విల్లామేరీ కాలేజీ ప్రిన్సిపాల్ ఫిలోమినా ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడు, ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో దొరికిన సీసీ పుటేజీలో నిందితుడు
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో నెల రోజుల వ్యవధిలోనే సంచలనం సృష్టించిన రెండు భారీ చోరీ కేసుల్లో నిందితుడొక్కరేనని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగతనం జరిగిన తీరు, సీసీ ఫుటేజీలో నిందితుడి ఆనవాళ్లు ఒకేరకంగా ఉండటం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఈ రెండు కేసుల్లోనూ నిందితుడి నడక, ఇళ్లల్లోకి చొరబడిన విధానం, చేతులకు వేసుకున్న గ్లౌజ్‌లు, ముఖానికి మాస్క్ ఒకేరకంగా ఉండటంతో ఈ రెండు దొంగతనాలకు పాల్పడింది ఒక్కరేనని నిర్ధారణకు వచ్చారు.
దీంతో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. జులై 22న తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–28లో ఉంటున్న విల్లామేరీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఫిలోమినా ఇంట్లోకి దొంగ పక్కింటి ప్రహరీ దూకి నేరుగా మొదటి అంతస్తులోకి చేరుకున్నాడు. కిటికీ డోరుతీసి లోపలికి ప్రవేశించి రూ.లక్ష నగదు, రూ.25 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలను దొంగిలించాడు. ఫెలోమినా ఇంటి చుట్టూ 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నప్పటికీ రెండు కెమెరాల్లో మాత్రమే నిందితుడి జాడ కనిపించింది. దీని ఆధారంగానే పోలీసులు దొంగకోసం గాలింపు చేపట్టారు.
బంజారాహిల్స్‌లో....
బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2లోని రియల్టర్ తిక్కవరపు ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో ఆగస్టు 27న భారీ చోరీ జరిగింది. నిందితుడు ఇంటి వెనకే ఉన్న జపనీస్ గార్డెన్ ప్రహరీ దూకి వెనుకాల గ్లాస్ డోర్ తెరుచుకొని సరాసరి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి కబోర్డులో ఉన్న సుమారు రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలను మూటకట్టుకొని వచ్చినదారిన ఉడాయించాడు. ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో 14 సీసీ కెమెరాలు ఉండగా కేవలం రెండింట్లో మాత్రమే నిందితుడి జాడ కనిపిస్తోంది. మిగతా కెమెరాలన్నీ అడ్డదిడ్డంగా ఏర్పాటు చేయడం వల్ల నిందితుడికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు దొరకడం లేదు. అయితే గేటులోకి రావడం, లోపలికి ప్రవేశించడం అన్నీ కనిపిస్తుండటంతో కొంత సమాచారం లభ్యమైంది.
చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్, కాళ్లకు చెప్పులు లేకుండా ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో దొంగతనం చేసిన వ్యక్తే ఫిలోమినా ఇంట్లోనూ ఇదే తరహా లో చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రెండు దొంగతనాలకు దగ్గరి ఆనవాళ్లు కనిపిస్తుండటంతో పాటు రెండు సీసీ ఫుటేజీల్లోనూ అతడి నడక ఒకేలా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ రెండు దొంగతనాలు ఒక్కడే చేసినట్లుగా ఇప్పటికే నిర్ధారణకు వచ్చిన పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు రెండు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న 150 సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు.
పరిసర పోలీస్‌స్టేషన్ల పరిధిలోనూ దొంగతనం జరిగిన సమయాన్ని ప్రమాణికంగా తీసుకొని సీసీ కెమెరాలు వడపోస్తున్నారు. రెండు పోలీస్‌స్టేషన్ల పరిధిలోని క్రైం పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇప్పటి వరకు 250 సీసీ కెమెరాలను పరిశీలించారు. ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు దొంగ ఇంట్లోనే ఉన్నట్లు సీసీ ఫుటేజీల్లో స్పష్టం కావడంతో అంతకుముందు ఆ తర్వాత ప్రధాన రోడ్డులో రాకపోకలపై పోలీసులు దృష్టి సారించారు. మొత్తానికి రెండు దొంగతనాలకు పాల్పడిన దొంగ కోసం 66 మంది పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment