సాక్షి, హైదరాబాద్ : చిన్నారులకు పెద్దదిక్కుగా ఉంటూ వచ్చిన హక్కుల గొంతు మూగబోయింది. పిల్లలపై జరిగిన ఎన్నో అఘాయిత్యాలు, దారుణాలపై పోరాడి విజయం సాధించిన ఆయన కరోనాపై పోరులో ఓడిపోయారు. బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు పి.అచ్యుతరావు (58) కరోనాతో బుధవారం కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా నిర్ధారణైంది. అప్పటి నుంచి హోం ఐసోలేషన్‌లోనే ఉన్న ఆయన.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఈ నెల 15న మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో పాటు మూత్రపిండాల వైఫల్యం, మధుమేహం వంటి ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య అనురాధారావు, పిల్లలు ఉన్నారు. ఆయనతో పాటే వైరస్ బారినపడి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన ఆయన సోదరుడు, కార్టూనిస్ట్ శ్రీధర్ కోలుకొని బుధవారమే డిశ్చార్జ్ అయ్యారు.
బాలల హక్కుల గొంతై..
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లికి చెందిన అచ్యుతరావు చిన్నతనంలోనే కమ్యూనిస్టు ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. ఏఐఎస్‌ఎఫ్‌లో పనిచేశారు. బాలల హక్కుల కమిషన్ సభ్యుడిగా పనిచేశారు. పిల్లలకు ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా సహించేవారు కాదు. 1985లో ఆయన బాలల హక్కుల సంఘాన్ని స్థాపించారు. బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. బాలల హక్కులపై న్యాయస్థానాల్లోనూ పోరాటం చేశారు. ఆయన లేవనెత్తిన పలు అంశాలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సహా హైకోర్టును కూడా కదిలించాయి. బాలల హక్కుల పరిరక్షణ కమిటీ (ఎస్‌సీపీసీఆర్) సభ్యుడిగానూ ఆయన సేవలందించారు.
ప్రత్యూషకు అండగా నిలిచి..
ఎల్బీనగర్‌లో సవతి తల్లి చేతిలో శారీరక, మానసిక హింసకు గురైన ప్రత్యూషకు అండగా నిలిచారు. స్థానిక పోలీసులు, మీడియా సహకారంతో సవతి తల్లి బాధ నుంచి ఆమెకు విముక్తి కల్పించారు. అప్పట్లో ఇది జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. మతపరమైన వేడుకల్లో భాగంగా ఉపవాసం ఉండటంతో మృతిచెందిన జైన్ సమాజానికి చెందిన 13 ఏళ్ల ఆరాధన సమాదరియా కేసు, యాదాద్రిలో పిల్లల అక్రమ రవాణా, నల్లగొండ జిల్లాలో జంటలకు పిల్లలను విక్రయించడం వంటి అనేక అంశాలను ఆయన వెలికితీశారు. నారాయణగూడలోని కుబేరా టవర్స్‌లో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి.. అక్కడి నుంచే చిన్నారులు ఎదుర్కొనే ఎన్నో సమస్యలను పరిష్కరించే వారు. దంపతుల గొడవల మధ్య నలిగిపోయే పిల్లలను చేరదీసేవారు. బిహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ముంబై, ఢిల్లీ, ఛండీఘర్ వంటి ప్రాంతాల నుంచి బాలలను రప్పించి పనుల్లో పెట్టుకునే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించేవారు. ప్రముఖల ఇళ్లలో 18 ఏళ్లులోపు బాలలు పనిచేస్తున్నట్టు తెలిస్తే ఆయన వెంటనే స్థానిక పోలీసుల సాయంతో రెస్క్యూ చేసి మరీ సంరక్షించేవారు.
Comments
Please login to add a commentAdd a comment