సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లోని వివిధ తరగతుల్లో బ్యాక్‌లాగ్ ఖాళీలు, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షల నిర్వహణ ఈనెల 10తో ముగిసిఇంది. నాలుగు సొసైటీల పరిధిలో అర్హత పరీక్షలన్నీ ముగియడంతో ఫలితాల విడుదలకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. మైనార్టీ గురుకుల సొసైటీ మినహా టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్, టీఎంఆర్‌ఈఐఎస్, టీఎస్‌ఆర్‌ఈఐఎస్‌లు ఐదోతరగతితో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాయి.
వీటితో పాటు 6, 7, 8 తరగతుల్లో బ్యాక్‌లాగ్ ఖాళీలకు సొసైటీలు వేర్వేరుగా అర్హత పరీక్షలు నిర్వహించాయి. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లకు సైతం ఏ సొసైటీకా సొసైటీ అర్హత పరీక్షలు ముగిశాయి. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల పరిధిలోని సైనిక పాఠశాలల్లో ప్రవేశాలు, బీసీ గురుకుల సొసైటీ పరిధిలో అగ్రికల్చర్ డిగ్రీ, ఫ్యాషన్ టెక్నాలజీ డిగ్రీ ప్రవేశాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ(ఈఎంఆర్‌ఎస్)లో ఆరోతరగతి ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేకంగా సెట్ నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలన్నీ వరుసగా విడుదల చేసేందుకు ఆయా సొసైటీలు సన్నద్ధమయ్యాయి.
అర్హత పరీక్షల ఫలితాలను మరో వారం రోజుల్లో విడుదల చేసేందుకు గురుకుల సొసైటీలు సన్నద్ధమవుతున్నాయి. ముందుగా పాఠశాలల్లో ప్రవేశాల ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఐదో తరగతి అడ్మిషన్లకు నిర్వహించిన వీటీజీసెట్–2023 ఫలితాలను వచ్చే వారాంతంలో విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment