గురుకులాల్లో సరికొత్త మెనూ
Published Wed, Jun 14 2017 2:44 AM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM
నెలలో నాలుగు రోజులు చికెన్, రెండు రోజులు మటన్
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యార్థులకు శుభవార్త. గురుకుల పాఠశాలల్లో అందిస్తున్న భోజన మెనూ పూర్తిగా మారింది. ఇంట్లో మాదిరిగా చక్కని అల్పాహారం, పౌష్టికాలతో మధ్యాహ్న భోజనం, సాయంత్రం చిరుతిళ్లు, రాత్రి పసందైన భోజనం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల మెస్ చార్జీలను ఇటీవలే ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా మార్పులు చేపట్టిన గురుకుల సొసైటీలు.. తాజాగా సరికొత్త మెనూ అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త మెనూ అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
పులిహోరకు చెక్..
కొన్నేళ్లుగా గురుకులాల్లో అల్పాహారం కింద ఉదయం లెమన్ రైస్ లేదా పులిహోర, కిచిడీ అందిస్తున్నారు. తాజా మెనూలో అల్పాహారం కింద పూరి, ఇడ్లీ, చపాతి, దోశ, మైసూర్‌బోండాలను చేర్చారు. మధ్యాహ్న, రాత్రి భోజనంలో పప్పు, సాంబార్, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ ఇస్తుండగా.. తాజా మెనూ ప్రకారం నెలలో 6 రోజులు మాంసాహారాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో 4 రోజులు చికెన్, రెండ్రోజులు మటన్ ఇవ్వనున్నారు. మిగతా రోజుల్లో పప్పు, కూరగాయలతో నాణ్యమైన భోజనం అందించనున్నారు. భోజన సమయంలో విద్యార్థులకు ప్రత్యేకంగా నెయ్యి, చట్నీ అందించాలని నిర్ణయించారు. సాయంత్రం చిరుతిళ్లలో బిస్కెట్లకు బదులు కుకీస్, పకోడా తదితర పదార్థాలివ్వాలని భావిస్తున్నారు. మెనూ తయారీలో జాతీయ పౌష్టికాహార సంస్థ నిపుణులను సైతం సంప్రదించి పక్కా ప్రణాళిక రూపొందించినట్లు సొసైటీ కార్యదర్శులు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్, మల్లయ్య భట్టు తెలిపారు.
పక్కాగా పర్యవేక్షణ...
మెనూ అమలులో గురుకుల సొసైటీలు నిఘా కట్టుదిట్టం చేశాయి. మెనూ అమలుతీరు పర్య వేక్షణకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించారు. అలాగే గురుకులాల్లో ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించాలని నిర్ణయించారు. పర్యవేక్షణ సాఫ్ట్‌వేర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ఆ శాఖ వర్గాలు ఈ సందర్భంగా పేర్కొన్నాయి.
Advertisement