, అర్హతలు లేని ఉద్యోగులను తొలగించాం. ఐటీఐలో సివిల్‌కు ప్రాధాన్యత ఇచ్చి అర్హులైన అభ్యర్థులను కొనసాగిస్తున్నాం. 
– ఈ.శ్రీనివాస్, హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement