బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు | Brs Mla Padi Kaushik Reddy Is Angry On Banjara Hills Police | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

Published Wed, Dec 4 2024 6:42 PM | Last Updated on Wed, Dec 4 2024 7:11 PM

Brs Mla Padi Kaushik Reddy Is Angry On Banjara Hills Police

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు 20 మంది అనుచరులపై కూడా కేసు నమోదైంది. విధులను అడ్డగించడంతో పాటు బెదిరింపులకు దిగారంటూ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంపై ఫిర్యాదు చేసేందుకు కౌశిక్‌రెడ్డి బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.

అయితే, తాను వెళ్లకముందే ఏసీపీ వెళ్లిపోవడం పట్ల కౌశిక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బంజారాహిల్స్ ఏసీపీ నన్ను మూడు గంటలకు ఫిర్యాదు తీసుకోవడానికి రమ్మన్నారు. నేను వెళ్లకముందే ఏసీపీ వెళ్లిపోయారు. సీఐ మా ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారు’’ అంటూ మండిపడ్డారు.

‘‘నా ఫోన్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఇంటిలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు ఇచ్చాను. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేస్తే హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న నేను ఫిర్యాదు చేస్తే రేవంత్ రెడ్డిపై వెంటనే కేసు పెట్టాలి. రేవంత్ రెడ్డి పాపాలకు భూకంపం వస్తుంది. బంజారాహిల్స్ ఏసీపీ, సీఐ ప్రవర్తన తీరు సరిగ్గా లేదు. పోలీసులు ఎందుకు అతి చేస్తున్నారు.

..పోలీసులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కాంగ్రెస్ మానకొండూరు ఎమ్మెల్యే చెప్పారు. ప్రభుత్వం అధికారుల ఫోన్లను ట్యాప్ చేస్తుంది. కరీంనగర్ సీపీ ఫోన్ ట్యాప్ చేశారు. బీఆర్ఎస్ నేతల అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కవిత, సంతోష్ రావు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వాన్ని నిలదీస్తాం’’ అని కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement