
బాధితులు పట్టిచ్చారు.. పోలీసులు వదిలేశారు..
బంజారాహిల్స్: పోలీసు కస్టడీ నుంచి సెంట్రీ కళ్లు కప్పి నిందితుడు పరారైన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకొంది. వివరాలు.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లోని కౌశిక్ సొసైటీలో రాజస్తాన్‌కు చెందిన నసీర్ రాజ్‌పుత్ ఎస్‌ఆర్ సర్జికల్స్, ఈఎస్‌ఆర్ గార్మెంట్స్ పేరుతో కంపెనీ కార్యాలయం తెరిచి ఉద్యోగాల పేరుతో పలువురిని లక్షలాది రూపాయల మేర టోకరా వేసి కుటుంబం సహా పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నసీర్ రాజ్‌పుత్‌ను రాంచీలో పట్టుకున్నారు. అతడిని శనివారం అర్ధరాత్రి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు.
గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాజ్‌పుత్ తరచూ మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లసాగాడు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో సెంట్రీ, విధి నిర్వహణలో ఉన్న జమేదార్ నరేష్ కళ్లు కప్పి పరారయ్యాడు. పోలీసులు గాలించినా దొరకలేదు. కాగా, పరారీలో ఉన్న అతడిని పట్టుకోవడానికి తామంతా డబ్బులు జమ చేసి పోలీసులను విమానంలో రాంచీ వెళ్లేందుకు సహకరించామని, తీరా చూస్తే నిందితుడిని వదిలేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాంచీలో నిందితుడితోపాటు అతడి కుటుంబ సభ్యులు పట్టుబడ్డారని, వారంతా ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు. అలాగే నిందితుడు పట్టుబడ్డ సమయంలో రూ. 70 లక్షలు ఉన్నట్లు తమకు సమాచారం ఉందని బాధితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈ విషయంపై పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి దృష్టి సారించారు. నిందితుడి పరారీలో బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు.