బంజారాహిల్స్: తెగిన గాలిపటం కోసం పరుగులు తీస్తూ ఓ బాలుడు తప్పిపోయిన ఘటన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా సీసీ కెమెరాల్లో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడకు చెందిన సింహాద్రి, అనసూయ దంపతులకు వినోదకుమార్ అనే 9 ఏళ్ల కొడుకు ఉండగా సంక్రాంతి పండుగకు 3 రోజుల క్రితం బంజారాహిల్స్ లోని ఇందిరానగర్ లో వుండే అమ్మమ్మ ఇంటికి వచ్చారు.
సోమవారం మధ్యాహ్నం వినోద్ తన తల్లి, అమ్మమ్మ తోకలిసి కేబీఆర్ పార్క్ వైపు వచ్చారు. అంతలోనే ఓ పతంగి తెగి గాలిలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో దాన్ని పట్టుకోవడానికి పరుగులు తీశారు. కొద్దిసేపట్లో తల్లి గమనించి కొడుకు కోసం గాలించింది. అక్కడే ఉన్న పోలీసులకు చెప్పి అంతటా వెతికింది.
కేబీఆర్ పార్క్ ఇంటర్సెప్టర్ 10 మెయిన్ గేట్ పోలీసు పీసీలు అక్షయకుమార్, మహేష్ కుమార్, హెచ్‌జీలు దినకర్, నరేష్, కృష్ణంరాజు స్పందించి పార్కు చుట్టూ గాలించారు. అనంతరం సీసీ కెమెరాల్లో పరిశీలించారు. అదే సమయంలో బాలుడు ఓ చోట కనిపించాడు. వెంటనే బాలుడిని గుర్తించి పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. ఓవైపు నెమళ్లు ఇంకోవైపు పతంగులు చూసి ఆనందంలో మునిగిపోయి వాటిని పట్టుకోవడానికి పరుగెత్తానని వినోద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment