Sub-Collectors Office
-
సబ్ కలెక్టర్ ఆఫీసు ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
స్థలానికి పట్టా చేయకపోవడంతో మనస్తాపం వికారాబాద్ టౌన్: అధికారులు సర్టిఫికెట్ ఇచ్చిన స్థలాన్ని పట్టా చేయాలని ఆయన ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగాడు. కాగా, సదరు స్థలం తమదంటూ మున్సిపల్, మార్కెట్ కమిటీ అధికారులు పేచీ పెట్టారు. జీవనాధారమైన స్థలం కోల్పోతానేమోనని మనస్తాపం చెందిన ఆయన కలెక్టర్‌కు విన్నవించాలనుకున్నాడు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించిన ఈ ఘటన మంగళవారం జరిగింది. పట్టణంలోని ఎడ్ల బజార్ సమీపంలో ఉండే లక్ష్మయ్య(55)కు వికలాంగురాలైన భార్య బాలమణి, ముగ్గురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. ఆయన స్థానిక మార్కెట్లో ఎద్దుల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వికారాబాద్ సుభాష్‌నగర్ రోడ్డులో 1961 నుంచి సర్వేనంబర్ 20లో ఆయన 260 గజాల స్థలం కబ్జాలో ఉంది. కాగా, తన ఐదుగురు అన్నదమ్ములతో కలిసి అందులో పాక వేసుకొని గేదెలను సాకుతున్నాడు. సదరు స్థలం తనకు కేటారుుంచాలని లక్ష్మయ్య అప్పటి సీఎం చంద్రబాబుతో పాటు పలువురు కలెక్టర్లను వేడుకున్నాడు. దీంతో అధికారులు 1998లో ఆయనకు సర్టిఫికెట్ ఇచ్చారు. స్థలాన్ని పట్టా చేసుకోవాలని లక్ష్మయ్య మున్సిపల్ కార్యాలయానికి వెళ్లగా మార్కెట్ కమిటీ వాళ్లు స్థలం తమదంటూ పేచీ పెట్టారు. దీంతో వ్యవహారం కోర్టులో నడుస్తోంది. స్థలం పట్టా చేసిస్తామని ఇటీవల లక్ష్మయ్య నుంచి మార్కెట్ కమిటీ అధికారులు రూ.3లక్షలు కట్టించుకొని అనంతరం వేధించసాగారు. రెండు శాఖల అధికారులు ఇబ్బంది పెట్టడం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో మనస్తాపం చెందిన లక్ష్మయ్య సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వీడియో కాన్ఫరెన్స కోసం వచ్చిన కలెక్టర్ దివ్యను కలిసి విన్నవించుకోవాలని భావించాడు. ఆమె అందుబాటులో లేకపోవడంతో తనతో తెచ్చుకున్న పురుగులమందును కార్యాలయం దగ్గర తాగేశాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని పట్టణంలోని మిషన్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. లక్ష్మయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. -
సమ్మె శంఖారావం
విధులు బహిష్కరించిన ఔట్ సోర్సింగ్ సిబ్బంది నగరపాలక సంస్థ వద్ద హోరెత్తిన నిరసన వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ సంఘీభావం విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో ఔట్ సోర్సింగ్ కార్మికులు సమ్మె శంఖారావం పూరించారు. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా శుక్రవారం విధులు బహిష్కరించారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద బైఠాయించారు. వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల, కార్పొరేటర్లు వారికి సంఘీభావం ప్రకటించారు. సీపీఎం, సీపీఐ, పలు యూనియన్ల నాయకులు కార్మికులకు బాసటగా నిలిచారు. సర్కార్‌కు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లను ఆమోదించే వరకు పోరు కొనసాగుతుందని హెచ్చరించారు. వేతనాల పెంపు, ఇతర సమస్యలపై లేఖ రాసినప్పటికీ సీఎం నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లోనే కార్మికులు సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ కార్మికులతో తమాషాలు చేస్తే సహించేది లేదన్నారు. డిమాండ్లు ఆమోదించకపోతే చంద్రబాబు రాష్ట్రంలో తిరగలేరన్నారు. సీపీఎం రాజధాని ప్రాంత ఉద్యమ కమిటీ కన్వీనర్ సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ మూడు ప్రాంతాల్లో సీఎం క్యాంపు కార్యాలయాల ఏర్పాటుకు, ఎమ్మెల్యేల జీతాలు పెంపుదలకు లేని ఆర్థిక ఇబ్బందులు కార్మికుల విషయంలోనే వస్తాయా అని ప్రశ్నించారు. మునిసిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆసుల రంగనాయకులు మాట్లాడుతూ కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం తగదన్నారు. సింగపూర్, జపాన్ తిరగడంపై సీఎం చూపుతున్న శ్రద్ధ కార్మికులు, ప్రజల సమస్యలపై కనబరచకపోవడం దురదృష్టకరమన్నారు. కదం తొక్కిన కార్మికులు సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులు కార్పొరేషన్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కనీస వేతనం రూ.14,322 చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని, వారసత్వ హక్కు కల్పించాలని, అర్హులైన వారికి జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు దోనేపూడి శంకర్, కాశీనాథ్, ఉమామహేశ్వరరావు, ఎం.డేవిడ్, జేమ్స్ పెద్దసంఖ్యలో మహిళా కార్మికులు పాల్గొన్నారు. -
5న వైఎస్సార్ సీపీ మహాధర్నా
ప్రకాశ్‌నగర్ (రాజమండ్రి) : రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ఈ నెల ఐదున స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్టు పార్టీ నేత, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తెలిపారు. శనివారం తన కార్యాలయంలో పార్టీకి చెందిన కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు వాటి ఊసెత్తడం లేదని విమర్శించారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తానని మభ్యపెట్టారని దుయ్యబట్టారు. వాటిపై నిలదీసేందుకే మండల కేంద్రాల్లో ధర్నాలు చేయాలని నిర్ణయించామన్నారు. పిలుపునిచ్చారన్నారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సుమారు మూడు వేల మందితో ఆందోళన చేస్తామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మహాధర్నాను విజయవంతం చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ ఇసుక ర్యాంపుల కేటాయింపులో మహిళా సంఘాలను మోసం చేశారని ఆరోపించారు.