
తల్లి ఔనంది... కూతురు కాదంది
హైదరాబాద్(బంజారాహిల్స్): తన కూతురిని ఓ యువకుడు వేధిస్తున్నాడని తల్లి ఫిర్యాదు చేసిన గంటలోనే అలాంటిదేమీ లేదని తననెవరూ వేధించడం లేదంటూ కూతురు ఆ యువకుడిని పోలీస్‌స్టేషన్ నుంచి తీసుకెళ్లిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్‌నగర్‌కు చెందిన విక్కీ అనే యువకుడు తన కూతురును వెంటపడుతూ వేధిస్తున్నాడని ఓ మహిళ శనివారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే తనను వేధించడం లేదని ఆయన వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని తన ఇష్ట్రపకారమే మాట్లాడుతున్నానంటూ సదరు యువతి పోలీసులకు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చింది. దీంతో ఎవరిని నమ్మాలో తెలియక పోలీసులు తలపట్టుకున్నారు. కూతురి మాట ప్రకారం పోలీసులు విక్కీని వదిలిపెట్టగా ఆమె స్వయంగా సదరు యువకుడిని బయటికి తీసుకురావడం విశేషం.