వచ్చే నెలాఖరు కల్లా గురుకుల ప్రవేశ పరీక్షలు పూర్తి  | Gurukul entrance exams will be completed by the end of next month | Sakshi
Sakshi News home page

వచ్చే నెలాఖరు కల్లా గురుకుల ప్రవేశ పరీక్షలు పూర్తి 

Published Thu, Mar 21 2024 2:08 AM | Last Updated on Thu, Mar 21 2024 2:08 AM

Gurukul entrance exams will be completed by the end of next month - Sakshi

కార్యాచరణ రూపొందించినగురుకుల సొసైటీలు 

ఐదో తరగతిలో ప్రవేశాలకు ఉమ్మడిగా నిర్వహించే పరీక్ష ఇప్పటికే పూర్తి 

వచ్చే నెలలో ఇంటర్మీడియెట్,డిగ్రీ, పీజీలకు ప్రవేశ పరీక్షలు 

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ముందుగా పరీక్షలు

సాక్షి, హైదరాబాద్‌:  గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత పరీక్షలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని గురుకుల విద్యా సంస్థల సొసైటీలు నిర్దేశించుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్‌ నెలాఖరు నాటికే అన్నిరకాల ప్రవేశపరీక్షలను నిర్వహించాలని నిర్ణయించాయి.

ఇందులో భాగంగా గురుకుల సొసైటీలు ఉమ్మడిగా నిర్వహించే ఐదో తరగతి ప్రవేశ పరీక్షను ఇప్పటికే పూర్తి చేశాయి. విడివిడిగా నిర్వహించే బ్యాక్‌లాగ్‌ ఖాళీలు, జూనియర్‌ కాలేజీల్లో ఫస్టియర్‌ అడ్మిషన్లు, డిగ్రీ, పీజీ కోర్సుల్లోనూ సంవత్సరం ప్రవేశాలకు అర్హత పరీక్షలను తేదీలను ప్రకటించి.. వేగంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. 

మే నెలాఖరు నాటికి ఫలితాలు 
గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యాశాఖల ఆధ్వర్యంలోని గురుకుల సొసైటీలు ఉమ్మడిగా ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నాయి. దాదాపు 50వేల సీట్ల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష ఈసారి 1.5లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అధికారులు వారి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కూడా మొదలుపెట్టారు. ఇక సొసైటీల వారీగా గురుకుల పాఠశాలల్లోని 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ ఖాళీలను కూడా భర్తీ చేయడానికి వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చి దరఖాస్తులు స్వీకరించారు.

ఇటీవల బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలు వీటికి పరీక్షలను నిర్వహించగా.. మైనార్టీ, జనరల్‌ గురుకుల సొసైటీలు వారంలోగా పరీక్షలు నిర్వహించనున్నాయి. ఇక గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఫస్టియర్‌ అడ్మిషన్ల అర్హత పరీక్షలు కూడా దాదాపు పూర్తికావొచ్చాయి. డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్‌ ప్రవేశాల పరీక్షను ఏప్రిల్‌ 28వ తేదీ నాటికి అన్ని సొసైటీలు పూర్తి చేయనున్నాయి.

పీజీ కాలేజీల్లో ప్రవేశ పరీక్షలను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. వాటి ఫలితాలను మే నెలాఖరు నాటికి ప్రకటించాలని, జూన్‌ తొలివారం నుంచి 2024–25 విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చాయి. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ మే 13న జరగనుంది. ఆ తర్వాత క్రమంగా ఫలితాలను ప్రకటించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement