సం‘క్షామం’ | Lot of problems in welfare hostels | Sakshi
Sakshi News home page

సం‘క్షామం’

Published Fri, Dec 20 2013 4:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM

Lot of problems in welfare hostels

 కొత్తగూడెం, న్యూస్‌లైన్: నిరుపేద విద్యార్థుల కోసం నెలకొల్పిన సాంఘిక సంక్షేమ వసతిగృహాలు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. పురుగుల అన్నం, నీళ్లచారు, అందీ అందని గుడ్లు, స్నాక్స్...తదితర విపత్కర పరిస్థితుల్లో నుంచి జిల్లాలోని హాస్టల్స్ ఇప్పటికీ బయటపడలేకపోతున్నాయి. జిల్లాలో మొత్తం 171 హాస్టల్స్ ఉన్నాయి. వీటిలో 79 ఎస్సీ, 45 ఎస్టీ, 47 బీసీ వసతి గృహాలు. వీటిలో మొత్తం 19,410 మంది విద్యార్థులు ఉంటున్నారు. ప్రభుత్వం 3 నుంచి 7 తరగతుల విద్యార్థులకు రూ.7.50, 8 నుంచి 10 తరగతి విద్యార్థులకు రూ.8.50 చొప్పున ప్రతి రోజు మెస్‌చార్జి కింద చెల్లిస్తోంది.
 
 ఈ కొద్దిపాటి చార్జీలతో నాణ్యమైన  ఆహారం అందే పరిస్థితి లేదు. మెనూ ప్రకారం ఉదయం కిచిడీ, ఉప్మా, పులిహోర, ఆదివారం ఇడ్లీ పెట్టాలి. ఎక్కువ హాస్టల్స్‌లో కేవలం కిచిడీ, పులిహోరనే అందిస్తున్నారు. మధ్యాహ్నం నీళ్ల చారు, ముద్ద అన్నంతోనే కడుపునింపుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వారంలో ఆరు రోజులు గుడ్డు ఇవ్వాల్సి ఉండగా, మెస్‌చార్జీలు సరిపడక కేవలం రెండు నుంచి మూడు రోజుల పాటు మాత్రమే గుడ్లు ఇస్తున్నారు. పౌష్టికాహారంలో భాగంగా సాయంత్రం స్నాక్స్ ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించింది. నిధుల లేమి కారణంగా ఎక్కడా ఇది అమలు కావట్లేదు.  పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచకపోవడం వల్ల మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించలేకపోతున్నామని హాస్టల్ వెల్ఫేర్ అధికారులు అంటున్నారు. ఇకపోతే ఇప్పటికీ పాత భవనాల్లో...వసతుల లేమి మధ్యే పలు హాస్టల్స్‌ను నిర్వహిస్తున్నారు.  
 
 ఖమ్మంలో ఆరు ఎస్సీ హాస్టల్స్ ఉండగా వాటిలో మూడు బాలికల హాస్టల్స్. వీటిలో 300 మంది బాలికలు, 380 మంది బాలురు ఉంటున్నారు. ఎస్టీ బాలుర హాస్టల్‌లో 147 మంది విద్యార్థులున్నారు, బాలికల హాస్టల్స్ రెండు ఉన్నాయి. ఇందులో 812 మంది విద్యార్థులున్నారు. వీరికి ప్రభుత్వం మెనూ జారీ చేసినప్పటికీ ఆ మెనూను సంక్షేమాధికారులు సరిగ్గా పాటించడం లేదు. విద్యార్థులకు ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు వడ్డిస్తున్నారు. సాయంత్రం ఇచ్చే అల్పాహారం సరిగ్గా ఇవ్వడం లేదు. రాత్రి భోజనం సరిగా లేకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో పడుకుంటున్నారు. ప్రతిరోజూ విద్యార్థులకు గుడ్డు తప్పనిసరిగా పెట్టాల్సి ఉండగా తోచినపుడే వడ్డిస్తున్నారు.
 
 కొత్తగూడెం నియోజకవర్గంలో మొత్తం 12 సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి. ప్రస్తుతం విద్యార్థులకు అందిస్తున్న మెస్‌చార్జీలు సరిపోకపోవడంతో మెనూ ఎక్కడా అమలు కావడం లేదు. వారానికి ఆరు రోజులు గుడ్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రెండు, మూడు రోజులు మాత్రమే ఇస్తున్నారు. సాయంత్రం విద్యార్థులకు స్నాక్స్ కూడా ఇవ్వడం లేదు. బొబ్బర్లు, ఉలవలు, గుగ్గిళ్లు అందించలేని పరిస్థితులు ఉన్నాయని హాస్టల్ వెల్ఫేర్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం నాణ్యత లేకపోవడం అన్నం మొత్తం ముద్దగా తయారై తినలేని పరిస్థితి నెలకొందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 వైరా నియోజకవర్గంలో ఆరు ఎస్సీ హాస్టళ్లు, నాలుగు కస్తూర్బాగాంధీ బాలికల వసతి గృహాలు ఉన్నాయి.  వైరాలోని బీసీ బాలుర వసతి గృహాన్ని అద్దెభవనంలో నిర్వహిస్తున్నారు. ఈ హాస్టళ్లలో ఎక్కడా మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. ప్రతి రోజు ఉదయం కిచిడీ, ఉప్మా మాత్రమే పెడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. కూరగాయల రేట్లు పెరగడంతో ప్రతి రోజూ సాంబారుతోనే సరిపెడుతున్నారు. జూలూరుపాడు ఎస్సీ హాస్టల్‌కు వార్డెన్ లేడు. కొత్తగూడెంకు చెందిన ఇన్‌చార్జి అప్పుడప్పుడు వచ్చి పోతుండటంతో కుక్ , వాచ్‌మన్‌లే దిక్కు. వారానికి ఆరుసార్లు ఇవ్వాల్సిన కోడిగుడ్డు రెండు రోజులు మాత్రమే పెడుతున్నారు. కారేపల్లి బీసీ హాస్టల్‌లో నీళ్లచారుతో తినలేక విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. అరటి పండు, సాయంత్రం ఇవ్వాల్సిన స్నాక్స్ ఇవ్వడం లేదు.
 
 అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉదయం టిఫిన్‌ను మధ్యాహ్న భోజనంగా క్యారేజీలో పంపుతున్నారు. నియోజకవర్గంలో హాస్టల్‌లు, గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు మొత్తం 37 ఉండగా చాలా చోట్ల మెనూ సక్రమంగా అమలు కావడంలేదు. వారానికి ఒకసారి కూడా స్వీట్ ఇవ్వడంలే దు. అరటిపండు ఊసే చాలాచోట్ల లేదు.
 
 సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి బాలికల ఇంటిగ్రేటెడ్ హాస్టల్, ఎస్సీ బాలుర , ఎస్సీ ఎస్‌ఎంహెచ్ హాస్టల్, తల్లాడ బీసీ హాస్టళ్లకు ప్రహారీగోడలు లేవు.  పశువులు, పందులు ఎంచక్కా తిరుగుతున్నాయి. సత్తుపల్లి ఎస్సీ బాలుర, ఎస్‌ఎంహెచ్ హాస్టళ్లకు నీటి సౌకర్యం లేకపోవటంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఎస్‌ఎంహెచ్ హాస్టల్‌లో కిటికీ తలుపులు లేవు. ఫ్యాన్లు లేకపోవటంతో విద్యార్థులు దోమలతో ఇబ్బంది పడుతున్నారు. పెనుబల్లి ఎస్సీ బాలుర హాస్టల్ శిథిలావస్థకు చేరటంతో విద్యార్థులు పాఠశాల గదుల్లోనే నిద్రించాల్సి వస్తోంది. కల్లూరు బీసీ హాస్టల్‌కు సొంత భవనం లేకపోవటంతో అద్దె భవనంలోనే నిర్వహిస్తున్నారు. తల్లాడ బాలికల హాస్టల్ సైతం శిధిలావస్థకు చేరింది.
 
 ఈ హాస్టల్‌లో సరిపడా మరుగుదొడ్లు లేకపోవటంతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. సత్తుపల్లి ఎస్టీ బాలుర హాస్టల్‌లో బాత్‌రూమ్‌లు లేకపోవటంతో విద్యార్థులు ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. ఎస్సీ, బీసీ బాలికల ఎస్‌ఎంహెచ్ హాస్టళ్లలో కిటికీలకు తలుపులు లేకపోవటంతో విద్యార్థినులు చలికి వణికిపోతున్నారు. ఇక్కడ 200 మంది విద్యార్థినులకు రెండు బాత్‌రూమ్‌లు మాత్రమే ఉండటం గమనార్హం.
 
 పినపాక నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హస్టల్స్‌లో కనీస సౌకర్యాలు కూడా లేవు. బూర్గంపాడు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతిగృహం భవనానికి మరమ్మతులు చేపట్టడం లేదు. కిటికీలు, తలుపులు సక్రమంగా లేక చలితో విద్యార్థులు వణికిపోతున్నారు. మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కూడా సక్రమంగాలేవు. అశ్వాపురం మండలంలోని బీసీ సంక్షేమ హాస్టల్‌ను అద్దెభవనంలో అరకొర వసతులు మధ్య నిర్వహిస్తున్నారు. మణుగూరులోని ఎస్టీ బాలుర వసతి గృహంలో విద్యార్ధులకు కనీస సౌకర్యాలు లేవు. తలుపులు, కిటీకీలు దెబ్బతినడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మెనూ సక్రమంగా పాటించడంలేదు. పినపాక మండలం చిర్రుమల్ల ఆశ్రమ పాఠశాల, గుండాల మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. గుండాల హాస్టల్ వార్డెన్ అందుబాటులో ఉండటం లేదని తెలిసింది.
 
 పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి ఎస్సీ, బీసీ బాలురకు ఇంటిగ్రేటెడ్ వసతిగృహాన్ని నూతనంగా నిర్మించినా అందులో సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. ఈ భవనం గదుల్లో కొన్నింటి కిటికీలకు తలుపులు లేక విద్యార్థులు దోమలు, చలికి వణికిపోతున్నారు. వసతిగృహం చుట్టూ చెత్తాచెదారం ఉండటం, ప్రహరీగోడ నిర్మాణం పూర్తికాలేదు. మరుగుదొడ్లు, మూత్రశాలలు దుర్వాసన వస్తున్నాయి. విద్యార్థులకు అందించే స్నాక్స్ మెనూలో ఉన్న విధంగా ఇవ్వటంలేదు. బియ్యం నాణ్యంగా లేకపోవటం,  అన్నం కూడా సరిగాలేక విద్యార్థులు కడుపునిండా తినలేని పరిస్థితి. రసం, ఉడికీ ఉడకని కూరలతో సరిపెట్టుకుంటున్నారు.
 
 మధిరలోని బీసీ బాలుర వసతిగృహంలో  మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాస్టల్ ప్రాంగణంలో చెత్త పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉంది. మరుగుదొడ్లలోని బేసిన్లు నిండి దుర్వాసన వస్తోంది. బాత్‌రూమ్ డోర్ విరిగిపోయింది. భవనం కిటికీలకు జాలీలు లేకపోవడంతో దోమలు  స్వైరవిహారం చేస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. ముదిగొండలోని బీసీ బాలుర వసతిగృహం అద్దెభవనంలో అవస్థల మధ్య నడుస్తోంది. 40మంది విద్యార్థులు ఒకటే బాత్‌రూమ్‌ను వాడాల్సి వస్తోంది. బోనకల్ మండలం జానకీపురం, బోనకల్ గ్రామాల్లోని హాస్టళ్ల విద్యార్థులకు దుప్పట్లు సరిపడాలేక చలికి వణుకుతున్నారు. జానకీపురం హాస్టల్‌లో నీటి సరఫరా సక్రమంగాలేదు. భవనం కూడా శిథిలావస్థకు చేరింది.
 
 ఇల్లెందు పట్టణంలో ఎస్టీబాలికల హస్టళ్లు 2, ఎస్టీ బాలుర  ఒకటి, ఎస్సీ బాలుర ఒకటి, బాలికల హాస్టళ్లు రెండు ఉన్నాయి. స్థానిక ఎస్టీ (బీ) హాస్టల్‌లో 194 మంది విద్యార్థులుం డగా నీటి సమస్య ఉంది. మంచి నీటి ట్యాంక్‌ఉన్నప్పటికీ బోర్‌కు మోటార్ ఏర్పాటుచేయకపోవడంతో నీళ్లు ఎక్కడం లేదు. ట్యాంక్ కూడా నిరుపయోగంగా మారింది. బీసీ హాస్టల్‌లో 95 మంది విద్యార్థుండగా..మరుగుదొడ్లు అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి.  ఎస్సీ(బీ) బాలికల హాస్టల్‌లో 60 మంది ఉండగా..సరిపడా మరుగుదొడ్లు లేవు. ఎస్టీ బాలుర హాస్టల్‌లో 92 మం ది 50 ఏళ్ల క్రితం నిర్మించిన పాత భవనం, రేకుల వరండాల్లోనే ఉంటున్నారు. వర్షాకాలంలో భవనం కురుస్తోంది. అలాగే బయ్యారం, గార్ల, టేకులపల్లి మండలాల్లో కూడా సమస్యలు తిష్టవేశాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement