బాబుకు నిరసనల సెగ
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో శుక్రవారం రోడ్‌షో చేపట్టిన చంద్రబాబు మహిళలు, టీడీపీ కార్యకర్తల నిరసనలను ఎదుర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ టిక్కెట్లను కోట్లాది రూపాయలకు అమ్ముకుంటున్నారంటూ కైకలూరు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయిని అడ్డుకుని ధ్వజమెత్తారు. కైకలూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చలమలశెట్టి రామానుజయ భార్య, ఆ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు మచిలీపట్నంలో చంద్రబాబు కాన్వాయిని అడ్డుకున్నారు.
పార్టీలో కష్టపడి పనిచేసిన వారిని విస్మరించి కోట్ల రూపాయలు గుమ్మరించినవారికి టిక్కెట్లు ఇవ్వటంపై వారు మండిపడ్డారు. చంద్రబాబు కాన్వాయి వస్తుండగా ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా వచ్చి నిరసన వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు, టీడీపీ నేతలు షాక్ తిన్నారు. చంద్రబాబు వెంట వచ్చిన పోలీసులు, రోప్ పార్టీ రోడ్డుకడ్డంగా నిలిచిన రామానుజయ భార్య, కైకలూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలను పక్కకు లాగేశారు.
అయినా వారు పట్టువదలక రామానుజయకు టీడీపీ టిక్కెట్ ఇవ్వాలంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మచిలీపట్నం, పెడన, పామర్రు నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించిన చంద్రబాబు యథావిధిగానే హామీల చిట్టా గుప్పించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలి వీస్తున్న పెడన, మచిలీపట్నం, పామర్రు నియోజకవర్గాలను ప్రత్యేకంగా ఎంపిక చేసుకుని చంద్రబాబు పర్యటించటం గమనార్హం.