సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి కిరాతకం పోలీసులనే నివ్వెరపోయేలా చేసింది. కుటుంబ ఆస్తితో పాటు తండ్రి పెన్షన్‌కు అడ్డు తగులుతున్నారనే అక్కసుతో ఓ యువతి తన అన్న, తమ్ముడిని ప్లాన్ ప్రకారం హత్య చేసింది. అనంతరం, శవాలను కూడా మాయం చేసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల ప్రకారం..‘పల్నాడు జిల్లాలోని నకరికల్లు యానాది కాలనీకి చెందిన పౌలు రాజు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. నకరికల్లు గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సమయంలోనే ఆయన పక్షవాతంతో కొద్ది నెలల క్రితమే చనిపోయారు. పౌలు రాజు భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
పౌలురాజు పెద్ద కుమారుడు గోపీకృష్ణ, బొల్లాపల్లి మండలు, బండ్లమోటు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. రెండో సంతానమైన కుమార్తె కృష్ణవేణి పెళ్లైన తర్వాత కుటుంబ కలహాలతో భర్తను వదిలి పుట్టింట్లో ఉంటోంది. మూడో సంతానం దుర్గా రామకృష్ణకు వివాహమైనా కుటుంబ కలహాలతో భార్య విడిచి పెట్టింది. పెద్ద కొడుకు గోపికృష్ణ భార్య కూడా అతడిని విడిచిపెట్టడంతో ముగ్గురు తండ్రి దగ్గరే ఉంటున్నారు. ఈ క్రమంలో తండ్రి చనిపోయిన తర్వాత అతని ఆస్తికోసం ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆస్తితో పాటు ఆర్థిక ప్రయోజనాల కోసం ముగ్గురు సంతానం ఘర్షణ పడుతున్నారు. అనారోగ్యంతో ఉన్న తండ్రిని తానే చూసుకున్నందున తండ్రి డబ్బు మొత్తం తనకే దక్కాలని కుమార్తె గొడవ పడుతోంది.
అయితే, ఆస్తిని తన సోదరికి ఇచ్చేందుకు అన్నదమ్ములిద్దరూ అంగీకరించలేదు. ఈ విషయంలో కూడా వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. దీన్ని మనసులో పెట్టుకున్న కృష్ణవేణి.. ఆస్తిని దక్కించుకోవాలన్న దురుద్దేశంతో అన్నదమ్ములను హత్య చేయాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే వారిని కిరాకతంగా హతమార్చింది. గోపీకృష్ణకు మద్యం తాగే అలవాటు ఉండంటంతో డిసెంబర్ 10న అన్నకు అతిగా మద్యం తాగించి మెడకు చున్నీ బిగించి హత్యచేయగా.. తమ్ముడిని నవంబరు 26న కాల్వలో తోసేసి చంపేసింది. వీరి మృతదేహాలు ఇప్పటి వరకు దొరకలేదు.
ఇదిలా ఉండగా.. నకరికల్లులో మరో వ్యక్తితో కృష్ణవేణికి సంబంధం ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. అతడితో సాయంతో వారిని హత మార్చినట్టు తెలుస్తోంది. ఇక, కానిస్టేబుల్ గోపీకృష్ణ బండ్లమోటు పీఎస్‌కు విధులకు హాజరు కాకపోవడంతో వారి హత్య వ్యవహారం బయటకు వచ్చింది. వారి మృతదేహాలను ఏం చేసిందనేది తెలియాల్సి ఉంది. పోలీసులు.. కృష్ణవేణిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment