![man held for harassing telugu news channel anchor - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/26/banjara-hills-police-statio.jpg.webp?itok=xQ5kOZS_)
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్
సాక్షి, హైదరాబాద్ : తన ప్రేమను అంగీకరించకపోతే యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరిస్తున్న యువకుడిపై ఓ న్యూస్ ఛానెల్ యాంకర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే... ఫిలింనగర్‌లోని ఓ న్యూస్ ఛానెల్‌లో పని చేస్తున్న యాంకర్(28) మారుతి నగర్ చైతన్యపురి కాలనీలో ఉంటోంది. గత మూడు రోజులుగా రవీందర్ అనే వ్యక్తి ఆమె కార్యాలయానికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. తనను పెళ్ళి చేసుకోవాలని లేదంటే తనతో పాటు తన కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరిస్తున్నాడంటూ ఆరోపించింది.
ప్రతిరోజూ తనను వెంబడిస్తున్నాడని ఈ నెల 24న కార్యాలయంలోకి వచ్చి తనతో రాకపోతే యాసిడ్ పోస్తానంటూ బెదిరించాడని తెలిపింది. మూడేళ్ల క్రితం కూడా సదరు రవీందర్ తనను వేధింపులకు గురిచేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేశారని విడుదలై వచ్చిన తర్వాత మళ్లీ వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. అతడి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించింది. పోలీసులు రవీందర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment