సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఏర్పడిన వివాదాస్పద సంస్థ తెహరీకే తెహఫూజే షరియత్ ఇస్లామీ (టీటీఎస్‌ఐ) వ్యవస్థాపకుడు, పదుల సంఖ్యలో యువకుల్ని ప్రేరేపించి పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిక్షణకు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న మౌలానా మహ్మద్ నసీరుద్దీన్ శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇటీవలే ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీనికి చికిత్స పొందుతూ మృతిచెందాడు. సికింద్రాబాద్‌లోని గణేష్ దేవాలయం పేల్చివేతకు కుట్ర సహా అనేక ఉగ్రవాద సంబంధ కేసులు నసీరుద్దీన్‌పై ఉన్నాయి. ‘గణేష్ టెంపుల్’కేసును సీఐడీ దర్యాప్తు చేయగా... ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది.
నసీరుద్దీన్ కుమారులు రియాజుద్దీన్ నాసేర్, ముఖియుద్దీన్ జాబేర్ సహా మరొకరు సైతం ఉగ్రవాద సంబంధ కేసుల్లో అరెస్టయ్యారు. మహారాష్ట్రలోని యవత్‌మాల్ ప్రాంతానికి చెందిన నసీరుద్దీన్ కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి సైదాబాద్‌లో స్థిరపడ్డాడు. అప్పట్లో వ్యవసాయానికి అవసరమైన నీటిని తోడటానికి డీజిల్ పంపుల్నే వినియోగించేవారు. వాటిని బాగు చేయడంలో నిష్ణాతుడిగా పేరున్న నసీరుద్దీన్ ఆగాపుర ప్రాంతంలో బాష్ పంపులు, వాటి ఫిల్టర్లను రిపేర్ చేసే షెడ్డు ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం దీన్ని నసీరుద్దీన్ కుమారుడు నిర్వహిస్తున్నాడు.
గుజరాత్ జైలులో ఆరేళ్లు..
గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య తర్వాత అక్కడ భారీ విధ్వంసాలకు పన్నిన కుట్రను అక్కడి పోలీసులు ఛేదించారు. అక్కడి ప్రత్యేక బృందం ఈ కేసులో నసీరుద్దీన్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లింది. ఆ సందర్భంలో డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దాదాపు ఆరేళ్ల పాటు గుజరాత్ జైల్లో ఉన్న నసీరుద్దీన్ ఆపై విడుదలయ్యాడు. మిగిలిన కేసులు వీగిపోగా గణేష్ దేవాలయం పేల్చివేత కుట్ర కేసు మాత్రం విచారణలో ఉంది.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు సానుభూతిపరుడిగా ఆరోపణలు ఉన్న నసీరుద్దీన్ కొన్నాళ్ల క్రితం వహ్‌దత్ ఏ ఇస్లామి పేరుతో రాజకీయ పార్టీని స్థాపించాడు. నసీరుద్దీన్‌పై రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, విద్వేషాలు సృష్టించడానికి ప్రయత్నించడం తదితర ఆరోపణల పైనా కేసులు నమోదయ్యాయి. 20 ఏళ్ల క్రితం తన సోదరికి ఓ కిడ్నీ దానం చేసిన నసీరుద్దీన్ రెండో కిడ్నీ ఐదారేళ్ల క్రితం చెడిపోయింది. అప్పటి నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఇటీవలే కరోనా బారినపడిన ఆయన శనివారం ఉదయం చనిపోయాడు.
మారిన పంథా..
1992లో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత నసీరుద్దీన్ పంథా మారింది. ఆ సందర్భంలో అబిడ్స్ ఠాణా వద్ద జరిగిన ఉదంతాలకు సంబంధించి నసీరుద్దీన్ సహా మరికొందరిపై పోలీసులు టాడా యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బాబ్రీ మాదిరిగా కూలిపోయిన, కూల్చివేతకు గురైన ప్రార్థనా స్థలాలను మళ్లీ నిర్మించడం కోసమంటూ టీటీఎస్‌ఐ సంస్థను ఏర్పాటు చేశాడు. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియాపై (సిమి) నిషేధం విధించడానికి ముందు ఔరంగాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో నసీరుద్దీన్ సైతం పాల్గొనడంతో పాటు ఆ సంస్థ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యాడు. 1998లో వెలుగులోకి వచ్చిన పాకిస్థానీ సలీం జునైద్ కేసులో (హైదరాబాద్‌లో విధ్వంసాలకు కుట్ర) నిందితుడిగా ఉన్నాడు. అప్పట్లో నగర పోలీసులు సలీం జునైద్ నుంచి 10 కేజీలకు పైగా ఆర్డీఎక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్‌లో ఉన్న గణేష్ దేవాలయం పేల్చివేతకు పన్నిన కుట్రను పోలీసులు 2004లో ఛేదించారు. ఈ కేసులోనూ నసీరుద్దీన్ నిందితుడిగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment