- బందరు ప్రభుత్వాస్పత్రిలో కాంట్రాక్టు కార్మికుల సమ్మె
- ఐదు నెలలుగా జీతాలు అందలేని ఆందోళన
- సూపరింటెండెంట్ హామీతో నేటి నుంచి విధులకు
మచిలీపట్నం టౌన్ : ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలని స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి నెలా జీతాలు ఇస్తామని విధుల్లోకి తీసుకున్న కాంట్రాక్టర్ ఐదు నెలలుగా పట్టించుకోవడంలేని ఆరోపిస్తూ గురువారం మెరుపు సమ్మెకు దిగారు. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేశారు. పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలని నినాదాలు చేశారు. కార్మికుల మెరుపు సమ్మెతో ఆస్పత్రిలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. వార్డులు అపరిశుభ్రంగా మారాయి.
ఆందోళనకు దిగిన కార్మిక మహిళలు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ సోమసుందరరావు, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ జయకుమార్‌లను కలిసి తమ సమస్యను వివరించారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఫిబ్రవరి నెల నుంచి తమకు జీతాలు రావాల్సి ఉందని, ప్రస్తుతం ఆరో నెల 24 రోజులు గడిచినా జీతాలు ఇవ్వకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పెండింగ్ జీతాలు అందజేయాలని, లేకపోతే తాము విధులకు హాజరుకాబోమని ప్రకటించారు.
అనంతరం సూపరింటెండెంట్ స్పందిస్తూ ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదని, అందువల్లే జీతాల చెల్లింపులో జాప్యం జరిగిందని చెప్పారు. త్వరలో కొత్త కాంట్రాక్టర్‌కు ఈ పనులను అప్పగిస్తున్నామని, ప్రతి నెలా ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేసేలోపే మీకు జీతాలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించారు. ఇకపై జీతాలు ఆలస్యం కాకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. దీంతో శుక్రవారం నుంచి విధులకు హాజరయ్యేందుకు కార్మికులు అంగీకరించారు. అయితే పెండింగ్ జీతాల గురించి మాత్రం స్పష్టంగా చెప్పలేదు.