– వసతి గృహాలను మూసి వేస్తే మూల్యం చెల్లించక తప్పదు
– వైఎస్సార్ విద్యార్థి విభాగ్ జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం
హిందూపురం టౌన్ : సంక్షేమ ధ్యేయమంటూ చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం పేర్కొన్నారు. శనివారం వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను ఎత్తివేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో ర్యాలీ చేపట్టి తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పరుశురాం మాట్లాడుతూ కరువు జిల్లా అయిన అనంతపురంలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం జిల్లా వ్యాప్తంగా 207 సంక్షేమ హాస్టళ్లు ఉండగా అందులో 37 వేల మంది విద్యార్థులు చదుకుంటున్నారన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు ముందు విద్యార్థులకు హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వ విద్యను పటిష్టం చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. హాస్టళ్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం మూసివేయాలని నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ మైనుద్దీన్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు రఘురెడ్డి, లవన్‌కుమార్, భరత్, సాయికుమార్, ప్రకాష్, విద్యార్థులు పాల్గొన్నారు.