గురుకుల సొసైటీల ఇష్టారాజ్యం! | Gurukula educational institutions have raised the issue of Intermediate Board norms | Sakshi
Sakshi News home page

గురుకుల సొసైటీల ఇష్టారాజ్యం!

Published Fri, Apr 12 2024 4:52 AM | Last Updated on Fri, Apr 12 2024 4:52 AM

Gurukula educational institutions have raised the issue of Intermediate Board norms - Sakshi

ఇంటర్‌ బోర్డు నిబంధనల అతిక్రమణ

వేసవి సెలవుల్లోనూ జూనియర్‌ కాలేజీల నిర్వహణ

ఫస్టియర్‌ విద్యార్థులకు సెకండియర్‌ పాఠ్యాంశాల బోధన

సెకండియర్‌ విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎంసెట్‌ కోచింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యా సంస్థల సొసైటీలు ఇంటర్మీడియట్‌ బోర్డు నిబంధనలను గాలికొదిలేశాయి. వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత కాలేజీలకు సెలవులు ప్రకటించాలని ఆదేశిస్తూ తెలంగాణ రాష్ట్ర ఇంటీర్మీడియట్‌ బోర్డు గత నెల 30న ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31 నుంచి మే నెల 31వరకు రెండు నెలల పాటు వేసవి సెలవులు ఇవ్వాలని, జూన్‌ 1వ తేదీ నుంచి కళాశాలలు పునఃప్రారంభించాలని స్పష్టం చేసింది.

కానీ ఈ నిబంధనలను పట్టించుకోని గురుకుల సొసైటీలు... పరీక్షలు ముగిసిన మరుసటి రోజు నుంచే తరగతులు ప్రారంభించాయి. ఇంటర్మీడియ్‌ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు రెండో సంవత్సరం పాఠ్యాంశాన్ని ప్రారంభించగా... ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎంసెట్‌ తదితర పోటీ పరీక్షలకు సంబంధించిన తరగతులు నిర్వహిస్తున్నారు.

ఏయే సొసైటీలంటే.. 
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఎస్‌), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్‌ఈఎస్‌), మహాత్మా జ్యోతి బా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీ­సీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) ప్రస్తుతం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలేన్సీ(సీఓఈ) జూనియర్‌ కాలేజీలను పూర్తిస్థా­యి­లో నిర్వహిస్తుండగా... తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్‌ఈఐ­ఎస్‌) మాత్రం రంజాన్‌ నేపథ్యంలో వచ్చే వారం నుంచి తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది.

సీఓఈలకు ప్రత్యేకమంటూ...
రాష్ట్రంలోని గురుకుల సొసైటీల పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఇంటర్మీడియట్‌ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఒక ప్రాంగణంలో ఐదో తరగతి నుంచి పదోతరగతి వరకు  పాఠశాలలు నిర్వహి­స్తుండగా.. జూనియర్‌ కాలేజీని ప్రత్యేక ప్రిన్సిపల్‌­తో నిర్వహిస్తున్నారు. గురుకుల సొసైటీలకు పాఠశాలలతో పాటు ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం సీఓఈల పేరిట ప్రత్యేక పాఠశాలలున్నాయి.

ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 38, ఎస్టీ గురు­కుల సొసైటీ పరిధిలో 30, బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని 12 సీఓఈల్లో ఇంటర్మీడియట్‌ తరగతు­లను పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆయా సొసైటీ కార్యదర్శులు వేరువేరుగా ఉత్తర్వు­లు సైతం జారీ చేశారు.

సీఓఈల్లోని ఇంటర్మీ­డియట్‌ విద్యార్థులకు ఫస్టియర్‌ కేటగిరీకి మే 15వ తేదీ వరకు, సెకండియర్‌ విద్యార్థులకు మే 26వ తేదీ వరకు తరగతులు నిర్వహిస్తారు. ఆ తర్వాత మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఇవ్వను­న్నా రు. ముందస్తుగా పాఠ్యాంశాన్ని ముగించేందుకు ప్ర­త్యే­క తరగతులు నిర్వహించాలని నిర్ణయించినట్లు సొసైటీ కార్యదర్శులు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

అదే బాటలో ప్రైవేటు కాలేజీలు..
గురుకుల విద్యా సంస్థలు ఇంటర్మీడియట్‌ తరగతులను నిర్వహిస్తుండడంతో పలు  ప్రైవేటు కార్పొరేట్‌ విద్యా సంస్థలు సైతం ఇదే బాట పట్టాయి. ఇంటర్మీడియట్‌ బోర్డు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టాను­సారంగా తరగతులను నిర్వహిస్తు­న్నాయి.

వేసవి సీజన్‌లో తీవ్రమైన ఎండలు, ఉక్కపోత ఉండగా కనీస ఏర్పాట్లు చేయకుండా పలు కాలేజీలు తరగతులు నిర్వహిస్తుండడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరగతులకు హాజరు కాకుంటే సిలబస్‌ మిస్సవుతుందనే ఆందోళనతో తప్పనిసరి పరిస్థితుల్లో పంపుతున్నట్లు వాపోతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement