
అనగనగా ఓ చందంపేట..!
దేవరకొండ/చందంపేట
చందంపేట... ఛిద్రమైన మండలం. మూఢనమ్మకాలు, శిశు విక్రయాలు, బ్రూణ హత్యలు, నిరక్షరాస్యత వేళ్లూనుకుపోయిన ప్రాంతం. అధికారగణం, ప్రజాప్రతినిధులు ఈ తీరును కళ్ళప్పగిస్తూ చూస్తూ కాలం గడుపుతున్నారే తప్ప కారణాలు అన్వేషించడం లేదు. తమకెందుకులే అనుకుంటున్నారు తప్ప తాము సైతం అనుకోవడం లేదు. నీటి కోసం అల్లాడే గ్రామాలు, కరెంటు లేక దీపాల వెలుగులో ఉన్న తండాలు, రోడ్లు లేక ఇంకా అడవి బాటన ప్రయాణించాల్సిన ఆవాసాలు, బడి కోసం మైళ్ల దూరం నడిచే విద్యార్థులు, సంక్షేమ హాస్టళ్లలో అడ్మిషన్ దొరక్క చదువు మానేసిన పిల్లలు, వ్యవసాయం కలిసిరాక వలసవెళ్లే కుటుంబాలు, రోగమొస్తే ప్రాణాలమీదికి తెచ్చుకునే గిరిజనులు అడుగడునా కనిపిస్తారు. ఇదంతా అధికారులకు తెలియనిదా ? ఇది ప్రభుత్వం దృష్టికి పోవడం లేదా ? అన్న ప్రశ్న జిల్లా ప్రజలను తొలచివేస్తుంది. రాజకీయ శిక్షణ తరగతుల పేరుతో నాగార్జునసాగర్‌కు వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రులు సమీపంలోని చందంపేట దిక్కు ఓ సారి చూడమని, వారి సమస్యలు ఆలకించమని విజ్ఞప్తి చేస్తున్నారు.
40శాతం మంది వలస జీవులే..
బతుకుదెరువు లేక, వ్యవసాయం కలిసిరాక, పిల్లల్ని సాకలేక వలస వెళ్తున్న వారు 40శాతం పైనే ఉన్నారు. సుమారు 57వేల జనాభా ఉన్న మండలంలో ఇప్పటికీ సుమారు 20వేల మంది గుంటూరు, హైదరాబాద్, ముంబై వంటి ప్రాం తాల్లో ఉంటున్న వారే. పండుగకో, పబ్బానికో, ఓట్ల సమయంలో మాత్రమే వీరికి సొంత ఊళ్ళు గుర్తుకొస్తాయి.
అధికారులకు హడల్
చందంపేట మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు ఉన్నాయి. కానీ మండల స్థాయి నుంచి మొదలుకుని గ్రామస్థాయి అధికారి వరకు చందంపేట మండల కేంద్రంలో గానీ, స్థానికంగా కానీ నివాసం ఉన్న దాఖలాలు లేవంటే అతిశయోక్తి కాదు. మారుమూల ప్రాంతం కావడంతో ఇక్కడ పని చేయాలంటేనే అధికారులు ఆపసోపాలు పడిపోతారు. వసతులుండవనే సాకుతో పట్టణాల్లో నివాసం ఉంటున్నారు. దీంతో గ్రామ, మండల స్థాయిలో అధికారులకు క్షేత్ర స్థాయి అవగాహనలేమి ఏర్పడుతుంది. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు సుమారు వంద కిలోమీటర్లకు పైగ ప్రయాణించి మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు.
1196 మంది పిల్లలు బడిబయటే..
ప్రభుత్వం నిర్భంద ప్రాథమిక విద్యను తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని అక్షరాస్యులుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నా చందంపేట మండలంలో 1196 మంది బడి బయట పిల్లలు (6-14 సంవత్సరాలు) ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిపించిన కుటుంబ సర్వేలో తేలిన సంఖ్య. ఇదిలా ఉంటే మన విద్యాధికారులు మాత్రం బడి బయట విద్యార్థులు కేవలం 83 మందినే చూపిస్తున్నారు. ఐకేపీ, సీఆర్పీలు చేసిన సర్వేలో 83 మంది బడి బయట విద్యార్థులున్నట్లు చెప్తున్న ఈ సంఖ్య అధికారులు చేస్తున్న అంకెల గారడికి సాక్ష్యం. ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే.. మొత్తం మండల జనాభా 51,408 మంది కాగా 37,548 మంది ఓటర్లు. ఆరేళ్ల లోపు పిల్లలు 7,136 మంది. ఇంకా మిగిలిన 6,724 మంది విద్యార్థులలో 1,196 మంది బడిబయటే ఉన్నారు. ఈ లెక్కన మొత్తం 19 గ్రామ పంచాయతీల్లో సరాసరిన గ్రామానికి 62 మంది పిల్లలు బడి బయటే ఉంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
వీడని మూఢనమ్మకాలు
గ్రామాలు, తండాల్లో ఇంకా మూఢవిశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. ఆడపిల్లంటే అరిష్టమని, క్షుద్ర పూజల ద్వారా అనుకున్నది సాధించవచ్చని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అనారోగ్యం పాలైనవారు మంత్రాలు, తంత్రాలంటూ అడవుల వెంట తిరుగుతున్నారు. తాజాగా శనివారం రాత్రి నేరడుగొమ్ము గ్రామపంచాయతీ పరిధిలో నడిరోడ్డుపై జంతు బలి చేసి క్షుద్ర పూజలు నిర్వహించినఘటన ఇందుకు సజీవ సాక్ష్యం.