రూ.100 కోట్ల నిధి బూటకం
చంద్రబాబు ప్రకటనపై రవీంద్రనాథ్ ధ్వజం
ఒంగోలు టౌన్: ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలపై ఆందోళనలు ఉధృతం అవుతున్న నేపథ్యంలో వాటిని చల్లార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.100 కోట్లతో నిధి అంటూ బూటకపు ప్రకటనలు చేస్తున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి రావులపల్లి రవీంద్రనాథ్ ధ్వజమెత్తారు. పేరుకు రూ.100 కోట్లతో నిధి అంటున్నారు తప్పితే దానికి సంబంధించిన విధి విధానాలు ప్రకటించలేదని విమర్శించారు. గురువారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు.
అధికారంలోకి వచ్చిన ఆరునెలల కాలంలో ఏ ప్రభుత్వానికీ లేని విధంగా ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రభుత్వ స్కీమ్‌ల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారు ఇప్పటికీ కనీస వేతనానికి నోచుకోవడం లేదన్నారు.
వారందరికీ కనీస వేతనం రూ.15 వేల చొప్పున చెల్లించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రాధాన్యతా క్రమంలో వారిని రెగ్యులర్ చేయాలన్నారు. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ పెట్టుబడులను నిలిపివేయాలన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌డీ సర్దార్, ప్రధాన కార్యదర్శి పీవీఆర్ చౌదరి, నాయకులు ఎస్‌కే మస్తాన్, కే నాగేశ్వరరావు, బీ రామయ్య పాల్గొన్నారు.