వంద హాస్టళ్లకు తాళం
సంక్షేమ వసతిగృహాల్లో తగ్గుతున్న విద్యార్థులు
- తగినంతమంది విద్యార్థులు లేక హాస్టళ్ల మూత
- మూతబడుతున్న వాటిలో ఎస్సీ హాస్టళ్లే అత్యధికం
- ఈ ఏడాది 59 ఎస్సీ హాస్టళ్లలో చేరని విద్యార్థులు
- 35 బీసీ వసతి గృహాలదీ ఇదే పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలు తిరోగమన బాటలో పడ్డాయి. విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతుండడంతో క్రమంగా ఈ హాస్టళ్లకు తాళాలు పడుతున్నాయి. 2016–17 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో ఏకంగా వంద వసతి గృహాలు మూతబడడం గమనార్హం. విద్యార్థులు చేరక పోవడంతోనే వీటిలో అధిక శాతం వసతి గృహాలను మూసివేశారు. మరికొన్నిచోట్ల మౌలిక వసతులు కొరవడడం, విద్యార్థుల సంఖ్య అత్యంత తక్కువగా ఉండడంతో వాటిని సమీప వసతిగృహాల్లో విలీనం చేశారు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 1,360 హాస్టళ్లున్నాయి.
వీటిలో 1,28,149 మంది విద్యార్థులున్నారు. వాస్త వానికి ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో 1,460 హాస్టళ్లలో విద్యార్థుల నమోదుకు అధికారులు ఉపక్రమించగా క్షేత్రస్థాయిలో స్పందన సంతృప్తికరంగా రాలేదు. దీంతో విద్యార్థుల సంఖ్య 20 లోపు ఉన్న వంద హాస్టళ్లను సమీప వసతి గృహాల్లో విలీనం చేశారు. ఒక హాస్టల్‌లో కనిష్టంగా వంద మంది విద్యార్థులుండాలి. కానీ ఎస్సీ సంక్షేమ శాఖ హాస్టళ్ల లో ఈ సంఖ్య 75గా ఉంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే ప్రభుత్వానికి వాటి నిర్వహణ భారం తడిసి మోపెడవుతుంది.
వంద మంది విద్యార్థులున్నా ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని నిర్వహించడం కష్టమని వసతిగృహ సంక్షేమాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో విద్యార్థుల సంఖ్య సగటన 91గా ఉంది. అయితే ఎస్టీ సంక్షేమశాఖ పరిధిలో సగటున విద్యా ర్థుల సంఖ్య 181గా ఉంది. ఎస్టీ సంక్షేమంలోని హాస్టళ్లు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండడంతో విద్యార్థుల సంఖ్య సంతృప్తికరంగా ఉంది. కాగా, ఈ ఏడాది మూతబడ్డ హాస్టళ్లల్లో 59 ఎస్సీ, 35 బీసీ, 6 ఎస్టీ హాస్టళ్లున్నట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి.
ఇన్‌చార్జీల పాలనతో...
మెజార్టీ హాస్టళ్లు ఇన్‌చార్జి సంక్షేమాధికారుల పాలనలోనే ఉన్నాయి. ఈ హాస్టళ్లకు పూర్తిస్థాయి సంక్షేమాధికారులు లేకపోవడంతో వాటి పర్యవేక్షణ గందరగోళంగా మారింది. వాస్తవానికి పూర్తి స్థాయిలో వసతిగృహ సంక్షేమాధికారి ఉంటే విద్యాసంవత్సరం ప్రారంభంలో గ్రామస్థాయిలో పర్యటించి విద్యార్థుల నమోదు సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకునే అవకాశముంటుంది. కానీ ఒక్కో వసతిగృహ సంక్షేమాధికారికి రెండు, అంతకంటే ఎక్కువ వసతిగృహాల నిర్వహణ బాధ్యతలుండ డంతో వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. కొన్నిచోట్ల ఉపాధ్యాయులు డెప్యూటేషన్ పద్ధతిలో సంక్షేమాధికారులుగా పనిచేస్తున్నారు.
ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలో ఓ వసతిగృహ సంక్షేమాధికారి (హెచ్‌డబ్ల్యూఓ) రెండు పోస్టుమెట్రిక్ హాస్టళ్లు, రెండు ప్రీమెట్రిక్ హాస్టళ్లను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సదరు హెచ్‌డబ్ల్యూఓ ఒకేరోజు నాలుగు హాస్టళ్లకు హాజరు కావడం కష్టమే. దాంతో పర్యవేక్షణ లేక అక్కడ అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి.