సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం మరిన్ని గురుకులాలు అందుబాటులోకి రాబోతున్నాయి. గత విద్యా సంవత్సరం 119 బీసీ గురుకుల పాఠశాలలను తెరిచిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది కూడా నియోజకవర్గానికో గురుకుల పాఠశాలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. జూన్ 1 నుంచి 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆ రోజు నాటికి ఈ గురుకులాలను ప్రారంభించేందుకు మహాత్మా జ్యోతిభా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) కసరత్తు చేస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తంగా 142 బీసీ గురుకుల పాఠశాలలున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయబోయే 119 గురుకులాలతో కలిపితే వాటి మొత్తం సంఖ్య 261కి చేరనుంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యా సంస్థలతో పోలిస్తే బీసీ గురుకులాలే తక్కువగా ఉన్నాయి. వీటి సంఖ్య పెంచాలని, కనీసం నియోజకవర్గానికి రెండు గురు కులాలైనా ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. గతేడాది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన బీసీ మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలోనూ సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించారు.
ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించడంతో వాటి ఏర్పాటుకు మార్గం సుగమమైంది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు ఎంజేపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ ప్రతిపాదనలు తయారు చేసింది. ప్రతి నియోజకవర్గంలో బాలికలతోపాటు బాలుర గురుకులం ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసి.. ఆమోదం కోసం ప్రభుత్వానికి ఫైలు పంపింది. సీఎం సంతకం కాగానే గురుకులాల ఏర్పాటు వేగవంతం కానుంది. ఇందుకు సంబంధించి వారంలోపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.
ఐదో తరగతితోనే ప్రారంభం
గతేడాది ప్రారంభించిన గురుకుల పాఠశాలలో 5, 6, 7 తరగతులకు అడ్మిషన్లు తీసుకున్నారు. తాజాగా ప్రారంభించనున్న గురుకులాల్లో ఐదో తరగతి నుంచి ప్రవేశాలు జరిపేలా అధికారులు ప్రణాళిక తయారుచేశారు. ప్రస్తుతం ఐదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే సెట్‌కు దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. ప్రవేశ పరీక్ష తర్వాత ఫలితాలు విడుదల చేయనున్నారు. ఆ తర్వాత కొత్త గురుకులాల్లో అడ్మిషన్లు చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment