హైదరాబాద్: కరోనా చెలగాటం సామాన్యులకు ప్రాణసంకటం.. ముందు నిద్రాణంగా ఉండి ఆ తర్వాత పంజా విసురుతోంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని కరోనా పరీక్ష చేయించుకుంటే ముందు నెగెటివ్ అని వస్తోంది.. ఆ తర్వాత సీటీస్కాన్‌లో అది పాజిటివ్‌గా తేలి ప్రాణాలు తీస్తోంది. ఈ విధంగానే ఓ ఏఎస్‌ఐని కబళించింది. కరోనాతో పోరులో చివరికి ఆయన కన్నుమూశాడు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ప్రేమ్‌కుమార్(55) ఏఎస్‌ఐగా మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలోనూ ఆయన రేయింబవళ్ళు సేవలందించారు. ఈ నెల 7వ తేదీన శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో అమీర్‌పేట్‌లోని నేచర్‌క్యూర్ ఆస్పత్రిలో కరోనా పరీక్ష చేయించుకోగా నెగెటివ్ అని తేలింది.
సీటీ స్కాన్‌లో పాజిటివ్ అని..
కరోనా కాకపోవచ్చని భావించిన ప్రేమ్‌కుమార్ ఎర్రగడ్డలోని నీలిమా ఆస్పత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు ప్రేమ్‌కుమార్‌కు íసీటీ స్కాన్ తీశారు. ఈ స్కాన్‌లో ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. కరోనా వల్లే ఈ ఇన్ఫెక్షన్ ఉండొచ్చని భావించిన వైద్యులు ఆయనను కోవిడ్ ఆస్పత్రుల్లో చేరాలని సూచించగా మళ్లీ నేచర్ క్యూర్ ఆస్పత్రికి వెళ్ళారు. నెగెటివ్ వచ్చిన వారికి ఇక్కడ వైద్యం చేయడం కుదరదని, ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు లేవని ఆస్పత్రివర్గాలు చెప్పడంతో కింగ్‌కోఠి ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చేరిన కాసేపటికే ఆక్సిజన్ సరఫరా సరిగా లేక ప్రేమ్‌కుమార్ కళ్ల ముందే ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.
దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఆయనను సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తమ వద్ద భద్రతాకార్డుపై చికిత్స అందించే సౌకర్యంలేదని ఆస్పత్రి వర్గాలు చేతులెత్తేశాయి. సోమవారం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో బెడ్ కోసం ప్రయత్నించారు. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో పోలీసు ఉన్నతాధికారుల చొరవతో అపోలో ఆస్పత్రిలో బెడ్ దొరికింది. అక్కడ ప్రేమ్‌కుమార్‌కు మరోసారి కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలింది. సోమవారం నుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ప్రేమ్‌కుమార్ గురువారం రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ప్రేమ్‌కుమార్ చనిపోవడంతో శోకసంద్రంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment