సాక్షి, అమరావతి: ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు సంయుక్తంగా విజయవాడలోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.
సంస్థ పరిధిలోని 38 సాధారణ పాఠశాలల్లో 5వ తరగతి సీట్లు, 12 మైనారిటీ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ కేటగిరీ సీట్లు, 6 నుంచి 8 తరగతుల్లో మిగిలిన సీట్లతో పాటు, ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించారు. స్కూల్ స్థాయిలో 3,770 సీట్లకు 32,666 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 25,216 మంది పరీక్షకు హాజరయ్యారు.
» పాఠశాల స్థాయిలో ఐదో తరగతిలో ఎం.కీర్తి (విశాఖపట్నం జిల్లా), 6వ తరగతి పి.సోమేశ్వరరావు (విజయనగరం జిల్లా), 7వ తరగతి కె.ఖగేంద్ర (శ్రీకాకుళం జిల్లా), ఎనిమిదో తరగతిలో వై.మేఘ శ్యామ్ (విజయనగరం జిల్లా) రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించారు.
» రాష్ట్రంలోని ఏడు జూనియర్ కాలేజీల్లో ఉన్న 1,149 సీట్లకు 56,949 మంది దరఖాస్తు చేసుకోగా 49,308 మంది పరీక్షకు హాజరయ్యారు. ఎంపీసీ విభాగంలో జి.యశ్వంత్ సాయి, ఎంఈసీ/సీఈసీ విభాగంలో ఎల్.సత్యరామ్ మోహన్ (తూర్పు గోదావరి), బైపీసీ విభాగంలో ఎం.మహిత (కర్నూలు జిల్లా) అత్యధిక మార్కులు సాధించారు. వీరితో పాటు నాగార్జునసాగర్‌లోని డిగ్రీ కాలేజీలో 152 సీట్లకు ఎంపికైన విద్యార్థుల వివరాలను https://aprs.apcfss.in/ లో అందుబాటులో ఉంచినట్టు సంస్థ కార్యదర్శి నరసింహారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment