టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై యుద్ధమే...
- కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాల్సిందే..
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యదర్శి సాయిబాబా
వరంగల్ అర్బన్/ములుగు : రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, లేనిపక్షంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఐటీయూ అధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం వరంగల్‌కు చేరింది. నగరంతోపాటు ములు గు, భూపాలపల్లిలో ఆయన కార్మికులనుద్ధేశించి మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సర్కా రు చెప్పిన అచ్చా దిన్ కార్మికులకు రాలేదని, సీఎం కేసీఆర్ ప్రకటించిన బంగారు తెలంగాణ కూడా కార్మికులకు వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు.
కార్మికులకు కనీస వేతనంగా ఒక్కొక్కరికి రూ.15 వేలు అందజేయాలని, 8 గంటల పనివిధానాన్ని, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, తదితర సౌకర్యాలు వర్తింపజేయూలని డిమాండ్ చేశారు. ఎంజీఆర్, ఓసీటీసీ, లిబ్రా వంటి 50 పరిశ్రమలు మూతపడడం కారణంగా రాష్ట్రంలో 30వేలకు పైగా కార్మికుల కుటుం బాలు రోడ్డున పడ్డాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలే ఇందుకు ప్రధాన కారణమని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 938 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రస్తుతం కార్మికుల ఆత్మహత్యలు పెరిగేలా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్ట్ కార్మికులు రోడ్డున పడి సమ్మెలు చేస్తుంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని, కార్మికులపై ప్రేమ ఉంటే యాజమాన్యంతో మాట్లాడి సత్వరమే పునరుద్ధరణ చేయించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని వెంకటాపురం, గోవిందరావుపేట మండలాల్లో పుష్కల మైన బొగ్గు ప్రాంతాలు ఉన్నాయని, ఇక్కడ నూతన సింగరేణీని ఏర్పాటు చేస్తే 60వేల మందికి... విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మరో 50వేల మం దికి ఉపాధి కలుగుతుందన్నారు.
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పుష్కలమైన వనరులుండగా... రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం కొడుకు కేటీఆర్‌ను విదేశాలకు పంపి ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజాలను ఆశ్రయిస్తున్నారని దుయ్యబట్టారు. జూలై 10న హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు నిర్వహించనున్న దిగ్బంధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సీపీఎం జిల్లా కార్యదర్శి సారంపెల్లి వాసుదేవరెడ్డి, జయలక్ష్మి, రాములు, చుక్కయ్య, రొయ్యల రాజు, యాదానాయక్, బొట్ల చక్రపాణి, ఎండీ.అమ్జద్‌పాషా, రత్నం రాజేందర్, ప్రవీ ణ్, పి.మధు, పద్మారాణి, మోక్షారాణి పాల్గొన్నారు.