నిందితుడు వినోద్ జైన్
సాక్షి ప్రతినిధి, విజయవాడ/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ)/విజయనగరం/నగరి: లైంగిక వేధింపులతో బాలికను చిదిమేసిన టీడీపీ నాయకుడు వినోద్ జైన్ తన నేరాన్ని అంగీకరించాడు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్‌లోని లోటస్ లెజెండ్ అపార్ట్‌మెంట్‌లో టీడీపీ నేత వినోద్ జైన్ లైంగిక వేధింపులు తాళలేక 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు జైన్‌ను ఆదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మృతురాలు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లుగా తాను రెండు నెలలుగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన మాట వాస్తవమేనని చెప్పాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నించానన్నాడు. బాలిక స్కూల్‌కు వెళ్లి వచ్చే సమయాల్లో లిఫ్ట్, మెట్ల వద్ద వేచి ఉండేవాడినని, ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆనందించేవాడినని చెప్పాడు. తాను చేసింది తప్పేనని, ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదని.. వ్యవహారం ఇంతవరకు వస్తుందని కూడా తాను ఊహించలేదని చెప్పినట్లు తెలిసింది.
ప్రేమానుబంధాలకు బాలిక ప్రాధాన్యత
మరోవైపు.. ఆత్మహత్యకు ముందు బాలిక రాసిన లేఖ అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. అందులో ఎక్కువగా ప్రేమానుబంధాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. రక్తసంబంధాలపై ఎంతో మమకారం పెంచుకున్నట్లు అందులోని ప్రతీ పదం ద్వారా అర్ధమవుతుంది. చిన్న వయసులోనే ప్రేమానుబంధాలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. రక్తసంబంధాలపై ఎంతో మమకారాన్ని పెంచుకుంది. కామాంధుడి దురాగతాలను తట్టుకోలేక ఈ లోకం నుంచి అర్థాంతరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఆ బాలిక.. అమ్మ, నాన్న, తమ్ముడి గురించే ఎక్కువగా తన లేఖలో పరితపించింది. ఆ ఐదు పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్‌లో బంధాలు, బాంధవ్యాల గురించే ఎక్కువగా ప్రస్తావించింది. ‘ఐ లవ్ యు మమ్మీ.. డాడీ.. మీరంతా బాగుండాలి’ అని ఆకాంక్షించింది.
తల్లిదండ్రుల పట్ల ఆమెకున్న ఎనలేని ప్రేమాభిమానాలను ఆ లేఖలో చాటుకుంది. తన తమ్ముడ్ని సైతం పదేపదే ప్రస్తావించింది. తమ్ముడి పట్ల తనకున్న అభిమానాన్ని వివరించిన తీరు అందరినీ కదిలించింది. తనను బాగా చూసుకున్నారని తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఈ లేఖలోని అంశాలు చూసిన కుటుంబీకులు, స్థానికులు ఇంత ఘోరం చేశాడా, అని కన్నీటీపర్యంతం అవుతున్నారు. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బాలిక తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావటంలేదు. ‘న్యాయం చేయండి, మా బంగారు బొమ్మను మాకు తీసుకురండి’ అంటూ వారు తల్లడిల్లుతున్న తీరు చూపరులకూ కన్నీరు తెప్పిస్తోంది.
అలాంటి వాడు అనుకోలేదు..
ఇక పోలీసులు అపార్టుమెంట్ వాసులను విచారించినప్పుడు, బాలిక వచ్చీవెళ్లే సమయంలో మెట్లు, లిఫ్ట్ వద్ద వినోద్ జైన్ కనిపించేవాడని చెప్పారు. అయితే, అతని వయస్సు రీత్యా అనుమానం రాలేదన్నారు. ఇలా వికృత చేష్టలకు పాల్పడతాడని తాము ఊహించలేదని తెలిపారు. ఇంతటి నీచానికి పాల్పడిన దుర్మార్గుడికి ఉరిశిక్ష వేసినా తక్కువేనని చెప్పినట్లు తెలిసింది.
ఫుటేజీలో వికృత చేష్టలు
అపార్ట్‌మెంట్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీ ఫుటేజీలో కామాంధుని వికృత చేష్టల దృశ్యాలు ఉన్నట్లు తెలిసింది. బాలిక అపార్ట్‌మెంట్ నుంచి దూకే దృశ్యాలు కూడా రికార్డ్ అయినట్లు పోలీసులు తెలిపారు. అపార్టుమెంటు పిట్టగోడ చివర బాలికను గమనించిన ప్రత్యక్ష సాక్షులు.. కింద పడతావు అని అరుస్తున్నా దూకేసిందని.. అంతా నిమిషంలోపే సంఘటన జరిగిందని వారు చెబుతున్నారు.
మిన్నంటిన ఆందోళనలు
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వినోద్ జైన్‌ను కఠినంగా శిక్షించాలని కృష్ణాజిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, అందోళనలు మిన్నంటాయి. ఘటనపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. విజయవాడ సింగ్‌నగర్‌లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి ర్యాలీ నిర్వహించారు. భవానీపురంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు పి. చైతన్యరెడ్డి, గుడివాడ నరేంద్రల ఆధ్వర్యంలో స్కూలు పిల్లలతో కలిసి మానవహారం, ర్యాలీ చేపట్టారు. కుమ్మరిపాలెం, లెనిన్ సెంటర్‌లో కూడా చేపట్టారు. పలువురు కార్పొరేటర్లు కూడా తమ తమ డివిజన్లలో శాంతియుతంగా నిరసన తెలిపారు.
దోషిని కఠినంగా శిక్షించాలని విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్‌లో సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ నేతలు
ఇక జిల్లాలోని జగ్గయ్యపేట, నూజివీడు, పెడన, గుడివాడలలో శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లాలోనూ సోమవారం నిరసన ర్యాలీలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి ఆధ్వర్యంలో మహిళలు పెద్దఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. చీపురుపల్లిలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. బొబ్బిలిలో ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది.
కీచకులను టీడీపీ పెంచి పోషిస్తోంది : రోజా
టీడీపీ అధినేత చంద్రబాబు కీచకులను పెంచి పోషించడంవల్లే ఇలా రాష్ట్రంలో అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడిందని నగరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. వినోద్ జైన్‌కు వేసే శిక్ష ఎంత కఠినంగా ఉండాలంటే మరొకరు ఇలాంటి ఆలోచన చేయడానికే భయపడేలా ఉండాలన్నారు. బాలిక ఆత్మశాంతి కోసం సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో ఆమె పార్టీ నేతలతో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నిందితుడు వినోద్ జైన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని చెప్పారు. పైగా నారీ సంకల్ప యాత్ర దీక్ష చేపట్టడం వారికే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఈ దీక్ష వెనుక అసలు హీరో నారా లోకేష్ అని అందరికీ తెలుసునన్నారు. లోకేష్ పీఏ టీడీపీ మహిళలనే వేధిస్తున్నాడని ఆ విషయాన్ని కప్పిపుచ్చుకొనేందుకే ఈ నారీ దీక్ష చేపట్టి తన కొడుకును కాపాడుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని రోజా ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment