సమ్మె శంఖారావం
విధులు బహిష్కరించిన ఔట్ సోర్సింగ్ సిబ్బంది
నగరపాలక సంస్థ వద్ద హోరెత్తిన నిరసన
వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ సంఘీభావం
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో ఔట్ సోర్సింగ్ కార్మికులు సమ్మె శంఖారావం పూరించారు. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా శుక్రవారం విధులు బహిష్కరించారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద బైఠాయించారు. వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల, కార్పొరేటర్లు వారికి సంఘీభావం ప్రకటించారు. సీపీఎం, సీపీఐ, పలు యూనియన్ల నాయకులు కార్మికులకు బాసటగా నిలిచారు. సర్కార్‌కు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లను ఆమోదించే వరకు పోరు కొనసాగుతుందని హెచ్చరించారు. వేతనాల పెంపు, ఇతర సమస్యలపై లేఖ రాసినప్పటికీ సీఎం నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లోనే కార్మికులు సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ కార్మికులతో తమాషాలు చేస్తే సహించేది లేదన్నారు. డిమాండ్లు ఆమోదించకపోతే చంద్రబాబు రాష్ట్రంలో తిరగలేరన్నారు. సీపీఎం రాజధాని ప్రాంత ఉద్యమ కమిటీ కన్వీనర్ సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ మూడు ప్రాంతాల్లో సీఎం క్యాంపు కార్యాలయాల ఏర్పాటుకు, ఎమ్మెల్యేల జీతాలు పెంపుదలకు లేని ఆర్థిక ఇబ్బందులు కార్మికుల విషయంలోనే వస్తాయా అని ప్రశ్నించారు. మునిసిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆసుల రంగనాయకులు మాట్లాడుతూ కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం తగదన్నారు. సింగపూర్, జపాన్ తిరగడంపై సీఎం చూపుతున్న శ్రద్ధ కార్మికులు, ప్రజల సమస్యలపై కనబరచకపోవడం దురదృష్టకరమన్నారు.
కదం తొక్కిన కార్మికులు
సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులు కార్పొరేషన్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కనీస వేతనం రూ.14,322 చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని, వారసత్వ హక్కు కల్పించాలని, అర్హులైన వారికి జేఎన్‌ఎన్యూఆర్‌ఎం ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు దోనేపూడి శంకర్, కాశీనాథ్, ఉమామహేశ్వరరావు, ఎం.డేవిడ్, జేమ్స్ పెద్దసంఖ్యలో మహిళా కార్మికులు పాల్గొన్నారు.