సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఐదో తరగతి ప్రవేశాలకు సంబంధించి అర్హత పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ సోమవారంతో ముగిసింది. సాయంత్రం వరకు సాగిన దరఖాస్తు ప్రక్రియలో భాగంగా 1.25 లక్షల మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు.
డూప్లికేషన్, పూర్తి వివరాలు లేని దరఖాస్తులను పరిశీలించిన తర్వాత మరింత స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఆర్‌ఈఐఎస్)ల్లో ఐదోతరగతికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది.
నాలుగు సొసైటీల పరిధిలో దాదాపు ఏడువందల గురుకుల పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో ఐదో తరగతిలో 48,500 సీట్లున్నాయి. ఒక్కో సీటుకు సగటున రెండున్నర రెట్లు పోటీ ఉంది.
ఫిబ్రవరి 11న అర్హత పరీక్ష
ఐదోతరగతి ప్రవేశాలకు ఉమ్మడి పరీక్ష ఫిబ్రవరి 11న నిర్వహించనున్నట్లు సెట్ కన్వినర్ ప్రకటించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు వెబ్‌సైట్‌లో విద్యార్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సొ సైటీల వారీగా రిజర్వేషన్లు వేరువేరుగా ప్రాధాన్యతల క్రమంలో ఉంటాయి.
అర్హ త పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన వారికే ప్రవేశానికి అవకాశం కలుగు తుంది. ఏప్రిల్ నెలాఖరులో లేదా మే నెల మొదటి వారంలో పరీక్ష ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభిస్తారు. మూడు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. తొలి విడతలో దాదాపు 75 శాతం మంది ప్రవేశాలు పొందుతారని, ఆ తర్వాత రెండో విడత, చివరగా మూడో విడతతో వందశాతం సీట్లు భర్తీ చేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment